
కైలాసగిరిపై స్కై వాక్ గాజు వంతెన
విశాఖలోని కైలాసగిరిపై సరికొత్త అద్దాల వంతెన
ఈ వంతెనపై నుంచి నడిస్తే ఆకాశంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. త్వరలో ప్రారంభం
విశాఖలో అందాలన్నీ ఒకెత్తు.. కైలాసగిరిపై సౌందర్యం ఒక్కటీ మరో ఎత్తు. విశాఖ పర్యటనకు వచ్చిన వారెవరూ కైలాసగిరికి వెళ్లకుండా తమ తిరిగి వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఈ కొండపై 40 అడుగుల ఎత్తున శివపార్వతుల విగ్రహాలు, పూల గడియారం, టైటానిక్ వ్యూ పాయింట్, టాయ్ ట్రైన్, రోప్ వే, జిప్‌లైన్, స్కై సైక్లింగ్, పిల్లలు సరదాగా ఆడుకునే పార్కు ప్రాంతాలు.. ఇలా ఒకటేమిటి? పర్యాటకులను మైమరపించే ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీటికి మరో ప్రత్యేక ఆకర్షణ తోడవుతోంది. దాని పేరే కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి. చైనా, దుబాయ్‌ల్లో ఉన్న ఈ తరహా గ్లాస్ బ్రిడ్జి కథాకమామిషు ఏమిటో చూద్దాం..

ఎండ్ పాయింట్ నుంచి కైలాసగిరి వైపు ఇలా
దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి..
కైలాసగిరి కొండపై అదనపు పర్యాటక ఆకర్షణ కోసం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) రూ.7 కోట్ల వ్యయంతో కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. కేరళకు చెందిన భారత్ మాతా వెంచర్స్, విశాఖలోని ఎస్‌ఎస్‌ఎం షిపింగ్ అండ్ లాజిస్టిక్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన ఆర్జే అడ్వెంచర్స్ సహకారంతో నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జి పొడవు 55 మీటర్లు. ఇది దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి. కేరళలోని వేగమోన్ గ్లాస్ బ్రిడ్జే ఇంతవరకు పొడవైనది. దాని పొడవు 38 మీటర్లు. వేగమోన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చించారు. ఆ బ్రిడ్జిని రెండేళ్ల క్రితం ప్రారంభించారు. ఇంకా బీహార్, సిక్కింలలో మరో రెండు వెరసి దేశం మొత్తమ్మీద మూడు గ్లాస్ బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి. విశాఖ కైలాసగిరిపై ఏర్పాటైనది నాలుగవది. ఇక అత్యాధునికæ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జిలు చైనా, దుబాయ్ దేశాల్లోనూ ఉన్నాయి. ఆసక్తి ఉన్న పర్యాటకులు అక్కడకు వెళ్లి ఈ గ్లాస్ బ్రిడ్జిలను చూసి వస్తున్నారు. ఈ దేశాల్లో ఉన్న మాదిరిగానే మన విశాఖపట్నం కైలాసగిరి కొండపై కూడా కాంటిలివర్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తోంది. దాదాపు నిర్మాణం పూర్తయిన ఈ వంతెనకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అవి పూర్తికాగానే మరికొద్ది రోజుల్లో ఈ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

లోయ నుంచి పైకి చూస్తే గ్లాస్ బ్రిడ్జి ఇలా
మైమరపించే మధురానుభూతి..
కైలాసగిరి కొండపై ఇప్పటికే ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దానికి చేరువలోనే గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జిపైకి వెళ్లిన వారికి మైమరపించే మధురానుభూతి కలుగుతుంది. ఈ వంతెనపై నుంచి కిందకు గ్లాసులోంచి చూస్తే కళ్లు తిరిగే లోతైన లోయ కనిపిస్తుంది. చుట్టూ కనుచూపు మేరలో పచ్చని చెట్ల హారంలా పరచినట్టు అగుపిస్తుంది. ఇక తూర్పు వైపంతా నీలి సంద్రంలో అలుపెరగకుండా ఎగసి పడుతున్న కెరటాలు ముందుకు వస్తూ.. ఆ వెనువెంటనే వెనక్కి వెళ్లిపోతూ కనువిందు చేస్తున్న దృశ్యాలు ద్యోతకమవుతాయి.దక్షిణ దిశ వైపు చూస్తే విశాఖ నగరం చాలా వరకు కనిపిస్తుంది.
ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో..
ఈ గ్లాస్ బ్రడ్జి నిర్మాణానికి ప్రపంచ స్థాయి నాణ్యత, భద్రతలో భాగంగా 40 ఎంఎం మందం కలిగిన మూడు పొరల టెంపర్డ్ లామినేటెడ్ జర్మన్ గాజు ప్యానెల్‌ను ఉపయోగించారు. 40 టన్నుల ఫ్యాబ్రికేటెడ్ ఉక్కును వినియోగించారు. ఈ గ్లాస్ బ్రిడ్జిపైకి ఒకేసారి 40 మంది వరకు నడిచి వెళ్లవచ్చు. ఈ అద్దాల వంతెనపై వెళ్లిన వారు ప్రమాదాల పాలవకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. బ్రిడ్జి రైయిలింగ్‌కు పైన రోప్ (తాడును) కూడా ఏర్పాటు చేశారు. బ్రిడ్జి చివరన ఆరుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఎవరైనా అత్యుత్సాహంతో పైకి ఎక్కి లోయలో పడిపోకుండా వీరు అప్రమత్తంగా ఉంటారు.
టిక్కెట్టు ధరపై ఇంకా రాని స్పష్టత..
మరోవైపు కైలాసగిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జిపై ప్రవేశానికి టిక్కెట్టు ధర ఇంకా నిర్ణయించలేదు. కేరళలోని వేగమోన్ గ్లాస్ బ్రిడ్జికి టిక్కెట్టు ధర మనిషికి తొలుత రూ.500 నిర్ణయించారు. అయితే అంత ధర చెల్లించి ఆ బ్రిడ్జిని చూసేందుకు పర్యాటకులు ముందుకు రాలేదు. దీంతో టిక్కెట్టు ధరలో సగం అంటే రూ.250కి తగ్గించారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని విశాఖ కైలాసగిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జి టిక్కెట్టు రేటు రూ.200–.250 మధ్య టిక్కెట్టు ధర నిర్ణయించవచ్చని అంటున్నారు.

వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్
వైజాగ్‌ను ప్రపంచ పటంటో ఉంచుతుంది..
‘కైలాసగిరిపై ఏర్పాటు చేసిన ఈ గ్లాస్ బ్రిడ్జి భారత పర్యాటక రంగానికి చిహ్నంగా మారుతుంది. ఈ వంతెన భారత, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంది. వారికి మరపురాని మధురానుభూతిని మిగిలిస్తుంది. వైజాగ్‌ను ప్రపంచ సాహస పటంలో ఉంచుతుంది’ అని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
Next Story