
శర వేగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
ఇప్పటికే 32 విభాగాలను ప్రైవేటీకరించేందుకు టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం.
ఆంధ్రప్రదేశ్ కే తలమానికమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) యాజమాన్యం ప్లాంట్‌లోని ఒక్కో కీలక విభాగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే 32 విభాగాలను ప్రైవేటీకరించేందుకు టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం, తాజాగా అత్యంత కీలకమైన 'కంటిన్యూవస్ కాస్టింగ్ మిషన్' (CCM) విభాగాన్ని కూడా ప్రైవేటు కాంట్రాక్టుకు అప్పగించేందుకు టెండర్లు పిలిచింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ (Rashtriya Ispat Nigam Limited - RINL) భారతదేశపు మొట్టమొదటి తీర-ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించి కంటిన్యూయస్ కాస్టింగ్ (Continuous Casting Machine - CCM) విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయి. కర్మాగారంలో మొత్తం ఉత్పత్తి చేయబడిన ఉక్కులో 100% నిరంతర కాస్టింగ్ పద్ధతిలోనే ఘనీభవించబడుతుంది. ఈ ప్రక్రియలో కరిగిన ఉక్కును నేరుగా సెమీ-ఫినిష్డ్ ఉత్పత్తులుగా (బిల్లెట్లు, బ్లూమ్స్, స్లాబ్స్) ఘనీభవిస్తారు, ఇది సంప్రదాయ పద్ధతి కంటే సమర్థవంతమైనది. ఈ విభాగంలో ఉక్కును కరిగించి, నిరంతర కాస్టింగ్ యూనిట్‌కు పంపుతారు. ఈ యూనిట్లు వైజాగ్ స్టీల్‌ను మార్కెట్ లీడర్‌గా నిలబెట్టాయి, ముఖ్యంగా లాంగ్ ప్రొడక్ట్స్‌లో నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ఈ యూనిట్లు ఎంతగానో దోహదపడుతాయి.
టెండర్ విభాగం వివరాలు:
కాంట్రాక్ట్ విలువ: ₹ 131.33 కోట్లు.
వ్యవధి: రెండేళ్ల కాలానికి కాంట్రాక్టుకు అప్పగింత.
విభాగం ప్రాముఖ్యత: స్టీల్ మెల్టింగ్ షాపు నుంచి వచ్చే ద్రవరూప ఉక్కును (లిక్విడ్ స్టీల్) ఇక్కడ దిమ్మలుగా (బ్లూమ్స్/స్లాబ్స్) పోస్తారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందిన ఈ విభాగం 24 గంటలూ పనిచేస్తుంది. ఇక్కడ తయారైన దిమ్మలను ఆ తర్వాత వైర్ రాడ్లుగా మారుస్తారు.
ఉద్యోగ సంఘాల ఆందోళనలు
ప్రస్తుతం ఈ కీలక విభాగంలో సుమారు 250 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. షిఫ్ట్‌కు 70 నుంచి 80 మంది సిబ్బంది ఉంటారు. ఈ విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తే, పర్యవేక్షణకు నామమాత్రంగా అధికారులను ఉంచి, మిగిలిన ఉద్యోగులకు వీఆర్‌ఎస్ (VRS - స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) ఇస్తారని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో కేవలం క్లీనింగ్, చిన్నపాటి మెకానికల్, ఎలక్ట్రికల్ పనులను మాత్రమే కాంట్రాక్టుకు ఇచ్చేవారని, ఇప్పుడు నేరుగా ప్రధాన ఆపరేషన్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ కాంట్రాక్టుల వల్ల యాజమాన్యానికి ఖర్చులు తగ్గకపోగా, గతం కంటే ఎక్కువ వ్యయం అవుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు మాట మార్చడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటంపైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో విమర్శలు మూటగట్టుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఇటీవల వైజగ్ సీఐఐ సదస్సు సక్సెస్ మీట్ లో సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ’వైట్ ఎఫాంట్‘ అని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్నే రేపాయి. ఆ తర్వాత కీలకమైన ఈ 'కంటిన్యూవస్ కాస్టింగ్ మిషన్' విభాగం ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ తెరపైకి రావడం గమనార్హం.

