జీతాలను ఖాతరు చేసే ఎమ్మెల్యేలున్నారా?
x

జీతాలను ఖాతరు చేసే ఎమ్మెల్యేలున్నారా?

'నోవర్క్.. నోపే' తో వైసీపీ సభ్యులు దారికొచ్చేనా !


'నోవర్క్.. నోపే' ఇప్పుడు తరచుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇది.ఆ మాట ఎందుకు అంటున్నారో అందరికీ తెలిసిందే. ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. అనంతరం రావడమే మానేశారు. ఆ తర్వాత ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం రాకుండా దూరంగానే ఉండిపోతున్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా అసెంబ్లీ గడప తొక్కేలా చూసేందుకు తెలుగుదేశం నేతలు తెగ ఉబలాటపడుతున్నారు.దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాలని సవాళ్లు కూడా విసురుతున్నారు.మరి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను సభకు రమ్మని స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేయడంలో ఏదైనా వ్యూహం వుందా అన్న చర్చ జరుగుతోంది.

సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు?
ప్రజల చేత ఎన్నికై అసెంబ్లీకి రాకుండా ,ప్రజా సమస్యలను పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యనపాత్రుడు విజ్ఞప్తి చేశారు. నిరవధికంగా సభకు రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని, మీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని , డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి తన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు వారిని అసెంబ్లీకి రావాలని, వచ్చి చర్చల్లో పాల్గొనాలని, కోరినంత సమయం కూడా ఇస్తామని చెప్పినా వారు మాత్రం పట్టించుకోకపోవడంపై విచారకరమన్నారు.
ఉద్యోగస్థులు డ్యూటీకి వెళ్లకపోతే చర్యలు తీసుకుంటారు.. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా, అప్పటికీ వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఏమైనా రెండు కొమ్ములు ఉన్నాయా అని అడిగారు. ఎమ్మెల్యేల డ్యూటీ ఏంటని ప్రశ్నించిన స్పీకర్ ,అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటమే వారి విధిగా చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేలకు జీతం ముఖ్యమా?
ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలయినా ఆర్ధికంగా బల వంతులుగానే వుంటున్నారు.వారి వ్యాపారాలు వారి కుంటున్నాయి. ఆర్దికంగా ఉన్నవారే రాజకీయాలలోకి వస్తున్నారు. అలాంటిది స్పీకర్ ఉద్యోగస్థులతో ఎమ్మెల్యేలను పోల్చడం చూస్తే ఔరా అనిపించక మానదు.మాట్లాడితే సభకు రాని ఎమ్మెల్యేల జీతం కట్ అంటుంటే... ఎమ్మెల్యేగా వచ్చే జీతం కట్ అవుతుందని భయపడే వారెవరున్నారన్నది ప్రశ్న.అలా కాకుండా ఏకంగా సభ్యత్వం రద్దవడం వంటి చర్యలు చేపడితేనే చురుకు తగులుతుంది. అయినా కూటమి నేతలు వైసీపీ ఎమ్మెల్యేలను , వారి నేత జగన్ ను పదేపదే సభకు రావాలనడం , వారేమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం రోజువారీ తంతుగా మారింది.సంఖ్యా బలం లేని వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే ,అక్కడ ఏమి జరుగుతుందో వారికీ తెలుసు .కూటమి ఎమ్మెల్యేలు అవమానిస్తారన్న భయం .అధికార ఎమ్మెల్యేలను ధీటుగా ఎదుర్కుందామంటే మాట్లాడే సమయం రాదు.అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొడుతున్నారు. సభకు వెళ్లి ప్రజల మద్దతు పొందవచ్చనే విషయాన్ని మాత్రం మరుస్తున్నారేమో..మరి అందరూ సభకు రావాలంటే కొత్త నిబంధనలు రావాల్సిందే.. అయినా స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ల వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలను తాటాకు చప్పుళ్లుతో బెదిరిద్దామను కొంటున్న రీతిలో ఉంటున్నాఏమో ...
Read More
Next Story