37 మండలాల్లో తీవ్ర కరువు
x

37 మండలాల్లో తీవ్ర కరువు

ఏపీలో ఈ ఏడాది కరువు తాండవించింది. మొత్తం 51 మండలాల్లో కరువు ప్రభావం ఉండగా 37 మండలాల్లో తీవ్రంగా ఉంది.


రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించినట్లు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా చిపరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా తెలిపారు. డ్రౌట్ మేనేజ్మెంట్ మాన్యువల్ ప్రకారం, రైతులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం వేసవి తీవ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని, అవసరమైన నిధులు, సబ్సిడీలు, సహాయక కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తీవ్ర మండలాలు

కర్నూలు జిల్లాలో అస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలు, నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల, అనంతపురం జిల్లాలో బెలుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యల్లనూరు, యాడికి, శ్రీ సత్యసాయి జిల్లాలో రొద్దం, ప్రకాశం జిల్లాలో పుల్లలచెరువు, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, కంభం, తర్లుపాడు, పెద్దారవీడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బెస్తవారిపేట, వైఎస్సార్ జిల్లాలో దువ్వూరు, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, శ్రీ అవధూత కాశీనాయన, ఖాజీపేట, చపాడు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు మండలాల్లో తీవ్ర మైన కరువు ఉన్నట్లు ప్రభుత్వం నిర్థారించింది.

సాధారణ కరువు మండలాలు

కర్నూలు జిల్లాలో పత్తికొండ, నంద్యాల జిల్లాలో బేతంచెర్ల, బనగానిపల్లె, సంజమల, ఉయ్యాలవాడ, అనంతపురం జిల్లాలో విడపనకల్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో తనకల్, ప్రకాశం జిల్లాలో కంనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, చంద్రశేఖరపురం, పామూరు, రాచర్ల, వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం మండలాలు ఉన్నాయి.

ప్రధానంగా ప్రకాశం జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర కరువు ఉంది. ఆరు మండలాల్లో సాధారణ కరువు ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 9 మండలాలు, అనంతపురం జిల్లాలో 6మండలాల్లో తీవ్ర కరువు ఉంది.

Read More
Next Story