సింహాచలంలో సిల్లీ రైలు యాక్సిడెంట్‌!
x
నుంచి స్ట్రెచర్‌పై ప్రయాణికుడిని తీసుకొస్తున్న సన్నివేశం

సింహాచలంలో సిల్లీ రైలు యాక్సిడెంట్‌!

విశాఖపట్నం సమీపంలోని సింహాచలం రైల్వే స్టేషన్‌లో ఓ రైలు ప్రమాద సన్నివేశం అందరిలోనూ అలజడి రేపింది.

అది సింహాచలం రైల్వే స్టేషన్‌. సింహాచలం శ్రీవరాహ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చి వెళ్లే భక్తులు ఆ స్టేషన్‌లోనే దిగుతారు.. ఎక్కుతారు. అలా భక్తులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆ స్టేషన్‌లో ఉన్నారు. తాము వెళ్లాల్సిన రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో భళ్లుమంటూ పెద్ద పేలుడు శబ్దం! అంతే.. అక్కడున్న వారిలో ఒక్కసారిగా అలజడి. కొందరు ప్రాణభయంతో తలోవైపు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఏదో రైలు ప్రమాదం జరిగిందని అర్థమైంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే పట్టాలు తప్పిన రైలు బోగీలు కనిపించాయి. అక్కడకు ఉరుకులు పరుగులతో రెస్క్యూ టీమ్‌లు, కుయ్‌ కుయ్‌మంటూ అంబులెన్సులు వచ్చాయి. వీరంతా రైలు బోగీల్లోకి అతికష్టమ్మీద Ðð ళ్లారు. అందులో చిక్కుకున్న వారిలో కొందరిని స్ట్రెచర్లపై బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడ్డ (?) వారిని హుటాహుటీన అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఫస్ట్‌ ఎయిడ్‌ (ప్రాథమిక చికిత్స)ను అందించారు. ప్రయాణికులు, క్షతగాత్రులను రక్షించేందుకు సహాయ కార్యకలాపాలను చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని తీసుకెళ్లడం కోసం ఒక ఏసీ, రెండు నాన్‌ ఏసీ కోచ్‌లతో కూడిన రైలును రప్పించారు.


మాక్‌ డ్రిల్‌లో సహాయక చర్యలు చేపడ్తున్న రెస్క్యూ టీమ్‌

ప్రమాద స్థలికి తరలి వచ్చిన జనం..
సింహాచలం రైల్వే స్టేషన్‌లో రైలు ప్రమాదం సంభవించిందన్న సంగతిని తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు ప్రమాద స్థలికి పరుగున తరలి వచ్చారు. గాయాలతో కనిపించిన వారిని చూసి ఏవరికైనా ఏమైనా జరిగిందా? ప్రాణాపాయం ఉందా? అంటూ ఆందోళనతో ఆరా తీశారు. కొంతమంది గాయపడ్డారని, ప్రాణాపాయం లేదని రైల్వే సిబ్బంది చెప్పారు. ఒకపక్క క్షతగాత్రులు, మరోపక్క రైల్వే సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు, స్థానికులు, మీడియా సభ్యులతో ఆ ప్రాంతమంతా హడావుడిగా కనిపించింది.
అదంతా ఉత్తుత్తి యాక్సిడెంటే..
సింహాచలం రైల్వే స్టేషన్‌లో రైలు ప్రమాదం ఉత్తుత్తిదేనని కాసేపటి తర్వాత అక్కడున్న వారికి అర్థమైంది. ఎందుకంటే రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను రక్షించడానికి రైల్వే సిబ్బంది ఎలాంటి సన్నద్ధతతో ఉన్నారో తెలుసుకోడానికి ఏటా రైల్వే శాఖ ఇలాంటి ప్రమాదం కాని ప్రమాద సన్నివేశాన్ని (మాక్‌ డ్రిల్‌) సృష్టిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం విశాఖ సమీపంలోని సింహాచలం రైల్వే స్టేషన్‌లో జరిగిన రైలు యాక్సిడెంట్‌ సన్నివేశం కూడా అలాంటిదే. ఆ సంగతి తెలియని వారు తొలుత ఆందోళన చెందినా డమ్మీ యాక్సిడెంట్‌ అని తెలిశాక హమ్మయ్యా! అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనా స్థలంలో డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా

మాక్‌ డ్రిల్‌పై డీఆర్‌ఎం ఏమన్నారంటే?
సింహాచలం రైల్వే స్టేషన్‌లో మాక్‌ డ్రిల్‌పై వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రా ఏమన్నారంటే? ‘ఊహించని రైలు ప్రమాద సమయాల్లో ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి సన్నద్ధత చాలా ముఖ్యం. ఇలాంటి ప్రమాదాల్లో రైల్వే సిబ్బంది సన్నద్ధత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇలాంటి మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తుంటాం. అందులో భాగమే ఇది. వివిధ కోచ్‌ల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకురావడంపై సాధనతో పాటు వారికి సహాయ పడడంపై ఈ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించాం. ఇందుకోసం మేం మూడు కోచ్‌లను (ఒకటి ఏసీ, రెండు నాన్‌ ఏసీ) ఉపయోగించాం. ప్రయాణికులుగా నటిస్తున్న వారికి అక్కడికక్కడే వైద్య సంరక్షణ లభించే సన్నివేశాన్ని సృష్టించాం. ప్రమాదంలో దెబ్బతిన్న (?) బోగీలను భద్రతా ప్రోటోకాల్‌ ప్రకారం తిరిగి తరలించాం. ఈ డ్రిల్‌ ద్వారా ప్రతి రైల్వే బృంద సభ్యుడు అసలైన ప్రమాద సమయంలో వారి బాధ్యతను గుర్తెరిగేలా చేస్తుంది. వారి సమర్థతను బలోపేతం చేస్తుంది. ఈ మాక్‌ డ్రిల్‌ విజయవంతం అయింది’ అని డీఆర్‌ఎం బోహ్రా చెప్పారు. రైల్వే మెకానికల్, క్యారేజీ, వ్యాగన్, సేఫ్టీ, ఆపరేషన్స్, కమర్షియల్, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, మెడికల్, సివిల్‌ డిఫెన్స్‌ పర్సనల్‌ బ్రాంచి, ఫైనాన్స్, సిగ్నల్‌ అండ్‌ టెలికాం, ఫైర్‌ సిబ్బంది పాలుపంచుకున్నారు. వివిధ విభాగాల సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Read More
Next Story