సీపీఎం ఉత్తాన పతనాలకు ఓ ప్రత్యక్ష సాక్షి సీతారాం ఏచూరి!
x

సీపీఎం ఉత్తాన పతనాలకు ఓ ప్రత్యక్ష సాక్షి సీతారాం ఏచూరి!

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో ఆయనో యువకుడు. పార్టీ విధివిధానాలను ఖరారు చేయడంలో దిట్ట.


భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో ఆయనో యువకుడు. పార్టీ విధివిధానాలను ఖరారు చేయడంలో దిట్ట. అందరికీ తల్లో నాలుక. పుచ్చలపల్లి సుందరయ్య, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య మొదలు హరికిషన్ సింగ్ సూర్జిత్ వరకు ఎందరెందరికో ఇష్టుడు. అదే సీపీఎం హవా తగ్గుతున్న సమయంలో ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శి. ఎందరెందరికో అయిష్టుడు. మరికొందరికి ప్రత్యర్ధి. ఆయనే సీతారాం ఏచూరి. ఢిల్లీలో గురువారం కన్నుమూశారు. కమ్యూనిస్టు పార్టీ ఉద్దానపతనాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్లలో ఒకరైన సీతారాం ఏచూరి 72 ఏళ్ల వయసులో గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. రెండు సార్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సుదీర్ఘకాలం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీని వివిధ రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి సీతారాం ఏచూరి.

సీతారాం ఏచూరీ 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు. ఆయన ఇంటి వద్దనే పెరిగిన సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం మోహన్ కందా సోదరి. ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ శిష్యురాలు. సీతారాం విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీ.హెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. సీతారాం మొదటి భార్య వీణా మజుందార్ గారి కూతురు. సీతారాం ఏచూరి, సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్‌గా పనిచేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రెసిడెంట్‌ ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుమార్తె ఎడిన్‌బరోలో ఫ్రొఫెసర్. ఓ కుమారుడు ఆశీష్ జర్నలిస్ట్. కరోనా సమయంలో చనిపోయారు. మరో కుమారుడు చదువుతున్నారు. సీతారాం ఏచూరి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌లో కాలమ్స్‌ రాసేవారు. అందువల్లే ఆయన్ను ఢిల్లీ జర్నలిస్టులు సీతా అని పిలుస్తుంటారు. విద్యాభ్యాసమంతా ఢిల్లీ లోనే సాగడంతో ఆయన తెలుగును పట్టిపట్టి పలికేవారు. హిందీ, ఇంగ్లీషుతో సమానంగా బెంగాలీ కూడా మాట్లాడేవారు. ఎమర్జెన్సీ సమయంలో జేఎన్‌యూలో పీ.హెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు.

ఎస్.ఎఫ్.ఐ. ప్రెసిడెంట్ టు సీపీఎం జనరల్ సెక్రటరీ...

1974లో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం- స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది.

బెంగాల్ నుంచి రాజ్యసభకు...

సీపీఎంలో కీలకంగా ఉన్న సీతారాం ఏచూరిని పార్టీ తన వ్యూహంలో భాగంగానే 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు పంపింది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి. యూపీఏ-1లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సీపీఎం తరఫున ఆయన పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకువచ్చారు. ఎన్నో ప్రైవేటు బిల్లులు పెట్టారు. అత్యధిక ప్రశ్నలు అడిగిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి నిందిస్తారు. పశ్చియాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడుపోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే నిదర్శనమంటారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవటానికే, పెత్తనం కోసం అర్రులు చాస్తోందని విమర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా, వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు. ఇదే కారణంలోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కుకుండా సైన్యం జోక్యం చేసుకుంటోదన్నది ఏచూరి ఆరోపణ.

జ్యోతిబసు ప్రధానమంత్రి కాకుండా...

1996 జనరల్ ఎలక్షన్ల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సమయంలో వామపక్ష ఫ్రంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కాంగ్రెస్ కోరింది. జ్యోతిబసును ప్రధానమంత్రిగా నియమించమని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే అప్పుడు అడ్డుకున్నది సీతారాం ఏచూరేననే అపవాదు ఉంది. పార్టీకి సొంత బలం లేకుండా దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టడం సబబు కాదన్న ఆయన వాదన నెగ్గడంతో పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోలేకపోయింది. ఫలితంగా జ్యోతిబసు ప్రధాన మంత్రి కాలేకపోయారు. ఇండియా లాంటి దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చినా సీపీఎం వినియోగించుకోలేకపోయిందన్న వాదన పార్టీలో ఉంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల నుంచే పార్టీ పనితీరు గణనీయంగా తగ్గింది. పార్లమెంటులో సీట్లు తగ్గుతూ వచ్చాయి. బెంగాల్ లో అధికారం పోయింది. త్రిపుర కుప్పకూలింది. కేరళలో నామమాత్రంగా మిగిలింది. అప్పుడు ప్రారంభమైన పతనావస్థ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

పార్లమెంటులో వామపక్షాల గొంతుక...

ఏచూరి రాజ్యసభలో ఉన్నప్పుడు పార్లమెంటులో వామపక్షాల గొంతుకగా మారారు. అణు ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా రూపకల్పన జరుగుతున్నప్పుడు ఆయన వామపక్షాల వాదన వినిపించారు. సొంతపార్టీలోనూ ఈ వ్యవహారమై ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి కారత్ తో విభేదాలు ఉన్నాయని చెబుతారు. కారత్ వైదొలిగిన తర్వాత 2015 నుంచి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందడంతో తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది. వామపక్షాలను పునరుజ్జీవింపజేయడంతో పాటు మమతా బెనర్జీ ఎదుగుదలతో బెంగాల్ లోనూ పార్టీ అధికారాన్ని కోల్పోయి నామమాత్రంగా తయారైంది. ఈ దశలో కేరళలో వామపక్షాల కోటను నిలుపుకునే బృహత్తరమైన పనిని ఏచూరికి అప్పగించారు. వరుసగా సీపీఎం రెండుసార్లు కేరళలో అధికారాన్ని నిలబెట్టుకుంది. అది సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు జరిగింది.

60 మందికి పైగా వామపక్ష పార్లమెంటు సభ్యులున్న స్థాయి నుంచి సింగిల్ డిజిట్ కి వచ్చిన స్థాయి వరకు సీతారాం ఏచూరి చూశారు. పార్టీలో యువతకు పెద్దపీట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న దశలో సీతారాం ఏచూరి కన్నుమూయడం పార్టీకి తీరని లోటనే చెప్పాలి. కమ్యూనిస్టు యోధునిగా మిగిలిన సీతారాం ఏచూరికి దేశంలోని వామపక్ష శ్రేణులు జోహార్లు అర్పిస్తున్నాయి.

Read More
Next Story