
భూఆక్రమణల ఆరోపణలపై స్పందించిన స్పీకర్
విశాఖపట్నంలో భూ ఆక్రమణలపైన సమగ్ర విచారణ జరిపించాలని స్పీకర్ అయ్యన్న మంత్రిని కోరారు.
విశాఖపట్నం జనసేన పార్టీ కార్పొరేటర్ చేసిన భూ ఆక్రమణల ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. మాజీ సైనికులకు చెందినటువంటి భూములకు అనుమతుల పత్రాలు మంజూరు చేయడంలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపిస్తూ దీనిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి పేరును కూడా ప్రస్తావించారు.
మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణల మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. విశాఖపట్నం భూ ఆక్రమణల మీద సమగ్ర విచారణ జరిపించి అక్రమాలను నిగ్గు తేల్చాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఆదేశించారు. విశాఖపట్నం మండలం ఎండాడ–2లోని 5.10 ఎకరాల భూమికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ) మంజూరు ప్రక్రియ మీద ఒక సమగ్రమైన విచారణ జరిపి, వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రిని కోరారు.
ఆ మేరకు ఆదివారం స్పీకర్ అయ్యన్న మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగాను, ఐటీ హబ్‌గాను డెవలప్ అవుతున్న విశాఖపట్నం నగరంలో ఇలాంటి ఆరోపణలకు తావు ఉండకూడదు. ఎంతో విలువైన భూముల ఆక్రమణలపై తక్షణమే విచారణ జరిపించాలి. ఆక్రమణలకు పాల్పడిన బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించారు. గతంలో కూడా విశాఖలో భూ ఆక్రమణలపై తాను స్పందించానని, ఈ సారి మాత్రం విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని మంత్రిని కోరారు.