‘సెన్యార్‌ ’ వెళ్లింది.. ‘డిట్వా’ వస్తోంది..!
x
డిట్వా తుపాన్ గమ్యాన్ని తెలిపే ట్రాక్‌

‘సెన్యార్‌ ’ వెళ్లింది.. ‘డిట్వా’ వస్తోంది..!

ఆంధ్రప్రదేశ్‌కు సెన్యార్‌ తుఫాన్‌ ముప్పు పోయిందని సంబర పడుతుంటే.. దిత్వా పేరుతో వస్తున్న మరో తుఫాన్‌ భయపెడుతోంది.

దాదాపు పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను తుపాన్లు వణికిస్తున్నాయి. ఏపీ వైపు వస్తున్నామంటూ దడ పుట్టిస్తున్నాయి. వారం రోజుల క్రితం అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపాన్ (సెన్యార్‌)గా మారిన సంగతి తెలిసిందే. ఆరంభంలో ఈ తుఫాన్‌ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనించి దక్షిణ కోస్తాంధ్రలో తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తో పాటు పలు ప్రపంచంలోని మరికొన్ని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు పశ్చిమ బెంగాల్‌/బంగ్లాదేశ్‌ వైపు ప్రయాణించి అక్కడ తీరాన్ని తాకుతుందని లెక్కలు కట్టాయి. అయితే వారందరి అంచనాలను బోల్తా కొట్టిస్తూ తన దిశను మార్చుకుని భారత సముద్ర జలాలను దాటుకుంటూ వెళ్లి మలక్కా జలసంధి, ఈశాన్య ఇండోనేషియాను ఆనుకుని ఉన్న ప్రాంతంలో బుధవారం రాత్రి తీరాన్ని దాటింది. ఆపై అది వాయుగుండంగా బలహీనపడింది. సెన్యార్‌ తుపాన్ ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందోనని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందారు. అయితే అదృష్టవశాత్తూ సెన్యార్‌ అనూహ్యంగా ఇండోనేషియా వైపు మళ్లడంతో హమ్మయ్యా! అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా భయపెడుతున్న డిట్వా తుపాన్..
సెన్యార్‌ తుపాన్ ఇండోనేషియా వద్ద తీరాన్ని దాటిందో లేదో.. అలా మరో తుపాన్ రంగప్రవేశం చేసింది. నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారింది. ఇది నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర, వాయవ్య దిశగా పయనించింది. ఆపై గురువారం మధ్యాహ్నానికి తుపాన్ గా బలపడింది. అనంతరం ఈ తుపాన్ రానున్న 48 గంటల్లో అదే దిశలో కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా బులెటిన్‌లో వెల్లించింది.
ఈ తాజా తుపాన్ పేరు ‘డిట్వా’..
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ సరికొత్త తుపాన్కు డిట్వాగా అనే పేరు పెట్టారు. సంప్రదాయం ప్రకారం.. ఈ పేరును ఎమెన్‌ దేశం సూచించింది. అయితే డిట్వా తుఫాన్‌ ఎక్కడ తీరాన్ని దాటుతుందన్న దానిపై ఐఎండీ ఇంకా స్పష్టతనివ్వలేదు. మరికొద్ది సేపట్లో ఈ తుపాన్ తీరాన్ని దాటే ప్రాంతాన్ని వెల్లడించే అవకాశం ఉంది. డిట్వా తుపాన్ చెన్నైకి సమీపంలో ల్యాండ్‌ఫాల్‌ కావచ్చని వివిధ వెదర్‌ మోడల్స్‌ చెబుతున్నాయి. ఐఎండీ ప్రస్తుత అంచనాల ప్రకారం డిట్వా తుపాన్ మరింత బలపడే అవకాశం లేదు. అది రానున్న మూడు రోజులు (ఈనెల 30 వరకు) తుపాన్ గానే కొనసాగవచ్చని భావిస్తోంది.
వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి?
డిట్వా తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలపై ఉండనుంది. గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈనెల 29, 30, డిసెంబర్‌ 1 తేదీల్లో మాత్రం వర్షాలు ఊపందుకుంటాయి. ఫలితంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే 30వ తేదీన ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆయా జిల్లాల్లో 10 నుంచి 20 సెం.మీల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 28 నుంచి ఒకటో తేదీ వరకు ఈ జిల్లాల్లో గంటకు 70–90 కి.మీలు, గరిష్టంగా వంద కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయి.
వీటిపై ప్రభావం ఉండొచ్చు..
+ తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలు, పెనుగాలుల ధాటికి రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిని రవాణాకు అంతరాయం కలగవచ్చు.
+ సముద్రంలో చిన్న ఓడలు, బోట్లు దెబ్బతినే అవకాశం ఉంది.
+ కొండ చరియలు విరిగి పడడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కావచ్చు. గుడిసెలు, కచ్ఛా ఇళ్లు కూలిపోవచ్చు. వరదలు సంభవించవచ్చు.
+ చేతికొచ్చిన పంటలు దెబ్బతింటాయి.
+ హెలికాప్టర్‌ సర్వీసులకూ అంతరాయం కలగవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలివే..
తుపాన్ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. అవిః
+ తుపాన్ వల్ల ముప్పు వాటిల్లితే ముందుగా మరో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లడానికి ప్రజలు సంసిద్ధంగా ఉండాలి.
+ చెట్ల కింద, పురాతన ఇళ్లు, భవనాల్లో ఉండకూడదు. విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.
+ పర్యాటక, యాత్రలను మానుకోవాలి.
+ ప్రభుత్వం, ఐఎండీ ఇచ్చే సూచనలు, సలహాలను తప్పక పాటించాలి.
Read More
Next Story