
జోగిది అక్రమ అరెస్ట్..రాజకీయ కుట్ర
కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ ను ఆదివారం అరెస్ట్ చేశారు. అరెస్ట్‌పై భార్య శకుంతల తీవ్ర ఆరోపణలు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన భార్య జోగి శకుంతల తీవ్రంగా స్పందించారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంటికి చేరుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బృందం, ఎక్సైజ్ అధికారులు సెర్చ్ వారెంట్‌తో తనిఖీలు చేసి రమేష్‌తో పాటు అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌ను శకుంతల "అక్రమ అరెస్ట్"గా, TDP ప్రభుత్వం చేస్తున్న "రాజకీయ కుట్ర"గా పేర్కొన్నారు.
జోగి రమేష్ అరెస్ట్ తర్వాత మీడియాతో మాట్లాడిన శకుంతల.. నకిలీ మద్యంకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని మండిపడ్డారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన రావుతో కావాలనే తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని, కావాలనే దురుద్దేశ పూర్వకంగా జోగి రమేష్ ను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. జోగి రమేష్ అరెస్టుతో తమ కుటుంబం భయపడదని, దీనిపైన న్యాయపోరాటం చేస్తాం" అని శకుంతల స్పష్టం చేశారు. అరెస్టు సమయంలో జోగి ఇంటికి వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్రమంగా కావాలనే జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారని నినదించారు.
ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. "కల్తీ మద్యం కేసు TDP ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం. కాశీబుగ్గ తొక్కిసలాట, తుపాను దెబ్బలు వంటి వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించాలనే కుట్ర" అని ఆరోపించారు. ఫేక్ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కావాలి అని డిమాండ్ చేశారు.

