జనవరి 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. దీని కోసం కట్టుదిట్టమైన భద్రతల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ఆ మేరకు శుక్రవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు, భద్రత చర్యల మీద సమీక్షించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా చూడాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ కార్యక్రమం ఖరారై రావాల్సి ఉందన్నారు.
ఈనెల 8వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకుని సంపత్ వినాయక గుడి నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే సభా వేదిక వరకూ రోడ్డు షో నిర్వహిస్తారని, దీనికి పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు,ప్రజా ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని, వారి వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. అల్పాహారం, భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావీయకుండా చూడాలన్నారు. విశాఖపట్నం జిల్లా కలక్టర్ హరీంద్ర ప్రసాద్ మట్లాడుతూ ప్రధాని పర్యటనకు విశాఖనగరంలో లక్షా 20వేల మందిని, విశాఖ గ్రామీణం నుంచి 10వేల మందిని, అనకాపల్లి జిల్లా నుండి 40 వేల మందిని తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖ నగరంలో 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు కమీషనర్ బాగ్జీ తెలిపారు.
ప్రధాని మోదీ చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పూడిమడకలో ఎన్‌టిపిసి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్‌ను కూడా ప్రధాన మంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.