గంజాయి రవాణాకు స్పెషల్ సెటప్!
x

గంజాయి రవాణాకు స్పెషల్ సెటప్!

తనిఖీల్లో దొరక్కుండా స్మగ్లర్ల సరికొత్త ఎత్తుగడలు - లారీలు, కార్లు, ట్రాక్టర్లలో అప్‌డేట్.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

పిసరంత కష్టం గాని, భారీ పెట్టుబడి గాని అవసరం లేదు. కాసిన్ని తెలివి తేటలు, కేసులకు వెరవని గుండె ధైర్యం ఉంటే చాలు. రూ. లక్షలు, కోట్లు తెచ్చిపెట్టే గంజాయిని సాగు చేయొచ్చు. అడ్డదారుల్లో రవాణా చేసేయొచ్చు. కొన్నేళ్లుగా స్మగ్లర్లు ఎంచుకున్న మార్గమిదే. అంతేకాదు.. కాలానికి అనుగుణంగానే వీరు ఎప్పటికప్పుడు తమ వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. శతకోటి దరిద్రులకు అనంతకోటి ఆలోచనలు అన్నట్టు.. వీరికి కూడా అలాంటి అలోచనలకే పదును పెడుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి, పటిష్ట నిఘా ఉన్న చెకో పోస్టులను తప్పించుకుని గంజాయిని రవాణా చేసేస్తున్నారు. వీరిని పట్టుకోవడం వీరికి పెద్ద పజిల్ గాను, సవాల్ గానూ పరిణమిస్తోంది.

ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో దశాబ్దాల క్రితం నుంచి గంజాయి పంట బహిరంగం గానే సాగు చేస్తున్నారు. ఈ ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో ఎనిమిది (పాడేరు, హుకుంపేట, అనంతగిరి, డుంబ్రిగుడ, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, జీకేవీధి) మండలాల్లో మండలానికి సగటున 20 గ్రామాల్లో.. సుమారు 30 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరువు కాటకాలతో పనిలేకుండా గంజాయి పంట పెరుగుతుంది. పైగా దీనికి అవసరమైన విత్తనాలు, పెట్టుబడిని తమిళనాడు, కేరళకు చెందిన స్మగ్లర్లే ముందుగా సమకూరుస్తారు. ఇది కాకుండా కిలోకి ఇంత అని కొంత సొమ్మును కూడా గిరిజనులకు ఇస్తారు. ఇతర పంటల వల్ల వచ్చే ఆదాయంకంటే పెట్టుబడి ఫ్రీతో పాటు కాసులను కురిపించే పంటగా గంజాయి గిరిజనులను బాగా ఆకట్టుకుంది. అందుకే పోలీసులు, ఎక్సెజ్ పోలీసులు దాడులకు, కేసులకు సైతం వీరు వెరవడం లేదు.

ఇక పండిన గంజాయిని నిల్వ చేయడం ఒక ఎత్తయితే.. ఎండాక రవాణా చేయడం మరొక ఎత్తు. గిరి సీమల్లో పండిన, ఎండిన గంజాయిని అంచెలంచెలుగా నిర్దేశిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్నెన్నో ఎత్తుగడలు వేస్తుంటారు. పోలీసులు, తనిఖీ, నిఘా అధికారుల కంట పడకుండా గంజాయి తరలిపోయేలా చూసుకుంటారు. ఇందులో బడి పిల్లలను, బాలికలను సైతం వినియోగించుకుంటున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరికీ అనుమానం రాకుండా స్థానికంగా బడికెళ్లే పిల్లల స్కూలు బ్యాగుల్లో గంజాయిని పెట్టి ఒక చోట నుంచి మరో చోటకు రవాణా చేస్తుంటారు. ఏజెన్సీలో వాహనాలు వెళ్లలేని మారుమూల పల్లెలకు గుర్రాలు, గాడిదలపై సరకు రవాణా జరుగుతుంది. దీంతో అదే భావన కలిగేలా వీటిపై కూడా గంజాయిని తరలిస్తుంటారు. ఇక కొండల పైనుంచి మైదాన ప్రాంతాలకు గంజాయిని రవాణా చేయడానికి కార్లు, లారీలు, ఆటోలు, బైక్ లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు అప్పుడప్పుడు పట్టుబడుతుంటారు.

అధికారుల కళ్లుగప్పి..

విశాఖ ఏజెన్సీలో పండిన గంజాయిని ఇతర రాష్ట్రాలకు వాహనాల్లో తరలిస్తుంటారు. ఇందుకు కార్లు, జీపులు, వ్యాన్లు, లారీలను వినియోగిస్తుంటారు. రవాణాకి వీలుగా గంజాయిని 5, 10, 15, 20, 30, 40 కిలోల బ్యాగులను ప్యాక్ చేస్తారు. వీటిని బహిరంగంగా తరలిస్తే కనిపిస్తుందన్న ఉద్దేశంతో స్మగ్లర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కార్లు, జీపుల బానెట్ల చిన్న చిన్న ప్యాకెట్లను అమరుస్తారు. కార్ల డోర్ల లోపల కూడా వీలైనంత గంజాయిని దాస్తున్నారు. వ్యాన్లు, ట్రాక్టర్లు, లారీల ఛాసిస్ల కింద కూడా ఎవరికీ కనిపించకుండా ప్రత్యేకంగా అరలను తయారు చేసి వాటిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తారు. ఇటీవల కాలంలో భారీ మొత్తంలో గంజాయిని రవాణా చేయడం కోసం ఏకంగా లారీ క్యాబిన్ల లోపల, పై భాగంలో, ఛాసిస్ అడుగున కూడా సీక్రెట్ అరలను సిద్ధం చేస్తున్నారు.

ఇవి ఎంతలా అంటే.. ఎవరికీ, ఏ మాత్రం అనుమానమే రాకుండా మామూలు క్యాబిన్ లానే కనిపిస్తుంది. అందులో అరలున్నాయని తెలియాలంటే స్క్రూలు, బోల్టులు, చెక్కలను విప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ తనిఖీ చేయాలంటే పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందికి తలకు మించిన పని. అందుకే పైపైనే తనిఖీలు చేసి వదిలేస్తుంటారు. విశ్వసనీయ సమాచారం అందితేనే వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాంటివే వీరికి కచ్చితంగా పట్టుబడుతున్నాయి. ఈ తరహా వాహనాలు/లారీలు ఐదు శాతం కూడా పట్టుబడవని చెబుతుంటారు. కొంతమంది స్మగ్లర్లు గంజాయిని తరలించడానికే బినామీ పేర్లతో లారీలను కొనుగోలు చేస్తున్నారు.

వీటికి వేరే లోడు వేసి సీక్రెట్ అరల్లో గంజాయిని అమర్చి తరలించేస్తుంటారు. ఈ తరహా లారీలు ఇటీవల కాలంలో పోలీసులకు చిక్కుతున్నాయి. ఇటీవల కాలంలో కార్లకంటే లారీల్లో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని అధికారులే చెబుతున్నారు. వారం రోజుల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా సబ్బవరం పోలీసులు లారీ క్యాబిన్ పైన, లోపల ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో 456 ప్యాకెట్లను గుర్తించారు. వీటి బరువు 912 కేజీలు, విలువ రూ.46 లక్షలు.

అధికారులు, సిబ్బంది హస్తం..

గంజాయి సాగుదార్లు, స్మగ్లర్లకే కాదు.. కొంతమంది పోలీసు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బందికి కూడా కాసులు కురిపిస్తోంది. ఇలాంటి వారు తమ ఉద్యోగంకంటే గంజాయి రవాణా వ్యాపకాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు. గతంలో ఇలా స్మగ్లర్లతో కుమ్మక్కై, సొంతంగా లారీల్లో తరలిస్తూ చిక్కిన వారు, ఆపై తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న వారూ ఉన్నారు. అయినప్పటికీ అక్రమ సంపాదన మరిగిన వారు దీనిని వదులుకోలేక పోతున్నారు.

ఒకప్పుడు విశాఖ ఏజెన్సీలో పోస్టింగు అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమన్న భయంతో వణికిపోయేవారు. పనిష్మెంట్గా భావించేవారు. ఉన్నతాధికారులకు లంచాలిచ్చి అక్కడకు బదిలీ కాకుండా చూసుకునే వారు. కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితి లేదు. రూ. లక్షల్లో లంచాలిచ్చుకుని మరీ ఏజెన్సీలో పోస్టింగులు వేయించుకుంటున్నారు. రెండు మూడేళ్ల నాటికే భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. అందుకే గంజాయి ఆదాయం రుచి మరిగిన ఇలాంటి వారు దాని రవాణాలో స్మగ్లర్లతో పోటీ పడుతున్నారు.

Read More
Next Story