అబ్బబ్బా.. ఇదేం తాగుడ్రా నాయనా, గంటలో ఆరు ప్రమాదాలా
x

అబ్బబ్బా.. ఇదేం తాగుడ్రా నాయనా, గంటలో ఆరు ప్రమాదాలా

గంటలో ఆరు రోడ్డు ప్రమాదాలు.. చేసింది ఒక్కడే. మద్యం మత్తే అందుకు కారణం. పట్టుకుని ఊదిస్తే బ్రీత్ ఎనలైజర్‌లో అంకెలు కూడా పనిచేయట్లా.. అసలు విషయం ఏంటంటే..


అబ్బబ్బా.. ఇదేం తాగుడ్రా నాయనా... మందు తాగినప్పుడు (మద్యం పెట్టుకున్నప్పుడు) నోటి కాడ పెట్టి ఊదమనే గొట్టం– బ్రీతింగ్‌ ఎనలైజర్‌పై లేని అంకెలకు మించి తాగుతున్నారట జనం. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మద్యం తాగిన ఓ యువకుడిని పట్టుకుని పోలీసులు ఊదిస్తే ఈ చిత్ర విచిత్రాలు బయటపడ్డాయి.

ఫుల్‌గా మందు కొట్టిన ఓ యువకుడు ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి బీభత్సం సృష్టించాడు. ఒక్క గంటలో పది నిమిషాలకో రోడ్డు ప్రమాదం చేసి రోడ్లపై వెళ్లే వారికి కూడా నరకం సృష్టించారు. ఓ యువకుడి ప్రాణాలు తీశాడు. సోమవారం రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్య ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఇందులో ఓ యువకుడు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఐకియా నుంచి రాయదుర్గం ఠాణా సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు ఈ వరుస రోడ్డు ప్రమాదాలు చేశాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఇతనో ఐటీ ఎంప్లాయి..

హైదరాబాద్‌ నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్‌ యాదవ్‌. 30 ఏళ్లుంటాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఫుల్‌గా మద్యం తాగాడు. మత్తు తలకెక్కింది. అయినా కార్లో ఇంటికి బయల్దేరాడు. కారు ఎటుపోతుందో తెలియడం లేదు. ఐకియా రోటరీ దగ్గరికి చేరుకున్నాడు. ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టాడు. ఆ కారు దెబ్బతింది. ఆ కార్లోని మహిళకు గాయలయ్యాయి. అయినా క్రాంతి కుమార్‌ కారు ఆపలేదు.

స్పీడూ తగ్గించలేదు. ఇంకొంచెం దూరం పోయి గచ్చిబౌలి బాబూఖాన్‌ లేన్‌ దగ్గర బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో ఒకరికి కాలు విరిగింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. శరీరంలో స్వాధీనం రాక మెదడు పని చేయక క్రాంతి కుమార్‌ మళ్లీ కారు వేగం పెంచి పిస్తా హౌజ్‌ ఎదురుగా ఇంకో కుర్రాడిని ఢీ కొట్టాడు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. పారిపోయే ప్రయత్నంలో మరో మూడు ప్రమాదాలు చేశాడు క్రాంతి కుమార్.

రాయదుర్గం పోలీసు స్టేషన్‌ సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రి దగ్గర మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఇద్దరు గాయపడ్డారు. దానికి కొంచెం దూరంలో మరో బైక్‌ను ఢీకొట్టాడు. మరో ఇద్దరు యువకులు గాయపడ్డాడు. అయినా కారు దిగలేదు.. స్పీడ్‌ తగ్గించలేదు. మత్తులోనే మళ్లీ స్పీడ్‌ పెంచి కారును రయ్యుమనిపించాడు. కిమ్స్‌ ఆసుపత్రి దగ్గర ఆటోను ఢీ కొట్టాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. అప్పుడు కొందరు యువకులు వెంటాడారు.

మల్కంచెరువు దగ్గర కారును ఎట్టకేలకు ఆపి క్రాంతిని కారు నుంచి దించి ఓ ఆటాడుకున్నారు. అప్పుడు వచ్చారు పోలీసులు సినిమాల్లో మాదిరి ఆలస్యంగా.. అంతా అయిపోయాక. ఈ ఆరు ప్రమాదాల్లో దాదాపు పది మంది గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. క్రాంతిని రాయదుర్గం ఠాణాకు తరలించి బ్రీత్‌ ఎనలైజర్‌ నోటి కాడ పెడితే మీటర్‌ రీడింగ్‌ అందలేదట. అతి కష్టం మీద మళ్లీ మద్యం పరీక్షలు నిర్వహిస్తే మీటరు రీడింగ్‌ 550 వచ్చింది. జేబులో ఉన్న ఐడీ కార్డు, కారు నెంబరు ఆధారంగా క్రాంతి కుమార్‌ యాదవ్‌ ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యుల్ని పిలిపించి కేసు పెట్టి జైల్లోకి నెట్టారు.

Read More
Next Story