ఆరోపణలపై స్పీకర్‌ అయ్యన్న లేఖ అలజడి!
x
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ఆరోపణలపై స్పీకర్‌ అయ్యన్న లేఖ అలజడి!

వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంలోనూ మేలు జరుగుతోందంటూ విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఆరోపణలు చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నేతలకు కంటిమీద కునుకు పట్టడం లేదు. ఎప్పుడు ఏ నేతను అరెస్టు చేసి జైలుకు పంపుతారోనన్న భయంతో గడుపుతున్నారు. రాష్ట్రమంతా ఈ పరిస్థితి ఉంటే విశాఖ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ వైసీపీ నేతలకే మేలు జరుగుతోందంటూ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లోని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ చేసిన ఆరోపణలు ఇప్పడు టీడీపీ, జనసేన, వైసీపీల్లో దుమారాన్ని రేపుతున్నాయి.


ఎండాడలో వివాదాస్పద మాజీ సైనికుల భూమి

అసలేం జరిగిందంటే?
విశాఖపట్నం జిల్లాలోను, జీవీఎంసీ పరిధిలోనూ వివిధ భూ ఆక్రమణలు, అక్రమాలపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ చాన్నాళ్లుగా ఉద్యమిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నెంబర్‌ టూగా చలామణి అయిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఆయన కుమార్తె నేహారెడ్డిపైన, ఇంకా వైసీపీ ముఖ్య నేతలపైన ఆరోపణలు గుప్పించారు.త తన వద్ద ఉన్న ఆధారాలతో జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లకు కూడా ఫిర్యాదులు చేశారు. హైకోర్టులోనూ కొన్ని కేసులు వేశారు.. వేస్తున్నారు. దీంతో ఆయన జీవీఎంసీలో ఇతర కార్పొరేటర్లకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల మూర్తి యాదవ్‌ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. విశాఖ ఎండాడ సర్వే నంబరు 14/1లోని 5.10 ఎకరాల భూమిని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు ఎర్రవ బాలిరెడ్డికి 1971లో కేటాయించారు. ఆ భూమిని డీ నోటిఫై చేసి వేరొకరికి విక్రయించుకునేందుకు అనుమతివ్వాలని వైసీపీ హయాంలో బాలిరెడ్డి కుటుంబీకులతో వైసీపీ నేతలు దరఖాస్తు చేయించారన్నది ఆరోపణ. అయితే అప్పట్లో అందుకు నిరాకరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదే వైసీపీ నేతలు డీ నోటిఫై చేయించుకుని రూ.100 కోట్ల భూమిని కొట్టేశారని కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఆరోపించారు.

జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌

స్పీకర్‌ అయన్న స్పందించారెందుకు?
వైసీపీ హయాంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా పనిచేసిన సనపల చంద్రమౌళి, నర్సీపట్నం వైసీపీ నేత, ప్రస్తుత స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సొంత సోదరుడు సన్యాసిపాత్రుడు అలియాస్‌ జమీలు, ఆయన కుమారుడు వరుణ్‌లు ఈ మాజీ సైనికోద్యోగి పేరిట ఉన్న 5.10 ఎకరాల భూమిని డీ–నోటిఫై చేయించుకుని కొట్టేశారని మూర్తి యాదవ్‌ గతంలో మీడియా సమావేశంలో ఆరోపించారు. సాక్షాత్తూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ నాయకులకే తిరస్కరించిన ఈ ఖరీదైన భూమిని కూటమి అధికారంలోకి వచ్చాక దక్కించుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రికార్డులను ఫ్యాబ్రికేట్‌ చేసి సన్యాసిపాత్రుడికి మేలు జరిగేలా కూటమి ప్రభుత్వ అధికారులు సహకరించారని ఆయన ఆరోపించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. తమ కుటుంబీకుల (సోదరుడు జమీలు, ఆయన కుమారుడు వరుణ్‌)పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లేఖ ద్వారా ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఈ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ భూముల వివాదం కలకలం రేపుతోంది. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు టీడీపీ తరఫున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికై స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆయన సోదరుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న జమీలు వైసీపీ నాయకుడిగా ఉన్నారు. ఇద్దరికీ రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ చేసిన ఆరోపణలపై విచారణకు స్పీకర్‌ అయ్యన్న ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయ్యన్నకు క్షమాపణలు చెబుతున్నా..
ఎండాడ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ భూముల వివాదంపై విచారణ జరపాలని ప్రధాన కార్యదర్శికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు లేఖ రాయడంపై జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ స్పందించారు. ‘భూముల ఈ వ్యవహారంలో స్పీకర్‌ అయ్యన్నను నొప్పించి ఉంటే ఆయనకు క్షమాపణ చెబుతున్నాను. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఎప్పడూ మాట్లాడలేదు. బీసీ నేత, ఉత్తరాంధ్ర టైగర్‌గా పిలుచుకునే అయ్యన్నకు వ్యతిరేకంగా పనిచేసిన, గత ఎన్నికల్లో అయనను ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తులకు కూటమి ప్రభుత్వంలో కొందరు నాయకులు, అధికారులు మేలు చేయడంపైనే నా అభ్యంతరం.’ అని మూర్తి యాదవ్‌ వివరణ ఇచ్చారు. త్వరలోనే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని కలిసి తన వివరణ ఇస్తానని ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story