
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి. కిరణ్ రాయల్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు.
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై పార్టీ తరపున విచారణకు ఆదేశించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ చర్యలు ప్రారంభించింది. కిరణ్ రాయల్ పై పార్టీ తరుపున విచారణకు ఆదేశించింది. అంతేగాక అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొద్దిరోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. కిరణ్ రాయల్ శారీరకంగా వాడుకొని తనను మోసం చేశాడని, కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేసి మోసగించాడని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. అంతేగాక కిరణ్ రాయల్ తనని ఫోన్ లో బెదిరించిన ఆడియోలు విడుదల చేసి, ఆత్మహత్య చేసుకుంటానని ఆ మహిళ వీడియో సందేశం విడుదల చేసింది.దీనిపై కిరణ్ రాయల్ స్పందిస్తూ. తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయిస్తున్నారని, క్రిమినల్ లేడీతో నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. అలాగే ఆ లేడీ తనకు కోటి రూపాయలు ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, ఇదంతా వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయం అని మండిపడ్డారు. అనంతరం బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకి వచ్చింది. దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. దీంతో జనసేన అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది.కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపవలసిందిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. తదుపరి పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిందిగా నిర్ణయించింది. అంతేగాక ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలకు, నాయకులకు. పార్టీ అధ్యక్షులు స్పష్టం చేశారని, చట్టానికి ఎవరు అతీతులు కారని, చట్టం తన పని తాను చేస్తుందని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లేఖ విడుదల చేసింది.