అల్లూరయ్య మైసూర్ పాక్ తింటే అదరహో అనాల్సిందే...
x

అల్లూరయ్య మైసూర్ పాక్ తింటే అదరహో అనాల్సిందే...

తెలుగు రాష్ట్రాల్లో అల్లూరయ్య స్వీట్స్ కు భలే గిరాకి. చిన్న షాపు. రోజుకు రూ. 60 నుంచి 75వేల వరకు వ్యాపారం. అది కూడా మైసూర్ పాక్ పైనే ఎక్కువ.


రుచికరమైన వంటకాలు బాగా తినే వారు ఉంటారు. కంటికి ఇంపుగా వుంటే నోటికి రుచిగా ఉంటుందంటారు పెద్దలు. కొన్ని వంటకాలు చూడటానికి బాగా కనిపించవు. కానీ రుచి విషయంలో ఎవ్వరూ వంకబెట్టలేరు. ఇక స్వీట్లు అంటారా... చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలైతే చెప్పేదేముంది చాలా.. చాలా ఇష్టంగా తింటారు. ప్రకాశం జిల్లాలోని జిల్లా కేంద్రమైన ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 85 ఏళ్లుగా మనుమళ్లు, ముని మనుమళ్లు షాపును నడుపుతున్నారు. కనిగిరి ప్రాంతమైన కంకణంపాడు నుంచి ఒంగోలుకు వచ్చిన సొల్లేటి అల్లూరయ్య బతుకు దెరువు కోసం మైసూర్ పాక్ కొట్టు పెట్టాడు. ఒంగోలు ట్రంక్ రోడ్డులో ఐదడుగుల వెడల్పైన చిన్న దుకాణం పెట్టాడు. ట్రంక్ రోడ్డుకు సమీపంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో ఆయనే స్వయంగా అప్పట్లో స్వీట్లు తయారు చేసి ట్రంకు రోడ్డులో ఉన్న చిన్న షాపులో మైసూర్ పాక్ ఉంచేవాడు.

కట్టెల పొయ్యిపైనే వంటకాలు...

మైసూర్ పాక్ ను స్వచ్చమైన ఆవు, గేదె నెయ్యితోనే చేస్తారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని అప్పట్లో పనిలోకి తీసుకుని కట్టెల పొయ్యి మీద చెక్కర పాకం తయారు చేసి అందులో పిండి వేసి చేసిన పాకం చూపరులను ఆకట్టుకోవడమే కాదు, బాగా స్వీట్లు ఇష్టంతో తినేవారిని కట్టిపడేస్తుంది. పాకం సిల్వర్ ప్లేట్లో వేసి ఆరిన తరువాత ముక్కలు చేసి ఇస్తరాకులో పెట్టి షాపుకు పంపించే వారు. అల్లూరయ్య ఇంట్లో తయారు చేసిందని కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. అల్లూరయ్య ఒంగోలు వచ్చిన కొత్తల్లో ఒంగోలు పంచాయతీ. జనాభా 20వేల వరకు ఉండేవారు. అప్పుడు ప్రకాశం జిల్లా ఏర్పాటు కాలేదు. గుంటూరు జిల్లా కింద ఉండేది. రాను రాను అల్లూరయ్య స్వీట్స్ అని చిన్న బోర్డు పెట్టారు. పట్టణ ప్రజలంతా ఒక్క సారైనా అల్లూరయ్య స్వీట్ తినాల్సిందేననే పరిస్థితికి వచ్చారు. మైసూర్ పాక్ తయారీలో అల్లూరయ్య స్వీట్స్ వారు చేసినంత సాఫ్ట్ గా ఎవ్వరూ చెయ్యలేకపోతున్నారు. ఎందుకని తయారు చేసే వారిని ప్రశ్నిస్తే కట్టెల పొయ్యే కారణమంటారు. మంట అన్ని వైపుల నుంచి ఎంతవరకు కావాలో అంతే మొత్తంలో తగులుతుంది. అండీ (పాకం తయారు చేసే గిన్నె) అన్ని వైపుల సమాన వేడిని తీసుకుంటుంది. అదే గ్యాస్ స్టౌ పై అయితే సాధ్యమవడం లేదు. ప్రయత్నించి చూసి ఫెయిలయ్యాము. అందుకే నాటి నుంచి నేటి వరకు కట్టెల పొయ్యి పైనే సీట్లు తయారు చేయిస్తున్నామన్నారు అల్లూరయ్య మనుమడు అల్లూరయ్య.

మైసూర్ పాక్ కోసం వెతుక్కుంటూ ఇక్కడికే వస్తారు...

ఒంగోలు ట్రంక్ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రకరకాల షాపుల వరుసలో చిన్న షాపు. 2003లో రోడ్డు విస్తరణ జరగ్గా 40 అడుగులు పొడవున్న షాపు ఇప్పుడు ఇరవై అడుగులకు వచ్చింది. అయినా ఇక్కడికే మైసూర్ పాక్ కావాల్సిన వాళ్లు వస్తుంటారు. వేరే చోట ఎన్ని షాపులు ఉన్నా వెతుక్కుంటూ ఇక్కడికే వస్తారు. అందుకే ఈ షాపును ఇలాగే కొనసాగిస్తున్నామని అల్లూరయ్య మనుమడు ఫెడరల్ కు చెప్పారు. షాపు వైపు చూడగానే 80 ఏళ్ల నాటి చిన్న చెక్క అరమరా ఉంటుంది. అందులోనే చిన్న బేషన్స్ లో స్వీట్లు పెడతారు. చూడటానికి ఇదేమి కొట్టు. ఇక్కడ ఇదేమి వ్యాపారం అనే భావన ఎవరికైనా కలుగుతుంది. సెంటి మెంట్ గా ఆ చెక్క అరమరాను అలాగే ఉంచామని అల్లూరయ్య వారసులు చెబుతున్నారు. షాపు చాలా చిన్నది. ఇక్కడ స్టీలు అరమరా వంటిది పెడితే స్థలం చాలదు. వేరే చోట పెట్టేందుకు మా మనసు అంగీకరించడం లేదు. పైగా అందరికీ ఈ షాపు బాగా తెలుసు. అందుకే అలాగే చెక్క అరమరానే కొనసాగిస్తున్నామన్నారు.

రోజుకు ఎన్ని కేజీలు మైసూర్ పాక్ అమ్ముతారో తెలుసా?

మైసూర్ పాక్ తో పాటు తొక్కుడు లడ్డు, బాదం పూరీ (లైట్ స్వీట్, ఖాజా టైప్ లో ఉంటుంది), జీడిపప్పు పాకం, బాదుషా, జిలేబి, బూంది లడ్డు తయారు చేస్తారు. ఒక్క మైసూర్ పాక్ రోజుకు సుమారు 70 కేజీలు అమ్ముతారు. కేజీ ధర రూ. 560లు. ఈ స్వీట్లు కాకుండా కారంపూస, బూంది, చకోడీలు, పకోడీలు చేస్తారు. వారికి ఉండే అంచనాను బట్టి స్వీట్స్, హాట్స్ తయారు చేస్తారు. ఏరోజు కారోజు అమ్మాల్సిందే. కొనే వారు వెనుదిరిగినా పరవాలేదు కానీ నిల్వ ఉంచి మరుసటి రోజు అమ్మటం మా షాపు చరిత్రలో లేదని అల్లూరయ్య చెప్పారు.

అన్ని రకాల స్వట్స్, హాట్స్ అమ్మకాల ద్వారా మాదగ్గర పనిచేసే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీతాలు ఇవ్వగలుగుతున్నామన్నారు. సుమారు రూ. 50 వేలకు తగ్గకుండా రోజు వ్యాపారం జరుగుతుందని తెలిపారు.

సిబ్బంది ఎంత మంది ఉన్నారో?

అల్లూరయ్య స్వీట్లు తయారు చేసే వారు ఎవరు? ఎక్కడుంటారు? అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. వారు తెల్లవారు ఝామునే లేచి అల్లూరయ్య ఇంటికి వెళతారు. మొత్తం అక్కడ 20 మంది పనిచేస్తున్నారు. వారిలో అల్లూరయ్యతో పాటు పనిచేసిన వారు చనిపోయారు. వారి పిల్లలు, మనుమళ్లు ఇప్పుడు అక్కడ స్వీట్లు తయారు చేస్తున్నారు. అల్లూరయ్య కొట్లో కూడా మూడో తరం వారు అమ్ముతున్నారు. మనుమళ్లు, మునిమనుమళ్లు ఇదే వ్యాపారం ఇప్పటికీ ఉండటం విశేషం. ప్రతి రోజూ ఒకేసారి ఎంత మొత్తం అవసరమని భావిస్తారో అంతమొత్తం స్వీట్లు తయారు చేస్తారు. పనిచేసే వారికి ఒక్కొక్కరికి రోజుకు రూ. 500లు ఇస్తామని అల్లూరయ్య చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్..

అల్లూరయ్య స్వీట్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫేమస్. పెద్దింటి వారిని కలిసేందుకు, ప్రజా ప్రతినిధులను కలిసేందుకు ఎవరైనా వెళుతున్నారంటే అల్లూరయ్య స్వీట్ తీసుకెళ్లాల్సిందే. తీసుకునే వారు అంతే ఇష్టంగా తీసుకుంటారు. ఇక ప్రత్యేకించి ఆర్డర్లు ఇస్తే తయారు చేసి కార్ఖానా నుంచి నేరుగా వారు చెప్పిన ప్లేస్ కు పంపిస్తారు.

స్వచ్ఛమైన నేతి వంటకం

స్వచ్ఛమైన ఆవు నేతితో అన్ని స్వీట్స్, హాట్స్ తయారు చేస్తారు. ఒక వేళ ఆవునెయ్యి దొరకని రోజు గేదె నెయ్యితో తయారు చేస్తారు. నెయ్యిని బాగా కరిగించి మచి సువాసన వచ్చే సమయంలో వంటకాల్లో కలుపుతారు. అందువల్ల చేతికి అంటుకున్నా నీటిలో చేతిని అలా కడిగితే జిడ్డు అంటకుండా చెయ్యి సుబ్రమవుతుంది. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న వంట నూనెలు అన్ని కల్తీలేననే అనుమానం చాలా మందిలో ఉంది. అందులోనూ కొంత నిజం ఉంది. అందుకే నూనెల వైపు మా తాతగారు కానీ, మేము కానీ చూడలేదు. కేవలం నెయ్యితోనే తయారు చేస్తున్నాం. ముడి సరుకులకు అయ్యే ఖర్చును బట్టి మాత్రమే ధర నిర్ణయిస్తున్నాం. అంతే కాని అడ్డగోలుగా మేమెప్పుడూ ధరలు పెంచలేదని అల్లూరయ్య చెప్పారు. మాకు నెయ్యి అమ్మే వారు కూడా చాలా నమ్మకంతో ఇస్తారు. ఎటువంటి కల్తీలకు తావు ఉండదు.

షాపు నడుపు తున్నది మూడో తరం...

ప్రస్తుతం ఒంగోలులో అల్లూరయ్య ప్రారంభించిన షాపు నడుపుతున్నది అల్లూరయ్య చిన్న కుమారుని కొడుకు అల్లూరయ్య. 1975లో అల్లూరయ్య చనిపోయారు. ఆ తరువాత ఆయన రెండో కుమారునికి 1977లో ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకు అల్లూరయ్య అనే పేరు పెట్టారు. పెద్ద కుమారుని పిల్లలు కూడా న్యూ అల్లూరయ్య సీట్స్ పేరుతో ఆ షాపుకు 20 మీటర్ల దూరంలోనే అదే వరుసలో మరో షాపు పెట్టారు. అయినా అల్లూరయ్య ప్రారంభించిన షాపు వద్ద ఉన్న గిరాకీ ఇతర షాపుల వద్ద ఉండటం లేదు. ఇదేదో మహాత్యమే నంటారు అల్లూరయ్య. పైగా మా జేజినాన్నపై ఉన్న నమ్మకం మాపైనా ఉంది. ఒంగోలులో నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్నాను. అయినా మా జేజినాన్న చూపించిన బాటనే ఎంచుకున్నానని చెప్పారు. మా జేజి నాన్నకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆయన పిల్లలు ఇద్దరూ చనిపోయారు. వారి పిల్లలుగా మేము ఈ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు.

Read More
Next Story