నెల్లూరు మాదిరిగా అన్ని మున్సిపాలిటీలలో స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్లు
x

నెల్లూరు మాదిరిగా అన్ని మున్సిపాలిటీలలో స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్లు

ప్రతి మద్యం సీసాపై హాలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మున్సిపాలిటీలలో నెల్లూరు మాదిరిగా స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నెల్లూరులో మోడరన్‌ కంటైనర్లతో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్‌ను ఆయన అమరావతి నుంచి శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా నెల్లూరులో వినూత్న ఆలోచనతో బజార్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన నకిలీ మద్యం గురించి ప్రస్తావించారు. వైసీపీ మద్యాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు మీద తప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఇటీవల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యవహారంలో తమ పార్టీ సభ్యులు ఉన్నప్పటికీ వారిని సస్పెండ్‌ చేశామని స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు దీనికి రాజకీయ రంగులు పులుముతున్నారంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మద్యం సీసాలపై ఇకపై హాలోగ్రామ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిని మొబైల్‌లో స్కాన్‌ చేస్తే దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి అవుతాయన్నారు.

మెడికల్‌ కాలేజీలపై కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము చేపట్టిన విధానం ద్వారా ఈ కాలేజీలు వచ్చేసరికి 180 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఇప్పటివరకు చేసింది ప్రారంభమేనని, ముందుకు చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, రూ.లక్ష కోట్లతో స్టీల్‌ ఫ్యాక్టరీని స్థాపిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మెప్మా, డ్వాక్రా ద్వారా లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్‌తో నెల్లూరులో ముందుగానే దీపావళి వచ్చినట్లు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళా వ్యాపారులతో సీఎం చంద్రబాబు నేరుగా సంభాషించారు.

Read More
Next Story