ఆ కొండలో, ఈ పురంలో – మోసం ఒకటే..
x
శ్రీహరిపురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు

ఆ 'కొండ'లో, ఈ 'పురం'లో – మోసం ఒకటే..

'రెరా' తలుపు తట్టిన శ్రీహరిపురం కో ఆపరేటివ్ సొసైటీ సభ్యుల్ని సంఘం నేతలు ఎలా మోసం చేశారో సీనియర్ జర్నలిస్టు కేవీ కృష్ణ తన కథనంలో వివరించారు..


(కేవీ కృష్ణ, విజయవాడ)
కేతనకొండ, విస్సా కోడూరు – రెండు చోట్లా ఒకే స్కెచ్... ఒకటే మోసం, ఒక్కరే నేత.. ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సోసైటీ పేరుతో సభ్యుల్ని మభ్యపెట్టి కోట్లాది రూపాయలు దండుకున్న సొసైటీ నేత ఎ.సుబ్బరాజు... ఇప్పుడు రెండోసారి రెరా ట్రిబ్యునల్ ముందు నిలబడబోతున్నారు.
కేతనకొండలోని హౌసింగ్ వెంచర్‌పై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తాజాగా ఇచ్చిన తీర్పుతో భీమవరం జిల్లా, విస్సా కోడూరు, శ్రీహరిపురం బాధితులు న్యాయ పోరాటానికి నడుంకట్టారు.
విజయవాడ సమీపంలోని కేతనకొండలోను, అలాగే భీమవరం నగర శివార్లలోని విస్సా కోడూరు లోను,ఒకే పేరుతో ‘కోపరేటివ్ హౌసింగ్ సోసైటీ’ పేరుతో స్థలాలు అమ్ముతున్న అడ్డాల సుబ్బరాజు – రెండు ప్రాంతాల్లోనూ వేర్వేరు బాధితులను మోసం చేసిన ఘనతను మూటకట్టుకున్నారు. నిజానికి ఇక్కడ మోసం వ్యక్తిగత నష్టమే కాదు, కోపరేటివ్ డిపార్ట్‌మెంట్ పైన ప్రజలకున్న నమ్మకాన్ని తుడిచిపెట్టడం..
వాస్తవంగా ఇది కోపరేటివ్ వ్యవస్థకు మచ్చ. పెద్ద పెద్ద మాటలతో ప్రభుత్వ శాఖల సహకారంతో నకిలీ హౌసింగ్ కోపరేటివ్‌లు ఏర్పరచి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే సుబ్బరాజు వంటి వాళ్ల జాడ్యం – ఇందులో కోపరేటివ్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేతనకొండలో 828 ప్లాట్లతో 725 మంది సభ్యులను ఆకర్షించి, 126 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సొసైటీ, భీమవరంలోని శ్రీహరిపురంలో 26.93 ఎకరాలలో 214 మంది సభ్యుల నుంచి షుమారు గా 55 కోట్ల రూపాయలు దోచుకున్నాడని సభ్యులు డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు వెంచర్లలోనూ రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా లేక, సభ్యుల కలలు శ్మశానంగా మారాయి.
సభ్యుల వేదన ఇలా ఉంది....
కేతనకొండలో 725 మంది, శ్రీహరిపురంలో 214 మంది సభ్యులు తమ జీవిత సంపాదనను పెట్టుబడిగా పెట్టి, సొంత ఇల్లు కలను సాకారం చేసుకోలేక, ఆర్థిక, మానసిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. సుబ్బరాజు అధికార పలుకుబడితో, సహకార శాఖ మౌనంతో, అక్రమ తీర్మానాలు, బౌన్సర్లతో బెదిరింపులు, ఆస్తి దుర్వినియోగంతో సభ్యుల విశ్వాసాన్ని దెబ్బతీశాడు. రెరా తీర్పు ఈ దోపిడీకి చెక్ పెట్టి, సభ్యుల పోరాటానికి బలం చేకూర్చింది.
శ్రీహరిపురం స్కాం ఇది...
భీమవరం జిల్లా విస్సాకోడేరులో 'శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ' పేరుతో ఆడ్డాల సుబ్బరాజు 26 ఎకరాల 93 సెంట్ల వెంచర్‌ను ఏర్పాటు చేశాడు. (12 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి , ఇది సహకార సూత్రాలకు విరుద్ధం ) ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదంతో (LP నెం. 30/2022/1172/DTCP/DPMS, 03-11-2022) ప్రారంభమైన ఈ వెంచర్‌లో సంఘం సొంత భూమి కేవలం 5.85 ఎకరాలు మాత్రమే, మిగిలినది 12 మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి సమీకరించారు.
214 మంది సభ్యులు, సభ్యేతరులు పెట్టుబడి పెట్టినప్పటికీ 18-05-2025 నాటికి రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా లేకుండా వెంచర్ పాడుబడి, సభ్యుల కలలను శ్మశానంలా మార్చింది. 1995 సహకార చట్టాన్ని ఉల్లంఘిస్తూ, 2016లో తీర్మానం నెం.09 ద్వారా సభ్యేతరులకు ప్లాట్లు కేటాయించి, సహకార సూత్రాలను తుంగలో తొక్కారు. 100 రోజుల్లో ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీలా మారి, సభ్యులను మోసం చేశారు. 2023 జనవరిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించినప్పటికీ, 50 మందికి కూడా పూర్తి కాలేదు. ఎకరానికి 80 లక్షల లోటు అని చెప్పి, అగ్రిమెంట్‌ను మించి 20% అధిక వసూళ్లతో సభ్యులను నష్టపరిచారు. 2021లో కె.వి.వి.ఎస్.ఎన్ ఎస్టేట్స్‌తో 70 ఎకరాల అభివృద్ధి పేరుతో అక్రమంగా నాలుగు ఒప్పందాలు చేసి, 12 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించి, 2022 సెప్టెంబర్‌లో రద్దు చేసి సంఘానికి నష్టం కలిగించారు. డిటిసిపి నిబంధనల ప్రకారం అభివృద్ధి జరగక, 2022-23 ఆడిట్‌లో 12 కోట్ల ఖర్చు చూపినప్పటికీ, వెంచర్‌లో రోడ్లు, గోడలు, డ్రైనేజీలు లేవు. సొసైటీ ఆస్తిని ఐకెఎఫ్ ఫైనాన్స్‌కు 1.5 కోట్ల అప్పుకు తాకట్టు పెట్టి, సహకార నియమాలను సుబ్బరాజు అతిక్రమించారు. పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని “కోఆపరేటివ్" అంటే ప్రభుత్వం అనుమతిచ్చిన సంస్థ అనుకునే విశ్వాసాన్ని దుర్వినియోగం చేశాడు. వేలాది రూపాయలు వసూలు చేసుకుని, ప్లాట్ బదులు హామీలు మాత్రమే ఇచ్చాడు. ఎలాంటి అధికార అనుమతులు లేకుండానే వంచనకు పాల్పడ్డాడు.
భీమవరంలో స్థిరపడాలన్న కలలతో నమ్మిన ప్రభుత్వ ఉద్యోగులు మోసపోయారు. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ – శ్రీహరిపురం లేఅవుట్” పేరుతో సాగిన అక్రమాలు నేటికీ శుద్ధి కాలేదు. వందలాది మంది సభ్యుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కమిటీ, ఇప్పటివరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయకపోవడమే కాదు – (EUDA) ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి తాకట్టు పెట్టిన ప్లాట్లను తృతీయ పక్షాలకు దొడ్డిదారిలో అమ్మేస్తూ సొసైటీ అధ్యక్షుడు సుబ్బరాజు మరింతగా మోసాలకు తెగబడ్డాడు. దీనిపై చాలా ఫిర్యాదులకు ఇప్పటి వరకూ సదరు జిల్లా సహకార శాఖ నుంచి సరైన స్పందన లేదు.
ఏకపక్ష నివేదిక
టి. సాయి ప్రభాకర్ వర్మ సహా 39 మంది సభ్యుల ఫిర్యాదు (PGRS నెం. WEG202505195042)పై జిల్లా సహకార అధికారి యస్. మురళీకృష్ణ విచారణ నిర్వహించారు. 214 మంది సభ్యులు పూర్తి చెల్లింపులు, 20 మంది 90% చెల్లింపులు చేసినప్పటికీ, మౌలిక సదుపాయాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్ ఆలస్యాలు, పొరపాట్లను సీరియస్‌గా పరిగణించకుండా, సంఘ అధ్యక్షుడి హామీలను ఆమోదించి, ఆర్థిక లావాదేవీలు పారదర్శకమని తేల్చారు. నవంబర్ 2025 నాటికి అభివృద్ధి, రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సూచించి, విషయాన్ని ఎన్.టి.ఆర్ జిల్లా సహకార అధికారికి బదిలీ చేసి, విచారణ ముగించారు. ఈ ఏకపక్ష నివేదిక సభ్యుల ఆవేదనను నిర్లక్ష్యం చేసి, అవినీతిని కప్పిపుచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిపార్ట్ మెంట్ వారే ‘మాకు కాదు కంప్లైంట్ చేయవలసింది , ట్రిబ్యునల్ కి వెళ్ళండి’ అని నాకే చాలా సార్లు చెప్పారని సభ్యులు తెలిపార. పైగా 95యాక్ట్, మాక్స్ సొసైటీ పై చర్యలు తీసుకోవడానికి పరిమిత అధికారాలుంటాయని సాకు చెబుతూ మోసగాడికి వంతపాడారని సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. హౌసింగ్ కోపరేటివ్ పేరుతో మోసం జరిగే విధానంపై ప్రత్యేక దర్యాప్తు అవసరం బాధితులు కోరుతున్నారు.
రెరా తలుపు తట్టిన బాధితులు
కేతనకొండ తీర్పు వెలువడిన వెంటనే, విస్సా కోడేరు బాధితులు రెరా తలుపు తట్టారు.

రెరా వారు కేసును స్వీకరించడమే కాదు, సోమవారం వారు అథారిటీ ముందు హాజరుకావాలని ఆహ్వానించారు.

పోరాటానికి ఊపిరిపోసిన రెరా తీర్పు
కేతనకొండలో ని హౌసింగ్ సొసైటీపై రెరా తీర్పు కేవలం వ్యక్తిగతంగా సుబ్బరాజుకు కాదు – ఈ వ్యవస్థలో భాగమవుతూ పాపాలు పంచుకున్న అధికారులకు కూడా చెంపపెట్టు. ఒకే పేరుతో రెండు చోట్ల మోసాలను అదే డిపార్ట్‌మెంట్‌ ఎలా గుర్తించలేకపోయింది? రెరా తీర్పు తర్వాత ప్రభుత్వం బాధితులకి నేరుగా సహాయం చేస్తుందా? కోపరేటివ్ వ్యవస్థను ఇలా దుర్వినియోగం చేయడం ఎప్పుడు ఆగుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తీర్పులో, ప్లాట్‌జాబితాలో పేర్లు మార్చడమే కాకుండా, నకిలీ డాక్యుమెంట్లు ఆధారంగా హక్కులు మార్చిన వ్యవహారంపై రెరా గట్టి వ్యాఖ్యలు చేసింది. “ఇది కోపరేటివ్ వ్యవస్థను అపహాస్యం చేసే చర్య,” అని తీర్పులో పేర్కొనడం గమనార్హం. "కోఆపరేటివ్" పేరు పెట్టుకున్నంత మాత్రాన అది నిబంధనలకు లోబడి ఉన్నదిగా భావించలేమని కుండబద్దలు కొట్టింది. రెరా చారిత్రక తీర్పు అవినీతి గద్దలకు చెంపదెబ్బ కొట్టి, సహకార రంగంలో పారదర్శకతకు మైలురాయిగా నిలిచింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ హౌసింగ్ కోఆపరేటివ్ ముఠాలకు ఒక గట్టి హెచ్చరిక. ఇదే తీర్పు భీమవరానికి చెందిన శ్రీహరిపురం బాధితుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. వారి పోరాటానికి ఊపిరి పోసింది. ఈ తీర్పు వారి కలలను సాకారం చేసే ఆశాజ్యోతిగా మారనుంది.
బాధితుల పక్షాన నిలవాలి!
మోసాలకు బలైనవారికి న్యాయం చెప్పే పోరాటం నేడు మరో మైలురాయిని దాటుతోంది. కేతనకొండ తీర్పు... శ్రీహరిపురం బాధితుల ఆశలు! ఒకే మోసగాడు, రెండు అవినీతి వెంచర్లు – ఇప్పుడు ఒకే న్యాయబాటలో కలుస్తున్నాయి. రెరా ఈసారి కూడా బాధితుల పక్షాన నిలవాలి... ఇది న్యాయమే కాదు, నీతీ పరంగా కూడా అవసరం. కేతనకొండ తీర్పు వలెనే విస్సాకోడేరు బాధితులకూ న్యాయం జరగాలన్నది బాధితుల ఆకాంక్ష. అదే సంతోషం పత్రికా పాఠకుల్లోనూ, సత్యం జయించాలన్న సామూహిక నమ్మకంలోనూ కనిపిస్తోంది.
-ప్రభుత్వం, కోపరేటివ్ శాఖ ఇకనైనా కళ్లు తెరవాలి. కోఆపరేటివ్ హౌసింగ్ పేరిట జరిగే మోసాలపై కొరడా ఝుళిపించాలి . రెరా చూపిన మార్గమే ఇప్పుడు వేలాది మందికి న్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే మార్గం.
Read More
Next Story