బాబుకు  స్పెషల్ స్టేటస్ ను గుర్తు చేసిన షర్మిల...
x

బాబుకు 'స్పెషల్ స్టేటస్' ను గుర్తు చేసిన షర్మిల...

ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పును వన్‌సైడ్ చేసేశారు. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమికే జయ రథం పట్టారు.


ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పును వన్‌సైడ్ చేసేశారు. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమికే జయ రథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీకి పంటి కింద రాయిలా మారిన వారిలో షర్మిల ప్రధానంగా ఉంటారు. ఆమె ప్రచారానికి కదిలిన ప్రతిసారి వైఎస్‌కు మైనస్ పాయింట్‌గానే మారింది. దానికి తోడు కడపలో అవినాష్‌పై పోటీగా నిలబడంతో ఈసారి అవినాష్ పని అయిపోయిందని అనుకున్నారు. దానికి తోడుగా షర్మిల రాకతో ఆంధ్రలో కాంగ్రెస్ మరోసారి పుంజుకుంటుందని విశ్లేషకులు కూడా భావించారు. కానీ అంతా ఉత్తుత్తినే అని ప్రజలు తమ తీర్పుతో తేటతెల్లం చేశారు. ఎమ్మెల్యే కాదు కదా ఎంపీగా కూడా ఎక్కడా అవకాశం కల్పించలేదు. ఆఖరికి షర్మిలను కూడా ఓడించి మరోసారి అవినాష్‌కు పట్టం కట్టారు.

విజయం సాధించిన షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడంపై స్పందించిన విశ్లేషకులు షర్మిల.. ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, తన లక్ష సాధనలో కాదని అంటున్నారు. షర్మిల లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదని, ఓట్లు చీల్చడమని, అందులో ఆమె కూటమి కన్నా అద్భుతంగా విజయం సాధించారని విశ్లేషకులు చెప్తున్నారు. కడపలో కూడా ఆమె ఒక్కరే లక్షకుపైగా ఓట్లను చీల్చారని, అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలోనే ఓట్లను చీల్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రలో వచ్చి ఎన్నికల ఫలితాలపై షర్మిల స్పందించారు. చంద్రబాబుకు ఒక సలహా కూడా ఇచ్చారు.

అన్నీ జరగాలి

‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ప్రజల కోరిక మేరకు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఆకాంక్షిస్తున్నా. పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగులకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు అందాలి. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా ప్రజలకు అందాలి’’ అని ఆమె ఎక్స్(ట్వీట్) చేశారు.

‘విభజన హామీలకు కట్టుబడితేనే’

‘‘ప్రజలు ఇచ్చిన ఇంతపెద్ద మెజార్టీతో ఎలా ముందడుగు వేయాలో, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ముందుకు సాగాలి. అంతేకాకుండా ప్రత్యేక హోదాకు, విభజన హామీల అమలుకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ ఇకపై రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది. ప్రజల గళమైన ఉద్యమ స్వరాన్ని వినిపిస్తుంది’’ అని స్పష్టం చేశారు.

Read More
Next Story