కన్నతల్లిపై కసాయి వేటు!
x

కన్నతల్లిపై కసాయి వేటు!

మద్యం తాగొద్దన్నందుకు మత్తులో ఉన్న కొడుకు కన్నతల్లిని రోకలిబండతో కొట్టి కిరాతకంగా చంపేశాడు.


మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, కన్నతల్లి అని కూడా చూడకుండా ఓ కుమారుడిని హంతకుడిగా మార్చింది. గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం పరిధిలోని కొండముది గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే..
కొండముది గ్రామానికి చెందిన కొమ్ము జయమ్మ (60) భర్త మూడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆమె తన కుమారుడు నాగరాజుతో కలిసి నివసిస్తోంది. అయితే, నాగరాజు మద్యానికి బానిసై పనిపాటలు మానేసి నిత్యం తాగుతూ ఉండేవాడు. ఈ విషయంలో తల్లి జయమ్మ అతడిని తరచూ మందలించేది. మద్యం తాగొద్దని కొడుకు నాగరాజును వేడుకునేది. శనివారం రాత్రి కూడా ఇలేగే వేడుకుంది. మద్యం ఎందుకు తాగొచ్చావని అడిగింది. మత్తులో ఉన్న నాగరాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లోని రోకలిబండను తీసుకుని తల్లి జయమ్మ తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న గ్రామీణ ఎస్సై శ్రీహరి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మద్యం మత్తులో తానే తల్లిని హత్య చేసినట్లు నాగరాజు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story