
2 వేల హెక్టార్ల అటవీ భూమిలో శ్రీశైలం దేవాలయం అభివృద్ధి
ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించు కొనేందుకు శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఆయనతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ, అటవీశాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధి పై సీఎం చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించు కొనేందుకు శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయనతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు. డోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను దేవాలయానికి కనెక్టు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం పేర్కొన్నారు.
దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ, గిరులపైనే ఉన్నాయని వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు సౌకర్యాలను కల్పించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవని అన్నారు. భూమి అందుబాటులో లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించలేమని.. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి అటవీ మంత్రిత్వశాఖకు ఈ అంశాలను వివరించాలని సూచించారు. ఆయా ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలను కూడా రాష్ట్రప్రభుత్వం సంరక్షిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల అభివృద్ధిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
Next Story