
విజయనగరం జిల్లాలో మరణించిన రాజేశ్వరీ, పక్కన స్క్రబ్ టైపస్ పురుగు
ఏపీకి 'స్క్రబ్ టైఫస్' గుబులు, విజయనగరం జిల్లాలో తొలి మరణం
ఈ వ్యాధి సోకితే ఏమి చేయాలి?, ఎలా గుర్తించాలి?
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా హడలెత్తిస్తోంది. విజయనగరం జిల్లాలో తొలి మరణం నమోదు అయింది. అయితే ఈ మరణాన్ని అధికారికంగా ధృవీకరించలేదు గాని రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేసులు ఉన్నాయో ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి (36) స్క్రబ్ టైఫస్ వ్యాధితో మరణించినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. జ్వర తీవ్రత పెరగడంతో ఆమె ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియా సోకిందని కొన్ని పరీక్షలు చేయించారు. చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో రాజేశ్వరి నవంబర్ 30న మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది.
ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లోనూ ఈ వ్యాధి సోకిన కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే విజయనగరం జిల్లాలోని తొలి మరణాన్ని ఇంకా ధృవీకరించలేదు.
స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?
స్క్రబ్ టైఫస్ అనేది 'Orientia tsutsugamushi' (ఓరియంటియా సుత్సుగముషి') అనేది రికెట్సియాసియే కుటుంబానికి చెందిన మైట్-బర్న్ బాక్టీరియా. మనుషుల్లో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధికి కారణం అవుతుంది. ఇది ట్రోంబికులిడే ఫ్యామిలీకి చెందిన క్రిమి. ఇది కణాంతర పరాన్నజీవి. ఈ బ్యాక్టీరియాను చిగ్గర్ మైట్ (Chigger mite) అనే సూక్ష్మజీవి మానవ దేహానికి చేరుస్తుంది. సాధారణంగా పొదలు, పంట పొలాలు, గడ్డి ప్రాంతాలు, అడవి దారుల్లో ఈ సూక్ష్మ జీవులు ఉంటుంటాయి.
ఇవి రకరకాల రూపంలో మనిషి శరీరంలోకి చేరుతుంటాయి. ఏవైనా క్రిమికీటకాలు కుట్టినపుడు ఇవి శరీరంలోకి జొరపడతాయి.
స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు...
1. నిరంతర జ్వరం
2. తీవ్రమైన అలసట
3. ఒళ్లు నొప్పులు
4. శరీరంపై దద్దుర్లు, చర్మంపై నలుపురంగులో పుండ్లు
5. తలనొప్పి, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ సమస్యలు
సకాలంలో గుర్తించకపోతే ఈ వ్యాధి ప్రమాదకర స్థితికి చేరుకునే అవకాశముంది.
ఏపీలో ఏ జిల్లాలో ఎన్నెన్ని కేసులు?
ఈ వ్యాధి అన్ని జిల్లాల్లో వ్యాపిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.
వైద్యశాఖ లెక్క ప్రకారం నమోదైన కేసులు ఇలా ఉన్నాయి:
చిత్తూరు – 379 కేసులు
కాకినాడ – 141
విశాఖపట్నం – 123
వైఎస్సార్ కడప – 94
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు – 86
అనంతపురం – 68
తిరుపతి – 64
విజయనగరం – 59
కర్నూలు – 42
అనకాపల్లి – 41
శ్రీకాకుళం – 34
అన్నమయ్య – 32
గుంటూరు – 31
నంద్యాల – 30
ఈ కేసుల విస్తరణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
స్క్రబ్ టైఫస్‌ను నివారించవచ్చు...
స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తిస్తే సాధారణ యాంటిబయాటిక్స్‌తోనే పూర్తిగా నయం చేయవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ ప్రకటించారు. ఆలస్యం చేస్తే ముఖ్యంగా నిర్లక్ష్యం చేస్తే, జర్వం తగ్గకపోయినా డాక్టర్ ను సంప్రదించకుండా ఉంటే హానీ చేయవచ్చునని గుంటూరుకు చెందిన డాక్టర్ విజయ సారధి సలహా ఇచ్చారు.
1. జ్వరం రెండు రోజులకు మించి కొనసాగితే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.
2. గ్రామాలు, అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూముల వద్ద పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
3. చిగ్గర్ మైట్స్ నివసించే ప్రాంతాల్లో శరీరాన్ని కప్పే దుస్తులు ధరించాలి.
4. పంట పొలాల్లో పని చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి.
స్క్రబ్ టైఫస్ మొదట ఎక్కడ గుర్తించారు?
స్క్రబ్ టైఫస్ వ్యాధిని మొదట 19వ శతాబ్దం చివర్లో తూర్పు ఆసియాలో గుర్తించారు. తొలి క్లినికల్ కేసులు జపాన్‌లో నమోదు అయ్యాయి. 1870–1900 మధ్య జపాన్ సైనికులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ వ్యాధి కనిపించింది. మొండి జ్వరంగా దీన్ని తొలుత భావించినా పరిశోధకులు మాత్రం స్క్రబ్ టైఫస్గా గుర్తించారు. దీనికి కారణం Orientia tsutsugamushi అనే సూక్ష్మజీవి అని కూడా జపాన్ పరిశోధకులే మొదట గుర్తించారు.
1920లలో జపాన్ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి కారణమైన బాక్టీరియాను పరిశీలించి, అది చిగ్గర్ మైట్ అనే సూక్ష్మజీవి కుట్టడం వల్ల వస్తుందని శాస్త్రీయంగా నిరూపించారు.
ఇండియాలో మొదట ఎక్కడ కనిపించింది?
భారతదేశంలో స్క్రబ్ టైఫస్‌ను మొదట హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, అస్సాం వంటి పర్వత, అటవి ప్రాంతాల్లో గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు, గడ్డి పొదలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈ వ్యాధి ఎక్కువగా కనిపించింది. 2000 సంవత్సరం తరువాత ఇది అన్ని దక్షిణ రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఇప్పుడు దేశమంతటా విస్తరించిన సూచనలు కనిపిస్తున్నాయి.
ఏమైనా, విజయనగరం మహిళ రాజేశ్వరి మృతి స్క్రబ్ టైఫస్ ప్రమాదాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. వ్యాధి తీవ్రత ఉన్నప్పటికీ, సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే నయం అవుతుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, వ్యాధి లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం.
Next Story

