
స్కూళ్లలో స్మార్ట్ కిచెన్స్
కొన్ని స్కూళ్లకు కలిపి ఒక చోట ప్రత్యేకంగా స్మార్ట్ కిచెన్స్ ద్వారా మధ్యాహ్న భోజనం తయారు చేస్తారు. ఆ కిచెన్స్ ను మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు.
అధునాతన సౌకర్యాలతో కూడిన కిచెన్ లలో ఇకపై మధ్యాహ్న భోజనం తయారవుతుంది. మంగళవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా సీకేదిన్నె ఎంపీపీ హైస్కూలులో అధునాతన స్మార్ట్ కిచెన్‌ను (smart kitchen) ప్రారంభించారు. ఈ కిచెన్‌లో 1,787 మంది విద్యార్థులకు భోజనం తయారు చేస్తారు.
మొత్తం ౩౩ పాఠశాలలకు ఇక్కడి నుంచి భోజనం సరఫరా జరుగుతుంది. కొన్ని పాఠశాలలకు కలిపి ఒక పాఠశాలలో ప్రత్యేకంగా కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల సమయం కలిసి రావడంతో పాటు ప్రతి పాఠశాలలో కిచెన్ ఉండటం వల్ల ఏర్పడే ఇబ్బందులు తగ్గుతాయి. కమలాపురం నియోజకవర్గంలో 2, జమ్మలమడుగు నియోజకవర్గంలో 2, కడప నియోజకవర్గంలో మరో స్మార్ట్ కిచెన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి రుచికరమైన భోజనం తయారు కానుంది.
ప్రత్యేక వాహనాల ద్వారా వండిన భోజనాన్ని పాఠశాలలకు తరలిస్తారు. డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెల్లడించారు. వాటి ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు ఆహారం అందిస్తామని తెలిపారు.