
’స్త్రీ శక్తి‘ అంటే ఆమె గుర్తొస్తారు
అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల సందర్భంగా భావోద్వేగానికి గురైన మంత్రి నారా లోకేష్.
“స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులకు సరైన సమాధానాలు ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటి. వరుసగా 8 కేంద్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఆమె జీవితం మనందరికీ ఒక పాఠం” అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.
లోకేష్ ఏమన్నారంటే..
’దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి. మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారు. ఒక్క వ్యక్తికోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు పోరాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లాం. అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదు. పవర్ ఫుల్ ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు పునఃప్రారంభించి జెట్ స్పీడ్ లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్. మంగళగిరి చేనేత వస్త్సాలను ధరించి ప్రమోట్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు. ఏపీ ఏ సాయం కోరినా ఆర్ధిక మంత్రి సహకారం అందిస్తున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ఆదుకున్నారు. భారత్ లో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ విశాఖకు వస్తోంది. దీనికి అండగా ఆమె నిలిచారు. 15 బ్యాంకులు, బీమా కంపెనీలు రూ.1334 కోట్లతో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజధానిలోని బ్యాంక్ స్ట్రీట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయి‘ అని పేర్కొన్నారు.
‘జై అమరావతి’ అన్నందుకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు రైతులపై కేసులు పెట్టారు. దాదాపు 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 3 వేల మంది రైతులపై కేసులు పెట్టారు. అయినా వెనుకాడకుండా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు.. ఇది రైతుల త్యాగం” అంటే అని మాట్లాడుతూ లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని, ఇప్పుడు ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
Next Story

