
అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం
ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవదాయ సహా పలు శాఖల పనితీరుపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..“రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలి. శ్రీవారి సేవకుల తరహాలోనే అన్ని దేవాలయాల్లో సేవలు చేసే వారిని గుర్తించాలి. వారి జాబితాను సిద్దం చేయాలి.. వారి సేవలను వినియోగించుకోవాలి. భగవంతుని సేవ చేసేందుకు చాలా మంది భక్తులు ముందుకు వస్తారు. ఇలా ముందుకు వచ్చిన వారిని ప్రొత్సహించండి. శ్రీశైలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా పీహెచ్సీలు, అర్బన్ పీహెచ్సీ, సీహెచ్సీలు మొదలుకుని జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి. పరిశుభ్రతతో ఉండాలి. కలెక్టర్లు రెగ్యులర్ అంశాలపై ఫోకస్ చేస్తూనే... కీలకమైన శాఖలు, విభాగాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. ప్రజలు నిత్యం సందర్శించే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాస్పత్రుల్లో క్షేత్ర స్థాయి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. రోగాల బారిన పడి వచ్చే వారికి మంచి సేవలు అందించాలి. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. సర్వేలు చేపట్టే విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. సర్వే చేయించుకునే వారు ఇబ్బందులు పడకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పని చేయాలి. రెవెన్యూ శాఖకు కొన్ని విషయాల్లో ఉన్న చెడ్డ పేరు తొలగించుకునేలా చేయాలి.

