
నకిలీ ’హాల్ మార్క్‘ తో బంగారం విక్రయాలు
గుంటూరు నగరంలో పలు బంగారు షాపులపై అధికారులు సోదాలు నిర్వహించారు.
గుంటూరు నగరంలోని లాలాపేట ప్రాంతంలో బంగారు దుకాణాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హాల్‌మార్క్ లేని నగలు విక్రయిస్తున్న పలు దుకాణాలను గుర్తించిన అధికారులు, ఆభరణాల నాణ్యతను వివరంగా పరిశీలించారు. సోదాల సమయంలో తక్కువ నాణ్యత గల బంగారు నగలు వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అలాగే నకిలీ హాల్‌మార్క్‌లు ఉపయోగించి మోసం చేస్తున్నట్టు గుర్తించారు. దుకాణదారులు నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా వ్యాపారం చేస్తున్నారని అధికారులు నిర్ధారించారు.
సోదాల్లో పాల్గొన్న బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి. అర్జున్ మాట్లాడుతూ, నిబంధనల మేరకు బంగారం విక్రయిస్తన్నారా, ఒరిజినల్ హాల్ మార్క్ ను ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను పరిశీలించడంతో పాటు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ నిబంధనల అమలును బలోపేతం చేయడంలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తామన్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాల్‌మార్క్ లేని లేదా తక్కువ కారట్ బంగారంను విక్రయించడం వల్ల వినియోగదారులు మోసపోతున్నారని, దీనిని నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సోదాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ సంఘటనలో గుర్తించిన దుకాణాల నుంచి నమూనాలు సేకరించి, ల్యాబ్ పరీక్షలకు పంపారు. తప్పుడు హాల్‌మార్క్‌లు ఉపయోగించడం వల్ల బంగారు ధరల్లో మోసాలు జరుగుతున్నాయని, ఇది ఆర్థికంగా పెద్ద నష్టానికి దారితీస్తోందని అధికారులు వివరించారు.
అధికారులు చేపట్టిన ఈ సోదాలు గుంటూరు జిల్లాలోని బంగారు వ్యాపారుల్లో ఒక్క సారిగా భయాన్ని కలిగించాయి. అధికారులు తనిఖీలు నిర్వమిస్తున్నారన్న సమాచారంతో ఉలిక్కి పడ్డారు. హాల్‌మార్కింగ్ విధానం 2021 నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలులోకి వచ్చినప్పటికీ, చాలా మంది వ్యాపారులు దీనిని పాటించకుండా ఉన్నారని బీఐఎస్ అధికారులు ఆరోపించారు. లాలాపేట ప్రాంతం గుంటూరులోని ప్రముఖ బంగారు మార్కెట్‌లలో ఒకటిగా పేరుగాంచిన చోటు కావడంతో అక్కడ సోదాలు జరిగాయి. వినియోగదారులు బంగారు కొనేటప్పుడు హాల్‌మార్క్‌ను తప్పక తనిఖీ చేయాలని, నకిలీ మార్కులను గుర్తించడానికి బీఐఎస్ అధికారులు ప్రత్యేక గైడ్‌లైన్‌లు జారీ చేశారు.

