రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవీ
x
సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు

రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవీ

సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం


అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోదం

కన్వెన్షన్ సెంటర్లకు భూమి ఇచ్చేందుకు అంగీకారం

రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. ఏడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహద పడుతుంది. అయితే ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని.. దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్దంగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఎస్పీవీ పరిధిలోని ప్రాజెక్టుల డిజైన్, రెవెన్యూ జనరేషన్ మొదలు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఎస్పీవీనే పూర్తి బాధ్యత వహించనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.

గవర్నమెంట్ కాంప్లెక్స్ కు మౌలిక సదుపాయాలపై ఫోకస్

అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెండర్ కు సీఆర్డీఏ అథార్టీ ఆమోదించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుసంధానంగా రోడ్లు, ఫుట్ పాత్ ల నిర్మాణానికి సంబంధించిన పనులు ఇకపై మొదలు కానున్నాయి. దీంట్లో భాగంగా 53.68 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణమే కాకుండా ఏడేళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చేపట్టేలా నిబంధనలు పెట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇక రాజధాని ప్రాంతంలో అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి అథార్టీ ఆమోదించింది. డిజైన్లను ఆమోదించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అమరావతి నగరం మొత్తంగా ఆకర్షణీయంగా కన్పించేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రతి కట్టడమూ ప్రజలను ఆకర్షించేలా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులతో కార్యాకలాపాలు పెరిగాయని అధికారులు చెప్పగా... ఈ మేరకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్, ఆన్ డ్యూటీ విధానంలో నియమించుకునేందుకు సీఎం అనుమతిచ్చారు.

కన్వెన్షన్ సెంటర్లకు భూములు

రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం కొన్ని ప్రముఖ హోటళ్లు ముందుకు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రముఖ హోటళ్లకు భూములు కేటాయించామని, వాటికి అనుబంధంగా కొందరు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారని, అయితే అందుకు భూములు ఇవ్వాలని ప్రతిపాదించాయని చెప్పారు. నిర్మాణాలు ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలని సూచిస్తూ... ముందుకొచ్చిన సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ల నిమిత్తం భూములు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా ఏమైనా భూ సేకరణ చేపట్టాలంటే రైతులతో మాట్లాడి ఆ ప్రక్రియ చేపట్టనున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రైతులతో మాట్లాడి... వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇచ్చారు. కృష్ణా నదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి టూరిజాన్ని ఆకర్షించేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, మున్సిపల్, సీఆర్డీఏ, ఏడీసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Read More
Next Story