మోదీ మెచ్చిన సిరిసిల్ల నేతన్న...ఎందుకంటే...
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్‌ను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెచ్చుకున్నారు. ఈయన పంపిన బహుమతి చూసిన మోదీ అతన్ని మెచ్చుకున్నారు.
జూన్ 9వతేదీ సాయంత్రం...వేదిక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్...దేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ విశిష్ఠ అతిథిగా ప్రధాని ప్రత్యేక ఆహ్వానంపై తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన సాధారణ నేతన్న యెల్ది హరిప్రసాద్ హాజరయ్యారు.మోదీ నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో హరిప్రసాద్ ఒకరు. ఈ వేడుకలో మోదీ అతిథిగా పాల్గొన్న హరిప్రసాద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
- జనవరి 26వతేదీ...ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు మోదీ ఆహ్వానం మేరకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ పాల్గొన్నారు. ఇదేమిటీ సాధారణ సిరిసిల్ల నేతన్నకు మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందటం ఏమిటనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే ఉంది. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ కు ప్రధాని మోదీకి మధ్య బంధం ఎలా ఏర్పడిందంటే...
- జీ-20 సదస్సు సందర్భంగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ చేతితో నేసిన జీ-20 లోగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించారు.అంతే ఆ అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయినన మోదీ తన ‘మన్ కీ బాత్’లో సిరిసిల్ల నేతన్న గురించి ప్రస్థావించారు.ఆ బహుమతితో పాటు ఓ లేఖను కూడా పంపించారు.చేనేత పరిశ్రమ గురించిన సమస్యలు,సూచనలను హరిప్రసాద్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. హరిప్రసాద్ తన కళతో అందరి దృష్టిని ఆకర్షించారని మోదీ కొనియాడారు. అలా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ నైపుణ్యాన్ని చూసి మెచ్చిన మోదీ సందర్భం ఏదైనా ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నారు.
తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న నేత కళ
తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత కళకు హరిప్రసాద్ కొత్త సొబగులు అద్దారు.తన తల్లి రాజ్యలక్ష్మీ, భార్య రేఖతో కలిసి నేసిన చేనేత వస్త్రాలతో హరిప్రసాద్ అద్భుత కళా నైపుణ్యాన్ని చూపిస్తూ పలువురు ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఒక్కో చీరను నేయడానికి 15 రోజుల నుంచి నెల రోజుల దాకా సమయం పడుతుందని, తాము నాణ్యతతో, కళావైభవం ఉట్టిపడేలా వినూత్నంగా నేసే చీరలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫొటో గ్రాఫ్ తో చేనేతతో మగ్గంపై రంగురంగుల కళాఖండాలను సృష్టిస్తున్నారు.
హరిప్రసాద్ నేత కళా నైపుణ్యం
ఐదు అంగుళాల మగ్గంపై జ్ఞాపికలు నేస్తూ హరి ప్రసాద్ నత నేత కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. సాధారణంగా 50 అంగుళాల మగ్గం ఉంటుంది. అయితే హరిప్రసాద్ బుల్లి మరమగ్గాలపై ఎన్నెన్నో నేత కళా వస్త్రాలను నేసి ప్రశంసలందుకుంటున్నారు.ఆజాద్‌కి అమృత్ మహోత్సవం సందర్భంగా జాతీయ గీతం భారతదేశ ముఖచిత్రం ఒకే వస్త్రం పై వచ్చే విధంగా నేశారు. పట్టు పీతాంబరం చీరను నేసి భద్రాచలం శ్రీ సీతారాముల వారి కల్యాణానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి చేతుల మీదుగా సమర్పించారు.ఈ చీరపై సీతారాముల కళ్యాణం, భద్రాద్రి సీతారాముల ప్రతిరూపాలను ఈ చీర చెంగున నేశారు. భారతరత్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దంపతుల ఫోటోతో కూడిన వస్త్రాన్ని నేసిన హరిప్రసాద్ క్రికెటర్ చాముండేశ్వరి ద్వారా అతనికి అందజేశారు.
అగ్గిపెట్టెలో ఇమిడి చీర నేసి...
అగ్గిపెట్టలో ఇమిడే చీర, దబ్బనం సూది, ఉంగరంలో దూరే చీరలను హరిప్రసాద్ నేత మగ్గంపై నేశారు. కేసీఆర్,కేటీఆర్ ముఖచిత్రాలు వస్త్రంపై వేశారు. వైట్ , బ్లూ, రెడ్ కలర్లలో పలు వస్త్రాలు నేస్తున్నారు. జీ 20 సదస్సు సందర్భంగా 20 దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు, మోదీ వారిని ఆహ్వానిస్తున్నట్లు వస్త్రాన్ని నేసి ఔరా అనిపించుకున్నారు. ప్రధాని మోదీ, తల్లి హీరాబాయితో కలిసి ఉన్న చిత్రంతో ఓ ప్రత్యేక వస్త్రాన్ని హరిప్రసాద్ నేశారు. తల్లీ,కుమారుల అనుబంధం పేరిట దీన్ని త్వరలో మోదీకి బహుమతిగా పంపిస్తానని హరిప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అయోధ్య రామమందిరానికి ప్రత్యేక చీర
అయోధ్యలో వెలసిన రామమందిరానికి హరిప్రసాద్ ప్రత్యేక చీర నేశారు. రామాయణంలోని ఇతివృత్తాలు...రాముడి జననం, విలువిద్య నేర్చుకోవడం, సీతారాముల వివాహం, వనవాసం, హనుమంతుడు కలిసిన దృశ్యం, రాముడి పట్టాభిషేకం, రామకోటితో కూడిన ప్రత్యేక చీరను నేశారు. వినూత్నంగా నేసిన ఈ చీరను హరిప్రసాద్ జాతీయ అవార్డు ఎంట్రీ కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
ప్రత్యేక పెళ్లి చీరల డిజైన్
ప్రత్యేకంగా పెళ్లి చీరలను హరిప్రసాద్ డిజైన్ చేస్తున్నారు. తెలంగాణ చిత్రపటంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ చిత్రం వచ్చేలా ఓ వస్త్రాన్ని ఈయన నేశారు.అయోధ్య రాముడి కోసం నేసిన చీరను కేంద్ర హోంశాఖసహాయ మంత్రి బండి సంజయ్ కు చూపించారు.చేనేత వస్త్రాల నేతతో తాను ఉపాధి పొందుతూ, మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్న హరిప్రసాద్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
సిరిసిల్లను సిల్క్ సిటీగా చేయాలి
సిరిసిల్ల ప్రాంతంలో పట్టుగూళ్ల ఉత్పత్తి సాగుతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిల్క్ చేనేత చీరల ఉత్పత్తికి ప్రోత్సాహమిచ్చి సిరిసిల్లను సిల్క్ సిటీగా రూపొందించాలని నేతన్న హరిప్రసాద్ కోరారు.ఎన్నెన్నో నేత కళాఖండాలను నేస్తున్న నేతన్న హరిప్రసాద్ తనకు ఉండటానికి సొంత ఇల్లు లేదంటారు. తన నేత కళా నైపుణ్యాన్ని చూసి ప్రభుత్వం చేయూతనివ్వాలని హరిప్రసాద్ కోరుతున్నారు.
హరిప్రసాద్ కు అవార్డుల పంట
హరిప్రసాద్ కు నేత కళా నైపుణ్యానికి అవార్డుల పంట పండింది. మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా హరిప్రసాద్ నేత కళా వైభవానికి గుర్తింపుగా నేషనల్ హ్యాండ్ లూమ్ కార్పొరేషన్ ఆరు వేల రూపాయల నగదుపురస్కారంతోపాటు సర్టిఫికెట్ అందించింది.అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన హరిప్రసాద్ కు వరంగల్ నిట్ కళాశాల పదివేల రూపాయల నగదుపురస్కారం, మెమొంటో, సర్టిఫికెట్ ఇచ్చి సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం హరిప్రసాద్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతోపాటు రూ.10వేల నగదు, మెమొంటో, సర్టిఫికెట్ అందించింది.
Next Story