అయ్యయ్యో.. ఇదేం అమానుషం, ఆ పసి పిల్లలకు అంత శిక్షా!
x
పిల్లల్ని కొట్టి హింసించి ఒకరి మృతికి కారణమైన లక్ష్మీ, ఆమె భర్త సాగర్

అయ్యయ్యో.. ఇదేం అమానుషం, ఆ పసి పిల్లలకు అంత శిక్షా!

తల్లి తర్వాత తల్లి అంతటి దానివే.. ఆరేళ్ల పిల్లల్ని అంత దారుణంగా హింసించి చంపాల్నా.. మాతృత్వానికి మచ్చ తెచ్చావు అంటూ ఫిరంగిపురం వాసులు వాపోతున్నారు


'వాళ్లు నీ పిల్లలు కాదు సరే.. అయినా అంత అమానుషంగా ఎలా ప్రవర్తించావు లక్ష్మీ.. అతని జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు, ఎందకంత క్రూరంగా ప్రవర్తించావు. తల్లి తర్వాత తల్లి అంతటి దానివే.. ఆరేళ్ల పిల్లల్ని అంత దారుణంగా హింసించి చంపాల్నా.. మాతృత్వానికి మచ్చ తెచ్చావు' అంటూ ఫిరంగిపురం వాసులు వాపోతున్నారు. తన వారసులకు వీళ్లెక్కడ అడ్డం వస్తారోనని సవతి పిల్లల్ని రాసిరంపాన పెట్టిందో తల్లి ఈ ఊర్లో.. అభం శుభం తెలియని ఆరేళ్ల పిల్లల్ని ఒక్క మాటలో చెప్పాలంటే 'కాల్చుకుతిన్నదంటే' అతిశయోక్తి కాదు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్‌ తాపీ పని చేస్తూ ఫిరంగిపురంలో కాపురం ఉంటున్నాడు. అతనికి కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో 10 ఏళ్ల కిందట పెళ్లయింది. ఆమెకు మొదటి కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలు కార్తీక్‌(6), ఆకాశ్‌(6)లు పుట్టారు. తర్వాత రెండోసారి గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి ఆమె చనిపోయింది. ఆ చిన్నారిని వేరేవాళ్లకు దత్తత ఇచ్చేశారు. వీళ్లనీ ఎవరికైనా దత్తతకు ఇస్తే ఏ బాదరబందీ లేకపోయేది. కానీ సాగర్ మగ పిల్లల్ని తన వద్దే ఉంచి పెంచుకుంటున్నాడు.
రెండేళ్ల కిందట సాగర్‌కు గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి కుటుంబమంతా ఫిరంగిపురంలోనే ఉంటున్నారు. 8 నెలల క్రితం లక్ష్మి ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటివరకు కవలలిద్దరినీ బాగానే చూసుకున్న ఆమె.. ఆ తర్వాత వారిని వేధించడం మొదలుపెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలకు నరకం చూపుతోంది. ఈ విషయం తెలిసినా భర్త పట్టించుకోలేదు. ఇది ఆమె మరింత రెచ్చిపోయేలా చేసింది.
నెత్తురు కారేలా వాతలు, వంటి నిండా గాయాలు...
సరిగ్గా ఉగాదికి ముందు రోజు లక్ష్మీ ఆ పిల్లల్ని తీవ్రంగా కొట్టింది. వారి అరుపులు, ఏడుపులు విని ఇరుగుపొరుగువారు- పిల్లల మేనత్తకు- సమాచారం ఇచ్చారు. ఆమె హుటాహుటిన ఫిరంగిపురం వచ్చారు. ఆమె అక్కడి దృశ్యాల్ని చూసి కన్నీరు మున్నీరైంది. అప్పటికే కార్తీక్‌ వంటి నిండా నెత్తుటి గాయాలతో స్పృహతప్పి ఉన్నాడు. మరో బాలుడు ఆకాశ్‌ను వేడెక్కిన అట్లపెనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టడంతో కాలిన గాయాలతో విలవిల్లాడుతున్నాడు.
అది చూసిన ఆమె- లక్ష్మీని, సాగర్ ని నిలదీసింది. చుట్టుపక్కల వారు పోగయ్యారు. దీంతో పిల్లల్ని తీసుకుని వారు కొండవీడు వెళ్లిపోయారు. దీంతో పిల్లల మేనత్త స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కొండవీడు చేరుకునే సరికే కార్తీక్‌ చనిపోయాడు. కాలినగాయాలతో ఉన్న ఆకాశ్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కార్తీక్, ఆకాశ్‌లు తన వారసత్వానికి అడ్డు వస్తారని భావించి లక్ష్మి ఈ దారుణానికి పాల్పడిందని విజయ, ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పిల్లల్ని కొట్టినట్లు ఆధారాలు సేకరించామని, వారి ఒంటిపై రక్తపు గాయాలున్నాయని ఫిరంగిపురం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
పిల్లల్ని చిత్ర హింసలు పెట్టినట్టు తెలుసుకున్న చుట్టుపక్కల వారు సాగర్ దంపతులను శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లల్ని వేధించిన తీరు అమానుషమని తిట్టిపోస్తున్నారు.
Read More
Next Story