తోటను వెంటాడిన శిరో నేరం
x

తోటను వెంటాడిన శిరో నేరం

ఎన్ని ఎత్తులు వేసినా.. ఎన్ని పార్టీలు మారినా.. త్రిమూర్తుల ఎత్తులు చిత్తయ్యాయి. చివరకు శిక్షపడక తప్పలేదు.


ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారి శిరో ముండనం కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారని తోట త్రిమూర్తులుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటే తనను తాను కాపాడుకోవడంతో పాటు కేసులో నిందితులుగా ఉన్న తన బంధువులు, అనుచరలను తప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారని కూడా విమర్శలు ఉన్నాయి. స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి మారి కేసును ముందుకు సాగకుండా అడ్డుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడి పోయారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడంతో ఆయన వైఎస్‌ఆర్‌సీపీలోకి మారారు.

1982లో త్రిమూర్తులు రాజకీయాల్లోకి..
తోట త్రిమూర్తులు రాజకీయ ప్రయాణం 1982లో మొదలైంది. నాడు ఏర్పాడిన తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు. అనంతరం ఆయన రామచంద్రాపురంలో బలమైన నేతగా ఎదిగారు. అయితే ఆ పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. 1983 నుంచి 1994 వరకు ఆయన అదే పార్టీలో ఉన్నా ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వడం కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించడం కానీ చేయలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు. 1994 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టల శ్రీసూర్యనారాయణ బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పిల్లి సుబోస్‌ చంద్రబోస్‌ బరిలోకి దిగినా వారిని పక్కన పెట్టి తోట త్రిమూర్తులకు పట్టం కట్టారు.
1996లో తెరపైకి శిరోముండనం కేసు
తర్వాత రెండేళ్ల అనంతరం శిరోముండనం కేసు చోటు చేసుకుంది. 1996 డిసెంబరు 29న సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులును కూడా నిందితుడిగా పేర్కొంటూ శిరోముండనం కేసు నమోదు చేశారు. మొత్తం 9 మంది నిందితులగా చేర్చుతూ కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో చెందిన ఐదుగురు దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులను చిత్ర హింసలకు గురి చేసి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు గీయడంతో పాటు కనుబొమలను కూడా తొలగించారు. చల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వుల వెంకటరమణ, కనికెళ్ల గణపతిలను చిత్రహింసలకు గురిచేయగా కోట చినరాజు, దడాల వెంకటరత్నంలను చిత్రహింసలను గురి చేయడంతో పాటు శిరోముండనానికి గురయ్యారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఎస్సీ,ఎస్టీ సంఘాలు, వామపక్షాలు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులుతో పాటు మరో 8 మందిని నిందితులుగా చేర్చుతూ 1997లో ద్రాక్షారామం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టి నిర్థారించిన ఎస్పీ
అయితే దీనిపై నాటి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న ఆదిత్య త్రిపాటి నేరుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టిన అనంతరం ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోథక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన తోట త్రిమూర్తులకు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో దాదాపు 87 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. శిరోముండనం కేసు బలపడుతున్న నేపథ్యంలో కేసును అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆమేరకు నాటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేచ్చారు. ఈ కేసు విచారణకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించడంతో పాటు కేసును శాశ్వతంగా క్లోజ్‌ చేసేందుకు నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో 1998లో శిరోముండనం కేసు నిలపేసే విధంగా టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తర్వాత ఆ కేసును రద్దు చేస్తూ కూడా జీవోను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు దీనిపై స్పెషల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నాటి టీడీపీ ప్రభుత్వం జస్టిస్‌ పుట్టు స్వామి కమిషన్‌ను 2000లో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ నివేదించిన రిపోర్టు ఆధారంగా శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు పేరును తొలగిస్తూ నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తోట త్రిమూర్తులను నిందితుడే అని ఆయనను కూడా నిందితుల జాబితాలో చేర్చాలని బాధితులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో 2008లో ఈ కేసును తిరిగి రీ ఓపెన్‌ చేశారు. అప్పటి వరకు టీడీపీలో ఉన్న తోట త్రిమూర్తులు తర్వాత పీఆర్‌పీలోకి వెళ్లారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో త్రిమూర్తులు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు.
2012లో జరిగిన ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అలా 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ శిరోముండనం కేసును తొక్కిపెడుతూ వచ్చారు. తర్వాత 2014లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో మెజారిటీ సంపాదించిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ తనకు అండగా నిలుస్తూ వచ్చింది. మరో సారి అధికారంలోకి రావడంతో ఇక శిరోముండనం కేసునూ నీరు గార్చేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తర్వాత జరిగిన 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన త్రిమూర్తులు ఓడి పోయారు. ఊహించన విధంగా వైఎస్‌ఆర్‌సీపీ గెలవడం, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారిన్ని చేజిక్కించుకోవడంతో త్రిమూర్తులు తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ గూటికి వచ్చారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ప్రస్తుతం ఆయన వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థిగా మండపేట నుంచి బరిలో ఉన్నారు.
ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం శిరోముండనం కేసును బలహీన పరచడం, ఆ కేసు ముందుకు సాగకుండా అడ్డుకోవడం చేస్తూ వచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 నుంచి విచారణ చేపట్టిన విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇటీవల తోట త్రిమూర్తులతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానాను కూడా విధించి సంచలన తీర్పు చెప్పడం సంచలనంగా మారింది.
Read More
Next Story