
రేపటి నుంచి ’స్పౌజ్‘ బదిలీలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్పౌజ్ బదిలీలకు ఆన్‌లైన్ దరఖాస్తులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు స్పౌజ్ కేటగిరీలో అంతర్ జిల్లా బదిలీలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (నవంబరు 21) నుంచి ప్రారంభమవుతుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జారీ చేసిన సర్కులర్‌లో, నవంబరు 24 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుందని తెలిపారు. ఈ నిర్ణయం భార్యా భర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా తెలిపారు.
ఈ బదిలీలు పూర్తిగా ఉద్యోగుల స్వచ్ఛంద రిక్వెస్ట్ ఆధారంగా మాత్రమే అమలు చేస్తారని, వివాహ సర్టిఫికేట్, స్పౌజ్ ఉద్యోగ ధృవీకరణ, ఎంప్లాయ్ ఐడి వంటి డాక్యుమెంట్లు సమర్పించాలని డైరెక్టర్ శివప్రసాద్ స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ తర్వాత, జిల్లాల వారీగా అందిన అప్లికేషన్లపై నవంబరు 25, 26 తేదీల్లో పరిశీలన జరిపి సీనియారిటీ ప్రకారం ప్రాథమిక జాబితాలు ప్రకటించాలని, 26 సాయంత్రం 6 గంటలకల్లా కలెక్టర్లు ఆ జాబితాలను శాఖాధిపతులకు పంపాలని సూచించారు. టై వచ్చినప్పుడు సీనియారిటీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ (DOB) ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు. కొత్త జిల్లాలో చివరి ర్యాంక్‌లో కేటాయింపు, క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడే బదిలీ అనే నిబంధనలు వర్తిస్తాయి.
ఈ ప్రక్రియలో అభ్యంతరాలు వస్తే ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చని, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HOD)లు వాటిని పరిశీలించి తుది లిస్ట్ పోర్టల్‌లో విడుదల చేస్తారని సర్కులర్‌లో పేర్కొన్నారు. జిల్లాల మధ్య బదిలీల ఆర్డర్లు సంబంధిత శాఖ సెక్రటరీలు జారీ చేస్తారు. నవంబరు 29కల్లా బదిలీ ఆర్డర్లు జారీతో పాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేస్తామని డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు.

