
పోలీస్ జాగిలానికి ఎస్పీ ఘనంగా సన్మానం
నేర పరిశోధనలో పోలీస్ జాగిలం కీలకం. అటువంటి జాగిలం రిటైర్ అయితే ఎలా ఉంటుంది. ఏమి చేస్తారు? ఒక సారి తెలుసుకుందాం.
ప్రపంచం సమాచార యుగంలో ఎంతో ముందుకు పయనిస్తోంది. ప్రస్తుతం వచ్చిన సమాచార విప్లవం వల్ల ఎంతో మంది నేరస్తులను ఈజీగా పట్టుకోగలుగుతున్నారు. ఒకప్పుడు సమాచార వ్యవస్థే లేని రోజుల్లో పోలీస్ జాగిలం నేర పరిశోధనలో కీలకంగా మారుతుంది. నేరస్తుడిని గుర్తించడంలో కేవలం జాగిలాలపైనే పోలీసులు ఆధారపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోలీస్ శాఖలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కు ఏ విధంగా అయితే శిక్షణ ఉంటుందో జాగిలానికి కూడా అదే విధంగా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తరువాత పదేళ్ల పాటు పోలీస్ శాఖలో జాగిలం తన సేవలు అందించి రిటైర్డ్ అవుతుంది.
పోలీస్ జాగిలం రిటైర్డ్ మెంట్ ఎలా ఉంటుందో తెలుసా?
పోలీస్ శాఖలో పనిచేసే జాగిలాలు రిటైర్డ్ అవుతాయనే విషయం చాలా మంది సామాన్యులకు తెలియదు. పైగా జాగిలం రిటైర్డ్ అయిన తరువాత దానికి ప్రత్యేకించి ఒక గదిని పోలీస్ విభాగం కేటాయిస్తుంది. ఆహారం, ఆరోగ్య సంబంధ విషయాలన్నీ పోలీస్ విభాగం జాగిలానికి చూస్తుంది. పోలీస్ శాఖలో ఒక కానిస్టేబుల్ రిటైర్డ్ అయితే ఏ విధంగా సౌకర్యాలు వర్తిస్థాయో అదే విధంగా సునకానికి కూడా సౌకర్యాలు కల్పిస్తారు. దొంగతనాల విషయంలో పోలీస్ జాగిలాలు చూపే చొరవ, నేరస్తులను పట్టించే తీరు మెచ్చుకోదగిందిగా ఉంటుంది. చుట్టుపక్కల వారైనా, వేల మైళ్ల దూరంలో ఉన్నవారైనా జాగిలం గుర్తిస్తుంది. పసి (వాసన) ద్వారా దొంగను గుర్తిస్తుంది. ఆ వ్యక్తికి సంబంధించిన కాలి గుర్తుల్లోని వాసన చూసి దొంగను గుర్తు పట్టే విధంగా పోలీస్ జాగిటలానికి శిక్షణ ఉంటుంది. జాగిలాన్ని కంటికి రెప్పలా చూసుకునే హడ్లర్ కనుసన్నల్లో జాగిలం పనిచేస్తుంది.
జాగిలానికి ఎన్ని నెలలు శిక్షణ ఇస్తారు..
జాగిలాన్ని టెండర్లు వేసి పోలీస్ శాఖ కొనుగోలు చేస్తుంది. ఏ జాతి జాగిలం కావాలో ముందుగానే నిర్ణయించుకుని జాగిలాలు విక్రయించే సంస్థలకు టెండర్లు దాఖలు చేస్తారు. ఎక్కువగా ఆరు నెలల వయసు ఉన్న సునకాలను పోలీసులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తరువాత పోలీస్ శాఖ జాగిలానికి తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇస్తుంది. నేరస్తులను ఎలా గుర్తించాలనే విషయంలో ఎక్కువగా శిక్షణ ఉంటుంది. ఒక్కో సారి మాబును అడ్డుకోవడానికి కూడా జాగిలాలను పోలీసులు ఉపయోగిస్తారు. తొమ్మిది నెలల శిక్షణతో కలిపి పది సంవత్సరాలు సేవులు అందించిన తరువాత 11 సంవత్సరాలకు పోలీస్ సేవల నుంచి జాగిలం రిటైర్డ్ అవుతుంది.
జాగిలం ఆయు ప్రమాణం 20 సంవత్సరాలుగా చెబుతారు. రిటైర్డ్ అయిన జాగిలం మరణించే వరకు పోలీస్ విభాగమే సేవలందించడంతో పాటు చనిపోయిన తరువాత ఖనన సంస్కారాలు కూడా పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. పోలీస్ లాంఛనాలు అన్నీ జాగిలానికి ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే పోలీస్ శాఖలో అంతటి గొప్పదనం పోలీస్ జాగిలానికి ఉంది.
రిటైర్డ్ అయిన పోలీస్ జాగిలం మాగి కి ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా పోలీస్ జాగిలాల్లో ఒకటైన ‘మ్యాగి’ పదవీ విరమణ ఘనంగా జరిగింది. పోలీస్ సేవల్లో 11 సంవత్సరాల పాటు అవిరామంగా సేవలందించిన ఈ జాగిలం పదవీ విరమణ కు ముఖ్య అతిథిగా హాజరైన అన్నమయ్య జిల్లా ఎస్పి వి విద్యాసాగర్ నాయుడు మెడలో పూలమాల వేసి శాలువాతో మ్యాగి (జాగిలం పేరు) ని సన్మానించారు. 11 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించి, పలు కీలక విధులను సమర్ధవంతంగా నిర్వర్తించడం అభినందనీయమని ఎస్పీ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలోని వేదిక దగ్గర మ్యాగి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మర్డర్లు, రేప్ లు, దొంగతనం చేసిన వారిని గుర్తించడంలో నేర్పరిగా పేరున్న జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన జాగిలం మ్యాగి. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి, పదవీ విరమణ సందర్భంలో కూడా సంపూర్ణ ఆరోగ్యం తో, చురుగ్గా ఉండేలా కంటికి రెప్పలా చూసుకున్న హ్యాండ్లర్ బి మణిగండన్ ను (ఏఆర్ హెచ్ సి 849) జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, పూలమాలవేసి శాలువా కప్పి సన్మానించారు. రాబోయే రోజుల్లో కూడా జాగ్రత్తగా "మ్యాగి"ని చూసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. జాగిలాలతో అనుబంధం భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందని ఎస్పీ తెలిపారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు పొందడం ఆషామాషీ కాదని, ఎందరికో ఇది ఆదర్శమన్నారు.
మ్యాగి ఉద్యోగ సేవలు ఇలా ఉన్నాయి...
1. ఈ జాగిలం పేరు మ్యాగి. ఇది జర్మన్ షపర్డ్ జాతికి చెందినది. ఈ జాగిలం పుట్టిన తేది (23-10-2013). దీని వయస్సు 11 సంవత్సరాలు, ఈ జాగిలం ఉద్యోగ సర్వీస్ 9 సంవత్సరాలు అయినప్పటికీ, 2 సంవత్సరాలు అదనంగా విధులు నిర్వర్తించింది.
2. 2014వ సంవత్సరంలో మొయినాబాద్, హైదరాబాద్ నందు ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వారి వద్ద ట్రాకర్ విభాగంలో 8 నెలలు శిక్షణ పొందింది.
3. ఈ జాగిలం 6 సంవత్సరాలు చిత్తూరు జిల్లాలో విధులు నిర్వర్తించింది. 2022 లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చి విధులు నిర్వర్తించింది.
4. 2015లో చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువపూనేపల్లి గ్రామం నందు రేప్, మర్డర్ కేసును చేదించినందుకు గాను, అప్పటి అనంతపురం రేంజ్ డీఐజీ గారి చేతుల మీదుగా రూ. 250ల క్యాస్ రివార్డ్ తీసుకోవటం జరిగింది.
5. రాష్ట్రస్థాయిలో రెండు సార్లు సెలెక్ట్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ట్రాకర్ విభాగం నందు 2016లో మైసూర్ లో, 2017లో చెన్నై లో ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొంది.
6. చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి నందు మర్డర్ కేసును క్షణాల్లో ఛేదించి నేరస్తుడిని పట్టించినందుకు గాను అప్పటి చిత్తూరు జిల్లా ఎస్పీ మ్యాగి ని మెడల్ తో సన్మానించి జిల్లా పోలీసు కార్యాలయం చుట్టూ బ్యాండు మేళాలతో ఊరేగించటం జరిగింది.
7. జాగిలం మ్యాగికి 2016లో గణతంత్ర దినోత్సవం డాగ్ షో లో భాగంగా పనితనాన్ని మెచ్చుకొని అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ రూ. 1 లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ నగదును వృధా చేయకుండా చిత్తూరు జిల్లా డాగ్ కెనాల్ పునరుద్దరణకు ఉపయోగించారు.
8. అన్నమయ్య జిల్లా నందు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న ఓరంపాడు గ్రామం నందు జరిగిన మర్డర్ కేసును క్షణాల్లో ఛేదించి పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలను పొందింది.
9. అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చిన తర్వాత, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా "డాగ్ షో" చేస్తూ.. పిల్లల కేరింతల మధ్య, చూపరులను ఆకట్టుకుంటూ అధికారుల మన్ననలు పొందింది.