దృష్టి లోపం అయితేనేం... ఆమె జీవితం సార్థకం...
x
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో దీపిక

దృష్టి లోపం అయితేనేం... ఆమె జీవితం సార్థకం...

ప్రభుత్వాన్ని మెప్పించి ఊరికి రోడ్డు తెప్పించిన అంధ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక.


దీపిక పట్టుదల, ధైర్యం, స్వార్థం లేని సేవా భావం గ్రామానికి రోడ్డు సాధించాయి. అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక టి.సి. (Deepika TC)లోని మానవత్వం అసాధారణమైన లోతును కలిగి ఉంది. జన్మతః దృష్టి లోపం ఉన్నప్పటికీ, ఆమె జీవితం కేవలం వ్యక్తిగత సవాళ్లను అధిగమించడంపై మాత్రమే కేంద్రీకృతం కాకుండా, సమాజంలోని అతి సామాన్యమైన సమస్యల పట్ల అపారమైన సున్నితత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తెచ్చిన విజయవంతమైన క్రీడాకారిణిగా ఆమెకు వ్యక్తిగత ప్రోత్సాహకాలు, సౌకర్యాలు లేదా గౌరవాలు కోరే అవకాశం ఉంది. అయినా అవేమీ కోరలేదు.

ఆమె గ్రామం తంబళహట్టి తండా

తన స్వగ్రామం తంబళహట్టి తండా వాసులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను పరిష్కరించాలనే ఏకైక కోరిక ఉప ముఖ్యమంత్రిని అడిగేలా చేసింది. ఇది ఆమెలోని నిస్వార్థ భావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక గ్రామీణ సమస్య కాదు. అంధత్వం వల్ల ఆమెకు రోడ్లు, ఊళ్లు కళ్లారా చూసే భాగ్యం లేదు. అయితేనేం తోటి మానవుల బాధలను హృదయంతో ఆమె చూడగలిగింది. చొరవ తీసుకునే విశాల హృదయానికి ప్రతిరూపం. దీపిక మానవత్వం, స్వార్థం లేని సేవా దృక్పథం, సామాజిక బాధ్యత, ధైర్య సమ్మేళనంగా నిలిచి, యువతకు, సమాజానికి స్ఫూర్తిదాయకంగా మారింది.


ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు గ్రామానికి రోడ్డు కావాలని విన్నవిస్తున్న దీపిక

విన్నపం విన్న గంటల్లోనే రోడ్డు మంజూరు

ఇటీవల ఉగాండాలో జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించి కప్ సాధించింది దీపిక. తన స్వగ్రామ మైన శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని తంబళహట్టి తండా కు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం తన మనసును ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. క్రికెట్ క్రీడ ఆమెను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్‌ను కలిసేలా చేసింది. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా కావడంతో ఆమె మనసులో మాటను పవన్ కల్యాణ్ ముందు పెట్టింది. ఈ కోరికను మన్నించిన పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను పిలిపించి హేమావతి నుంచి తంబళహట్టికి 3.20 కోట్లు, గుడిబండ మండలం గునేహళ్లి నుంచి తంబళహట్టికి 3 కోట్లు మొత్తం 6.2 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం దీపిక విన్నపం చేసిన కొన్ని గంటల్లోనే సాయంత్రానికి మంజూరు పత్రాలు సిద్ధమయ్యాయి.

ప్రకృతి సౌందర్యం ఆమె ఊహల్లో...

దీపిక టి.సి. జన్మతః అంధురాలు. ఊర్లు, రోడ్లు, ప్రకృతి సౌందర్యం ఆమెకు ఊహల్లో మాత్రమే పరిచయం. అయినప్పటికీ తన గ్రామ వాసులు ఎదుర్కొంటున్న బాధలు ఆమె మనసును కలచివేశాయి. హేమావతి శివక్షేత్రం సమీపంలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన తంబళహట్టి తండా లో రోడ్డు లేకపోవడంతో స్థానికులు బస్సు సేవలకు చేరుకోవడానికి కిలో మీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. అప్పుడప్పుడు ప్రకృతి సౌందర్యం గురిచి ఈ రోడ్డుపై నడుస్తూ మనసులో ఎంతగానో ఊహించుకునేది. ఎప్పుడు రోడ్డు బాగు పడుతుందా? నా కాళ్లకు రాళ్లు తగలకుండా పతాయా? అనే ఆలోచనలు చేసేది. ఈ సమస్యను పరిష్కరించాలనే ధైర్యంతో దీపిక ఉప ముఖ్యమంత్రికి చెప్పగలిగింది.


పవన్ కల్యాణ్ పెద్ద మనసు...

"దేశానికి గర్వకారణమైన మహిళా జట్టు విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్పోర్ట్స్ అభివృద్ధికి మద్దతు ఇస్తామని" పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, కోచ్‌లకు 2 లక్షల రూపాయలు చెక్కులు అందజేశారు. అలాగే, సంప్రదాయ సారి, శాలువా, స్మారక చిహ్నాలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీలు బహుకరించారు.

మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామన్న జట్టు కెప్టెన్ దీపిక మాటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ చలించిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండా లో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణ కుమారి కుటుంబానికీ టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్ఇడి బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండ్లు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు లాంటివి అందించారు.

దీపిక ధైర్యం, సమాజ సేవా భావన పట్ల అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మడకశిర తెలుగుదేశం ఇన్‌ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జి తిప్పేస్వామి, "దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామీణుల డిమాండ్‌ను వెంటనే పరిష్కరించినందుకు ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ఈ సంఘటన దీపికను కేవలం క్రికెటర్‌గానే కాకుండా, సామాజిక సమస్యల పట్ల సున్నితమైన హృదయం కలిగిన ధైర్యవంతురాలిగా చేసింది. ఆమె చొరవ యువతకు, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

Read More
Next Story