హెచ్‌ఆర్‌సీని కర్నూలు నుంచి తరలిస్తున్నారా?
x

హెచ్‌ఆర్‌సీని కర్నూలు నుంచి తరలిస్తున్నారా?

అధికారంలోకి వచ్చిన ప్రతీ సారి కర్నూలు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఇంకా నష్టం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.


మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ)తో పాటు లోకాయుక్తాని కూడా కర్నూలు నుంచి అమరావతికి తరలిస్తున్నారని, అందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌సీని కానీ, లోకాయుక్తాను కానీ కర్నూలు నుంచి అమరావతికి తరలించడానికి వీల్లేదని డిమాండ్‌ చేశారు. ఒక వేళ సీఎం చంద్రబాబు నాయుడు వాటిని తరలించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని, ప్రజా ఉద్యమం చేపడుతామని కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు. ఆ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మేయర్‌ బీవై రామయ్యతో పాటు మరి కొంత మంది న్యాయవాదుల బృందం శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఇప్పటికే చాలా నష్టపోయిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసే దిశగా తీసుకొచ్చిన సంస్థలను ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరలిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలుకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.

నాడు జగన్‌ కేంద్రాన్ని ఒప్పించి కర్నూలుకు లా యూనివర్శిటీని తీసుకొచ్చారని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోకుండా కర్నూలు జిల్లాకు నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు లా యూనివర్శిటీని ఇక్కడ నుంచి తరలించుకొని పోతోంటే కూటమి ప్రభుత్వంలోని కర్నూలు జిల్లా నేతలు, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు నష్టమే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఈ సంస్థల తరలింపులు అడ్డుకొని, కర్నూలు జిల్లాను కాపాడుకుంటామని అన్నారు.
Read More
Next Story