
సీపీఐలో ఆధిపత్య పోరు
భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాష్ట్ర కార్యదర్శి ఎన్నికలో ఇది స్పష్టమైంది.
మూడు రోజుల పాటు ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభలు కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేయడంతో ముగిశాయి. అయితే రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక వాయిదా పడింది. మహాసభల ముగింపు రోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు కసరత్తు జరిగినా కార్యదర్శిని పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకోలేకపోయింది. ఎన్నిక లేకుండా రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవాలనే పెద్దల ఆలోచన ఫలించలేదు. జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి ఒంటి గంటకు కూడా కార్యదర్శి ఎంపిక వ్యవహారం తేలకపోవడంతో జాతీయ మహా సభల తరువాత రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక నిర్వహించాలని సీపీఐ నూతన రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.
ప్రస్తుతం సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కె రామకృష్ణ ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎన్నిక కావడంతో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రామకృష్ణ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో గుంటూరుకు చెందిన సీనియర్ లీడర్ ముప్పాళ్ల నాగేశ్వరరావును రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవాలని, ఆ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలని నారాయణతో పాటు మరికొందరు రాష్ట్ర నాయకులు భావించారు. అయితే ముప్పాళ్ల నాగేశ్వరరావును వ్యతిరేకించే వర్గం తయారు కావడం, సోమవారం రాత్రి ముప్పాళ్ల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభ హాలు వద్ద కొందరు ముఖ్య నాయకులు గుమికూడి రచ్చ చేశారు. వేదిక మీదకు వెళ్లి అందరి సమక్షంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు పేరును రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటిద్దామనుకునే సమయంలో వ్యతిరేక వర్గం నుంచి నినాదాలు రావడంతో పార్టీ పెద్దలు కూడా వెనుకడుగు వేశారు.
విశాఖపట్నం కు చెందిన జెవీవీఎన్ మూర్తి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారు. అయితే రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి గుజ్జుల ఈశ్వరయ్య పేరు తెరపైకి రావడం, ఆయనకు మద్దతు పలికే వారు ఎక్కువ మంది వేదిక కింద ఆందోళనకు దిగటంతో రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు.
కొత్త కార్యవర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శి ఎన్నికయ్యే వరకు పాత కార్యవర్గం, రాష్ట్ర కార్యదర్శిగా కె రామకృష్ణ కొనసాగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మహాసభల ముగింపు రోజు కొత్త కార్యదర్శి ఎన్నిక వర్గ రాజకీయాలకు రాష్ట్ర సీపీఐలో దారి తీసింది.