వైసీపీ మరో ఎమ్మెల్యే రాజీనామా.. గంటల వ్యవధిలోనే..
వైసీపీ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు. రాజీనామాను ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆంధ్ర ఎన్నికల ముందు అసమ్మతితో వైసీపీ అట్టుడుకుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలంతా పార్టీ వీడుతున్నారు. వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రాతినిధ్యం వహించి విజయాన్ని కట్టబెట్టిన వారికి 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో వైసీపీలో అసమ్మతి, అసంతృప్తులు భీకరంగా పెరిగిపోయాయి. ఆ కారణంగానే అసంతృప్తి నేతలంతా పార్టీ వీడటానికి సిద్ధమవుతున్నారు. కిల్లీ కృపారాణితో మొదలైన వలసలు ప్రస్తుతం పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వరకు వచ్చింది. ఈరోజు ఉదయమే ఆయన వైసీపీ పార్టీ ప్రాథమిక అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్‌ఆర్ జిల్లా ముద్దనూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల.. చిట్టిబాబు చాలా గట్టి నేత అని, కాంగ్రెస్ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని చెప్పారు.
రాజీనామాకు అసలు కారణం టికెట్టే
2019 ఎన్నికల్లో పి.గన్నవరం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన కొండేటి చిట్టిబాబు.. ఈసారి ఎన్నికల్లో కూడా ఆ టికెట్ తనకే లభిస్తుందని ఆశించారు. అలా కాకుండా అక్కడి అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం విప్పర్తి వేణుగోపాల్‌ను ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన చిట్టిబాబు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. శనివారం ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడటానికి టికెట్‌తో పాటు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం కూడా ఒక కారణమేనని, దాంతో పాటుగా పార్టీలో వస్తున్న కొత్త విధానాల్లో తాను ఇమడలేకే ఆయన రాజీనామా చేశారని చిట్టిబాబు అనుచర వర్గం చెబుతోంది.
ముందునుంచే మంతనాలు
తన స్థానంలో వేణుగోపాల్‌ను అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన రోజు నుంచే చిట్టిబాబు.. కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ లభించలేదన్న దుగ్దతో పార్టీ మారాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారని, కానీ తనకు టికెట్ లభించే పార్టీలోకి వెళ్లాలని టీడీపీ, జనసేనలతో కూడా మంతనాలు జరిపారాని వైసీపీ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో మాత్రమే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో ఆయన అటుగా రూట్ మార్చారని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
వలసలు పెరిగేనా
అయితే ప్రస్తుతం ఆంధ్రలో నెలకొని ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే వైసీపీలో వలసలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ అనేక మంది నేతలను అసంతృప్తికి గురిచేసిందని, టికెట్ తమకే అనుకున్న పలువురు సిట్టింగ్‌లకు కూడా మొండి చేయి చూపిందని, కావున వారంతా కూడా వైసీపీని వీడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story