సిట్‌కు సరైనోడు దొరికాడు
x

సిట్‌కు సరైనోడు దొరికాడు

ఎన్నికల హింసపై 13 మందితో సిట్‌ ఏర్పాటు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ దీనికి హెడ్‌. ఇక హింసకు కారుకులైన వారి భరతం పట్టినట్లే.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింసపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకునేందుకు 13 మందితో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)ను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేట, మాచర్ల నియోజక వర్గాలు ఈ హింసకు కేంద్ర బిందువులయ్యాయి. కారణాలు ఏమిటి అనే దాని కంటే హింసను అరికట్టడంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ పోలీస్‌ బాస్‌లను ఢిల్లీకి పిలిపించి వార్నింగ్‌లు ఇవ్వడమే కాకుండా రెండు రోజుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సీఎస్, డీజీపీ, నిఘా విభాగం ఇన్‌చార్జి కలిసి ఒక నిర్ణయం తీసుకొని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లో వివిధ జిల్లాల్లో వివిధ విభాగాల్లో పోలీసు అధికారులుగా పని చేస్తున్న వారిని(ఎస్పీ,డీస్పీ,సీఐ స్థాయి అధికారులు) సభ్యులుగా నియమించారు. ఈ క్షణం నుంచి వారు తమ విచారణను ప్రారంభిస్తారు.

అనుకున్న సమయానికి సిట్‌ పని పూర్తి చేస్తుందా?
సిట్‌ నివేదిక ఇవ్వడానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు రాష్ట్రంలోని అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో హింస సంఘటనలు చోటు చేసుకున్న ప్రతి ప్రదేశాన్ని సిట్‌ సందర్శించాలి. చుట్టు పక్కల వారిని విచారించాలి. అవసరమైతే స్థానిక పోలీసులతో స్థానికుల అభిప్రాయాలను రికార్డు చేయించాలి. దీనికి సమయం తక్కువుగా ఉంది. కాబట్టి టీమ్‌లోని సభ్యులను ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించి దర్యాప్తును పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. సిట్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ రాగ ద్వేషాలకు అతీతంగా పని చేస్తారనే పేరు ఉంది. అలాంటి అధికారి నాయకత్వంలో సిట్‌ ఏర్పాటు కావడం వల్ల తప్పు చేసిన వారిని తప్పకుండా పనిష్‌మెంట్‌ ఉంటుందనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్‌ అధికారులను ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌ చేయడం ద్వారా హింసకు బాధ్యులైన వారిని క్షమించే అవకాశం లేదని స్పష్టం చేసినటై్టంది.
సమయం ఎక్కువుగా లేకపోవడం, ఎట్టి పరిస్థితుల్లోను శనివారం సాయంత్రం లేదా ఆదివారానికి రిపోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయడం అనేది అంత తేలిక పని కాదు. అయితే విచారణ బృందంలో ఎక్కువ మంది సీనియర్‌ అదికారులు ఉండటం, ప్రధానంగా జరిగిన సంఘటనలు ఏడు చోట్ల మాత్రమే కావడం వల్ల ఒక్క రోజులోనే టీమ్‌ సభ్యులు నివేదికను తయారు చేసి అందించగలరనే ధీమాలో సిట్‌ ఉంది. నిజానికి సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాల్సి వచ్చినప్పుడు కాస్త సమయం అవసరం అవుతుంది. వాహన, తదిదర సౌకర్యాలు ఉన్నప్పటికీ దర్యాప్తు వచ్చే సరికి చేసిన తప్పు ఏ సెక్షన్‌ కిందకు వస్తుందో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కాస్త బుద్దిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి మాత్రమే సమయం పడుతుంది. ఏమైనా ఎప్పుడూ జరగనంత హింస రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో జరిగింది. అనుకున్న ప్రకారం సిట్‌ దర్యాప్తు బృందం నివేదికను అందించే అవకాశం ఉంది.
సిట్‌లో ఉన్న సభ్యులు వీళ్లే
1. రమాదేవి, ఎస్పీ, ఏసీబీ
2. సౌమ్యలత, అదనపు ఎస్పీ, ఏసీబీ
3. రమణమూర్తి, డీఎస్పీ, ఏసీబీ–శ్రీకాకుళం
4. పి. శ్రీనివాసులు, డీఎస్పీ, సీఐడీ
5. వల్లూరి శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏసీబీ–ఒంగోలు
6. రవి మనోహర ఆచారి, డీఎస్పీ, ఏసీబీ–తిరుపతి
7. వి.భూషణం– ఇన్‌స్పెక్టర్, గుంటూరు రేంజ్‌
8. కె.వెంకటరావు– ఇన్‌స్పెక్టర్‌ ఇంటెలిజెన్స్, విశాఖ
9. రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ
10. జి.ఐ.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ
11. మోయిన్, ఇన్‌స్పెక్టర్‌ ఒంగోలు
12. ఎన్‌.ప్రభాకర్‌ – ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ, అనంతపురం
13. శివప్రసాద్, ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ


Read More
Next Story