
గురజాడ, వీరేశలింగం పంతులు, గిడుగు అప్పారావు
రాష్ట్ర సంస్మరణీయుల జాబితాను సవరించాలి
జాబితాకి గురజాడ, కందుకూరి, గిడుగు పేర్లు చేర్చాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంస్మరించుకునే వారి జాబితాను సవరించాలని, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి పేర్లను ఆ జాబితాలో చేర్చాలని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి డిమాండ్ చేశారు.
కర్నూలు టిజివి కళాక్షేత్రంలో శనివారం ఆయన విలేకరులతో ముఖాముఖిగా మాట్లాడారు. కవులు, కార్టూనిస్టులు, పాత్రికేయులు ఏమి రాసినా సహించలేని లక్షణం పెరిగిపోతోందని, ఇది ఆమోదించలేని పరిణామమని తెలిపారు. భావ ప్రకటన, విమర్శనాత్మక స్వేచ్ఛ మీద దాడి ఆందోళన కలిగిస్తోందన్నారు.
కర్నూలులో కవి వెంకటేశ్వర్లు కవిత రాస్తూ పోలీసులు నిర్భందించారని, ఎవరి పేరూ లేకున్నా దోపిడీ, అవినీతి అంటే మాదే అని ఎందుకు అనుకుంటున్నారని, సంకెళ్లు వేయాలని ఎందుకు అనుకుంటున్నారని సందేహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎవరి మీదైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చని, విమర్శను తట్టుకోలేం కాబట్టి ఏదైనా చేస్తాం అంటే సహించబోమని చెప్పారు. భావ ప్రకటన, విమర్శనాత్మక స్వేచ్ఛలను, మత సామరస్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమన్నారు.
దేశం భిన్న మతాలు ఉన్న దేశమని, మధ్యప్రదేశ్ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆయనపై ఏ చర్యలూ తీసుకోలేదని, ఆశోక యూనివర్సిటీకి చెందిన అలీఖాన్ మహమ్మద్ భారతదేశం గురించి ఉన్న మాట మాట్లాడినందుకు కేసు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఎవరూ వద్దనడం లేదని, తెలుగు మీడియాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని కోరారు.
అమిత్ షా మానవ హక్కుల గురించి మాట్లాడటంతో అందరూ షాక్ అయ్యారని, ఎపిలో కొత్త న్యాయ చట్టాలను సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుందని అమిత్ షా సమీక్ష చేశారని తెలిపారు. ఏ సినిమా విడుదల చేస్తున్నా రాజకీయ వివాదం చేస్తున్నారని, హరిహరవీరమల్లు సినిమాపై హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని, ప్రభుత్వ పరంగా మంత్రి ఆదేశాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటి పరిస్థితులకు తగినట్లు పుస్తకాలను సరి చేయాలన్నారు.
విద్యాలయాలు, వైద్యాలయాలు, గ్రంథాలయాలకు సరైన ప్రాధాన్యత ఉండాలన్నారు. రంగ స్థలాన్ని, షార్ట్ ఫిలింలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆడిటోరియాలను పెట్టాలని, బాలల రంగస్థలాలను కూడా ప్రోత్సహించాలని కోరారు. మానిటైజేషన్ కాకుండా మానవైజేషన్ కావాలన్నారు.
హైకోర్టు బెంచి ఇప్పటికీ ఎందుకు పెట్టలేదు
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అందరూ ఒప్పుకున్నారని, తరువాత బెంచి పెడతామని చెప్పారని తెలిపారు. ఇప్పటి వరకూ కర్నూలులో హైకోర్టు బెంచి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బనకచర్లకు నీళ్లు తేవాలంటే నిధులు కావాలి కదా అన్నారు. న్యాయ విశ్వవిద్యాలయం వేరే చోట పెట్టాలని నిర్ణయించారని, ఈ ప్రాంతం అన్నీ వదులుకోవడం మంచిది కాదన్నారు. సమతుల్యత కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బనకచర్ల ప్రయివేటు ప్రాజెక్టు అనడం ఏంటని, అన్నీ ప్రయివేటీకరణ చేసి ఇప్పడు ప్రాజెక్టులను కూడా ప్రయివేటీకరణ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ అన్ని అంశాలపై సాహితీ స్రవంతి కృషి చేస్తుందన్నారు. వందేళ్ల క్రితమే కర్నూలులో ముద్రణ ఉందని అందరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. ప్రయివేటీకరణ పేరుతో అన్నిటికీ చాప చుట్టేస్తున్న పరిస్థితుల్లో సాంస్కృతిక రంగం, రంగ స్థలం గురించి అధ్యయనం చేయాలన్నారు. ఎపిజిబి ప్రధాన కార్యాలయం అమరావతికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని, కడపలోనే ఉంచాలని తెలిపారు. సాంస్కృతిక అవశేషాలను, చిహ్నాలను పెంచాలని, బెలుం గుహలు, కేతవరం గుహలపై దృష్టి పెట్టాలని కోరారు. రాజధాని పనులు వేగంగా సాగడం లేదని, ప్రభుత్వాలు మారినపుడల్లా మళ్లీ మొదటికి వస్తోందని గుర్తుచేశారు.
ముఖాముఖిలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంద్యాల రఘుబాబు, రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, జిల్లా గౌరవాధ్యక్షులు ఎంపి బసవరాజు పాల్గొన్నారు.
Next Story