సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 15 డిగ్రీ కాలేజీలు
x

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 15 డిగ్రీ కాలేజీలు

అంబేద్కర్ గురుకులాల్లో ప్రభుత్వ నిర్ణయాలు వాటి రూపు రేఖలు మార్చే విధంగా ఉన్నయని విద్యావేత్తలు అంటున్నారు.


ఆధునిక సాంకేతికత, ఉన్నత విద్య గుమ్మంలోకి చేర్చేందుకు ప్రభుత్వం ఎస్సీ గురుకులాల్లో తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు అంబేద్కర్ గురుకులాల రూపురేఖలను మార్చడమే కాకుండా, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు సరికొత్త బాటలు వేసేలా చర్యలు చేపడుతున్నారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు అంటే కేవలం పాఠశాలలు మాత్రమే కాదు.. అవి లక్షలాది మంది పేద విద్యార్థుల ఉన్నత ఆశయాలకు నిలయాలు. తాజాగా తాడేపల్లిలోని APSWREIS కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం ఈ ఆశయాలకు రెక్కలు తొడిగింది. కేవలం మౌలిక వసతులే కాకుండా, విద్యార్థుల కెరీర్‌కు దిశానిర్దేశం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యా విప్లవానికి నాంది పలికాయి.

15 డిగ్రీ కాలేజీల ఏర్పాటు

ఒకప్పుడు గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కడో దూరంగా ఉన్న నగరాలకో, పట్టణాలకో వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది ప్రతిభావంతులు చదువు మధ్యలోనే ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. దీనిని గమనించిన కూటమి ప్రభుత్వం ఏకంగా 15 నూతన డిగ్రీ కళాశాలలను గురుకులాల పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇది విద్యార్థుల విద్యా ప్రస్థానంలో ఒక విప్లవాత్మక మలుపు. తమ సొంత గూటిలోనే డిగ్రీ పట్టా అందుకునే అవకాశం కలగడం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

గ్లోబల్ పోటీకి సిద్ధం

నేటి ప్రపంచం ఐటి రంగం చుట్టూ తిరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, గురుకుల విద్యార్థులు ఎవరికీ తీసిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో బేసిక్ కంప్యూటర్ కోర్సులను తప్పనిసరి చేశారు. దీంతో పాటు, ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతినకుండా, వారి వ్యక్తిగత పనుల కోసం వెచ్చించే సమయాన్ని ఆదా చేసేందుకు వాషింగ్ మెషీన్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.

పర్యావరణం

పర్యావరణ హితమే లక్ష్యంగా గురుకుల భవనాలపై సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించడమే కాకుండా, విద్యార్థులకు పునరుత్పాదక ఇంధనంపై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా ప్రతి ప్రాంగణంలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు విద్యార్థులకు నిరంతర ప్రేరణను అందిస్తుంది.

వెన్నెముక లాంటి సిబ్బందికి భరోసా

సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించలేదు. ముఖ్యంగా అభద్రతాభావంతో ఉండే పార్ట్ టైం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పించడం ఒక గొప్ప మానవీయ నిర్ణయం. ఇక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తెలుగు పండిట్ల పదోన్నతులు, ప్రిన్సిపాళ్ల అడహక్ ప్రమోషన్లు, ఖాళీగా ఉన్న కేర్ టేకర్ పోస్టుల భర్తీతో గురుకులాల్లో పాలనా యంత్రాంగం మరింత బలోపేతం కానుంది.

విద్యార్థులకు విజ్ఞానం, వసతులు, ఉపాధి.. ఈ మూడింటి కలయికతో ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యాచరణ, అంబేద్కర్ గురుకులాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన విద్యాసంస్థలుగా తీర్చిదిద్దనుంది. ఈ అడుగులు ఇలాగే కొనసాగితే రేపటి మేధావులు ఈ గురుకులాల నుంచే దేశ సేవకు సిద్ధమవుతారనడంలో సందేహం లేదు.

Read More
Next Story