ఇప్పటికే భారతీయ రైల్వే ధనిక, ఎగువ మధ్య తరగతి వారి కోసం ఆధునిక సౌకర్యాలతో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇక మధ్య, దిగువ మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఎన్నో మెరుగైన సదుపాయాలతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ల పేరిట నాన్ ఏసీ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆ వరుసలో తొలి అమృత్ భారత్ రైలును డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టింది. ఇలా ఇప్పటివరకు 12 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ పరంపంరలో పదమూడో రైలును ఒడిశాలోని బ్రహ్మపుర (బరంపురం) నుంచి గుజరాత్‌లోని ఉధ్నా (సూరత్)కు కొత్త సర్వీసును శనివారం ప్రారంభించింది. ఈ రైలు దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ఆధునిక, సరసమైన రైలు సర్వీసు ఖనిజ సంపన్న, ప్రాంతాలను, వస్త్ర, వాణిజ్య కేంద్రాలతో అనుసంధానించడం ద్వారా ఆర్థిక, పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు, శ్రామిక శక్తి కదలిక, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడనుంది.
అమృత్ భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
అమృత్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం 10.45 గంటలకు ఒడిశాలోని ఝార్సుగుడ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్‌లో ఉన్న అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఐదు రాష్ట్రాల్లోని పలు కీలక జిల్లాలను కవర్ చేస్తుంది. ఆ మార్గంలో అనేక ప్రధాన పట్టణాలు, నగరాలను కలుపుతుంది.
ప్రారంభోత్సవంలో బ్రహ్మపురలో అమృత్ భారత్ రైలు
ప్రారంభ రైలు వివరాలివీ..
బ్రహ్మపుర–ఉధ్నాల మధ్య 09022 నంబరుతో నడిచే ప్రారంభ రైలు శనివారం ఉదయం 10.45కి బ్రహ్మపురలో బయలుదేరింది. మార్గమధ్యలో పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, తొట్లాగర్, రాయ్‌పూర్, నాగపూర్,.భూసావల్, నందుర్‌బార్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు మరికొన్ని స్టేషన్లలోనూ ఆగుతుంది. ఈ అమృత్ భారత్ రైలుకు 22 కోచ్‌లుంటాయి. 11 జనరల్ సెకండ్ క్లాస్ సిటింగ్ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజి వ్యాన్లు, ఒక ప్యాంట్రీ కారు ఉంటాయి. ఈ రైలు 19021/19022 నంబర్లతో ఉధ్నా–బ్రహ్మపూర్–ఉధ్నాల మధ్య అక్టోబర 5 నుంచి రెగ్యులర్ సర్వీసుగా నడుస్తుంది. 1710 కిలోమీటర్ల ఈ దూరాన్ని 30.45 గంటల్లోనే చేరుకుంటుంది.
స్టేషన్లలో సాదర స్వాగతం..
అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేరు డివిజన్ పరిధిలో ఆ రైలు ప్రయాణించే శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లలోను, ఖుర్దా డివిజన్‌లోని పలాస స్టేషన్‌లోనూ వందలాది మంది విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, విజయనగరంలో పార్వతీపురం ఎమ్మెల్యే బి.విజయచంద్ర స్వాగతించారు. ఆయా స్టేషన్లలో అందంగా అలంకరించి, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ రైలు విశిష్టతలను తెలియజేశారు. ఆగిన స్టేషన్లలో ప్రజలు, విద్యార్థులు అమృత్ భారత్ రైలు పక్క నిల్చుని సెల్ఫీలు దిగారు. విశాఖ నుంచి పలాస వరకు ప్రత్యేక రైలులో విద్యార్థులను, మీడియా ప్రతినిధులను, రైల్వే సిబ్బందిని తీసుకెళ్లారు. బ్రహ్మపుర నుంచి పలాస వచ్చిన అమృత్ భారత్ రైలులో వీరిని ఎక్కించి విశాఖ తీసుకొచ్చారు.
సరసమైన ధరలకే టిక్కెట్టు..
ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సుదూర ప్రాంతాలకు సరసమైన ధరలతో, సురక్షితమైన, వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రూపొందించారు. ఈ రైలులో ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, అప్‌గ్రేడ్ సీటింగ్, ప్యాంట్రీ కార్‌తో పాటు ప్రయాణికులకు అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. వందే భారత్ రైలు మాదిరిగానే ఆగిన స్టేషన్, తర్వాత వచ్చే స్టేషన్లను ముందుగానే అనౌన్స్ చేస్తుంది. వాటి పేర్లను డిస్‌ప్లే చేస్తుంది. గంటకు 130 కి.మీల గరిష్ట వేగంతో ప్రయాణించడం వల్ల ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సుదూర ప్రయాణికులకు పలు రైళ్లను మారే అవసరాన్ని తప్పిస్తుంది. ఎన్నో సదుపాయాలున్నప్పటికీ సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ చార్జీలనే రైల్వే శాఖ వసూలు చేస్తుంది.
ఏపీ మీదుగా నడిచే రెండో అమృత్ భారత్..
ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇప్పటికే ఒక‡ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఇది 13433/34 నంబర్లతో పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి కర్నాటకలోని బెంగళూరుల మధ్య నడుస్తోంది. శనివారం లాంఛనంగా ప్రారంభమైన 19021/ 19022 ఎక్స్‌ప్రెస్ రెండోది. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలాస విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురంల మీదుగా ప్రయాణిస్తూ గుజరాత్‌లోని సూరత్ (ఉధ్నా) చేరుకుంటుంది.
అమృత్ భారత్ కథ ఇదీ..
దేశంలో అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నాన్ ఎయిర్ కండిషన్డ్) రైలును తొలిసారిగా 2023 డిసెంబర్ 30న ప్రవేశపెట్టారు. ఈ మొదటి రైలును తూర్పు కోస్తా రైల్వేలోని దర్భంగా–ఆనందవిహార్ టెర్మినల్ మధ్య ప్రారంభించారు. తక్కువ టిక్కెట్టు చార్జితో ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ వేగంగా గమ్యాన్ని చేర్చే ఉద్దేశంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఇవి తయారవుతున్నాయి. అమృత్ భారత్ రైలుకు రెండు వైపులా పుష్ ఫుల్ ఇంజన్లుంటాయి. ఒక్కో రైలుకు రూ.65 కోట్లు ఖర్చవుతోంది. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి అమృత్ భారత్ రైళ్లు 12 నడుస్తున్నాయి. బ్రహ్మపూర్–ఉధ్నా రైలు 13వది. దేశవ్యాప్తంగా 200కు పైగా అమృత్ భారత్ రైళ్లను నడపాలన్నది ఇండియన్ రైల్వేస్ లక్ష్యం. ప్రస్తుతం 50 రైళ్ల కోచ్‌లు నిర్మాణంలో ఉన్నాయి.
వాల్తేరు డీఆర్‌ఎం ఏమన్నారంటే..
అమృత్ భారత్ 13వ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే? ‘ ఈ రైలు తూర్పు తీరం నుంచి పశ్చిమ, మధ్య భారత్‌లను కలుపుతుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది సూరత్‌లోని టెక్స్‌టైల్స్ పరిశ్రమల్లో పనులకు వెళ్తుంటారు. తక్కువ చార్జి, తక్కువ సమయంలోనే వీరు వెళ్లి రావడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ శనివారం అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవంతో పాటు సంబల్‌పూర్ సిటీ–సార్ల మధ్య రూ.273 కోట్లతో నిర్మించే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన, కోరాపుట్–బైగుడ, మనబార్–కోరాపుట్– గోరాపూర్‌ల మధ్య రూ.955 కోట్లతో 82 కి.మీల మేర నిర్మించిన డబ్లింగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేశారు’ అని వివరించారు.