
రాయలసీమకు ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్
రాయలసీమ అభివృద్ధి చెందాలంటే రాయలసీమకు ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆశయ సాధన దిశగా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే రాయలసీమకు ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేసి సాగునీటి రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దిష్ట లక్ష్యంతో కార్యాచరణ చేపట్టినప్పుడే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు.
బుధవారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని అనేక సందర్భాల్లో ప్రకటించడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆహ్వానిస్తోందన్నారు. రాష్ట్రం విడిపోయిన తదనంతరం అనేక కారణాల వల్ల రాష్ట్రం ఆర్థికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులలో కేవలం హంద్రీనీవా ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి మల్యాల నుండి కుప్పం వరకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో భారీగా నిధులను కూడా విడుదల చేసి చాలా వేగవంతంగా చేపట్టిన పనుల వలన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్దేశిత 6 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం సాధించాలని ఆశిస్తున్నామని బొజ్జా అన్నారు.
అయితే కింద పేర్కొన్న అంశాలను దష్టిలో పెట్టుకుంటే లక్ష్యసాధన ఆచరణ సాధ్యం కాదన్న భావన మాకు కలుగుతోందని అన్నారు.
1.ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం.
2.ప్రధాన కాలువలతో పాటు బ్రాంచ్ కాలువలతో సహ సుమారు 700 కిలోమీటర్ల పొడవున్న హంద్రీనీవా కాల్వలలో నీటి ఆవిరి.
3.హంద్రీనీవా మొదటి దశ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు, రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ చేపట్టి సామర్థ్యం పెంచినప్పటికీ నిర్దేశిత 40 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 120 రోజుల పైగా సమయం పట్టే స్థితి ఉండడం.
4.అనేక ఆరుతడి పంటల జీవితకాలం 70 నుండి 110 రోజుల కాలమే ఉండడం. అంటే..
ఈ సమయంలోపుగానే పంటలకు నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది.
ఒక టిఎంసి నీటిని వినియోగించి 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం కూడా కష్టమే అయినప్పటికీ, ఆ విధంగా అందించిన ఆరు లక్షల ఎకరాలకు సుమారు 60టీఎంసీ నీరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కాలువలను పరిగణలోకి తీసుకున్నా 60 టీఎంసీల నీరు అందించడానికి సుమారు 180 రోజుల సమయం పడుతుంది.
5.హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం మొత్తం కలిపి కేవలం 8 టీఎంసీల సామర్థ్యం ఉండడం.
6.హంద్రీనీవా మొదటి ఫేస్ లో కర్నూలు జిల్లాలో అత్యంత కీలకమైన పందికోన రిజర్వాయర్ ఇన్ లెట్ సామర్థ్యం, అవుట్ లెట్ సామర్ధ్యంలో కేవలం 52 శాతమే కలిగి ఉండడం.
7.డిస్ట్రిబ్యూటరీస్, పంట కాలువ నిర్మాణం చేపట్టకపోవడం.
ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి సమగ్రమైన విధానాన్ని అమలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
ఆ దిశగా కాకుండా హడావిడిగా, అసమగ్రంగా గతంలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి ఏ మాత్రం తోడ్పడకపోగా రాయలసీమ సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేశాయన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా కృష్ణా జలాలపై హక్కులు పొందిన ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కులు పొందిన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో ఇరవై ఒక్క లక్ష ఎకరాల ఆయకట్టుకు కృష్ణా జలాలు అందాల్సి వుంటే గత ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాల వలన రాయలసీమలోని ప్రతి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండడం, తగిన సామర్థ్యంతో రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు నిర్మించికపోవడం వలన కృష్ణా జలాల లభ్యత ఉన్నప్పటికీ కేవలం ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరు పొందగలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంటే రాయలసీమలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమి 90 లక్షల ఎకరాలలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కేవలం 8.8% ఆయకట్టుకు మాత్రమే నీళ్లు లభిస్తున్నాయి. ఇంత తక్కువ శాతం సాగునీరు లభిస్తున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా లేదని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడమే గాకుండా తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, సిద్దేశ్వరం అలుగు తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కార్యాచరణను సమగ్రంగా అత్యంత త్వరగా చేపట్టినప్పుడు మాత్రమే రాయలసీమను సస్యశ్యామలం అవుతుందని బొజ్జా స్పష్టం చేశారు. దీనికి ఒక ప్రత్యేక రాయలసీమ ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందనీ..ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టి రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
Next Story