మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ 69వ ఏటలోకి అడుగు పెట్టారు. 1956 ఏప్రిల్ 19న ఆమె కడప జిల్లా బలపనూరు మండలం సింహాద్రిపురంలో జన్మించారు. శనివారం విజయమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా విజయమ్మ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హ్యాపీ బర్త్‌డే మా అంటూ తల్లి విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
దీంతో పాటుగా తనకు, తన తల్లి విజయమ్మకు మధ్య ఉన్న అనుబంధం పట్ల భావోద్వేగానికి లోనవుతూ తన సోషల్ మీడియ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. నాకు జన్మనిచ్చి.. నా జన్మకు సార్థకత చేసే విధంగా ఎల్లప్పుడు అండగా ఉంటున్నారు.. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి అమ్మా.. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశాంతిని, ఆనందాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ తన తల్లి విజయమ్మ పట్ల తనకున్న పేమానురాగాలను పంచుకున్నారు. దీంతో పాటుగా తన తల్లి విజయమ్మతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తల్లి విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారా? లేదా? అనేది చర్చగా మారింది. మరో వైపు వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్లు, పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు సందర్భంగా విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంత మంది శ్రేయోభిలాషులు విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్న నేపథ్యంలో విజయమ్మ ముద్దుల కొడుకు వైఎస్ జగన్, తన తల్లికి బర్త్‌డే విషెస్ చెప్పారా? లేదా? అనేదానిపైన చర్చించుకుంటున్నారు.
వైఎస్‌ఆర్ బతికి ఉన్నన్ని రోజులు ఇంటికే పరిమితమైన విజయమ్మ ఆయన అకాల మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తొలి సారి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విజయమ్మ తర్వాత చోటు చేసుకున్న పరిణామల క్రమంలో దానికి రాజీనామా చేసి తన కొడుకు జగన్ పెట్టిన పార్టీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా సొంత మరిది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మీద పోటీ చేసి రెండో సారి గెలుపొందారు. వైసీపీలో చోటుచేసుకున్న అనేక పరిణామాల రీత్యా అప్పటి వరకు ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత తన కుటుంబంలో కొడుకు జగన్, కూతురు షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల తగాదాల విషయంలో కూతురు షర్మిలకే విజయమ్మ తన మద్దతు తెలిపారు.