
పెంచలకోన బ్రహ్మోత్సావాలకు పటిష్ట చర్యలు
సింహాచలం అప్పన్న స్వామి ఆలయం ప్రమాదం జరిగిన నేపథ్యంలో యంత్రాంగం అలెర్ట్ అయింది.
సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం చందనమహోత్సవంలో ఇటీవల ప్రమాదం చోటు చేసుకన్న నేపథ్యంలో త్వరలో జరగనున్నపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో అప్రమత్తంగా ఉండాలని, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శనివారం పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు.
అనంతరం పాలక మండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై పాలక మండలి సభ్యులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా, భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆలయ అర్చకుల సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అన్నారు. వేసవి సందర్భంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందు వల్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆనం ఆదేశించారు. బ్రహ్మోత్సవాల జరిగే సమయంలో దాదాపు 12 రోజుల పాటు కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా మోనటరింగ్ చేయాలని సూచించారు.
పులి సంచారంపై కూడా అధికారులతో మంత్రి చర్చించారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల పట్ల అధికారులల్లో ఎక్కడ అలసత్వం ఉండకూడదన్నారు. దేవాదాయ శాఖతో పాటు తక్కిన శాఖలన్నీ సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. పెనుశిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతగా నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా రోడ్ల మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.