
కారులోనే ఇరుక్కుని ఆరుగురు మృతి
ఈ దుర్ఘటనమీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు కారులోనే పోయాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం సమయంలో లారీ, కార్లు ఢీకొట్టుకోవడంతో ఈ దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న మృతులను బాపట్ల జిల్లా స్టువర్టుపురంకు చెందిన వాసులుగా గుర్తించారు. మహానంది పుణ్యక్షేత్రంలో దేవుని దర్శనం కోసం వెళ్లి స్టువర్టుపురంకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన సమయంలో ఎనిమిది మంది వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాని చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టతరంగా మారింది.