ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్..ఈ ఏడాది 22 మంది మృతి
x

ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్..ఈ ఏడాది 22 మంది మృతి

గత మూడేళ్లుగా స్క్రబ్ టైఫస్ ప్రభావం చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కనిపిస్తోంది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న 'స్క్రబ్ టైఫస్' జ్వరం ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. గత రెండేళ్లుగా కేసులు వేలల్లో నమోదవుతున్నా మరణాలు సంభవించలేదు. కానీ, ఈ ఏడాది పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి 22 మంది మరణించడం ఆరోగ్య శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ ఈ వ్యాధి ఉద్ధృతి పెరుగుతోంది.

చిత్తూరు జిల్లాలో తిష్టవేసిన వ్యాధి

రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ, గత మూడేళ్లుగా స్క్రబ్ టైఫస్ ప్రభావం చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కనిపిస్తోంది. 2023లో 548 కేసులు నమోదు కాగా, 2024లో 514 కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే 491 కేసులు నమోదై జిల్లాను వణికిస్తున్నాయి. పొరుగున ఉన్న తిరుపతి జిల్లాలోనూ గతేడాది 184 కేసులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 99 కేసులు వెలుగు చూశాయి. ఈ ప్రాంతాల్లో వ్యాధి మూలాలను కనుగొనడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కాకినాడ, విశాఖలోనూ ముప్పు

కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా, కోస్తా జిల్లాల్లోనూ స్క్రబ్ టైఫస్ కోరలు చాస్తోంది. ఈ ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ (198 కేసులు) రెండో స్థానంలో ఉండగా, విశాఖపట్నం (158 కేసులు) మూడో స్థానంలో ఉంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ శివారు ప్రాంతాల్లోనూ ఈ కేసులు బయటపడుతుండటం గమనార్హం.

ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యం

స్క్రబ్ టైఫస్‌ను తొలి దశలో గుర్తిస్తే అతి తక్కువ ఖర్చుతో, సాధారణ యాంటీబయోటిక్స్‌తో నయం చేయవచ్చు. అయితే, అవగాహన లేక ప్రజలు దీన్ని సాధారణ జ్వరంగా భావిస్తున్నారు.

ఆలస్యమే శాపం: జ్వరం రాగానే సొంత వైద్యం లేదా సాధారణ పారాసిటమాల్ బిళ్లలతో కాలక్షేపం చేస్తున్నారు.

అవయవాల వైఫల్యం: పరిస్థితి విషమించి ఊపిరితిత్తులు, కిడ్నీలపై ప్రభావం పడ్డాక ఆసుపత్రులకు చేరుతున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.

అప్రమత్తతే రక్షణ

పరిసరాల అపరిశుభ్రత, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధిని వ్యాప్తి చేసే 'చిగ్గర్ మైట్స్' ( నలుసు పురుగులు లేదా గజ్జి పురుగులు) పెరుగుతాయి. పొలాలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.

ఇంటి చుట్టూ పారిశుధ్యం పాటించాలి.

జ్వరం వచ్చినప్పుడు చర్మంపై ఎక్కడైనా నల్లటి మచ్చ (Eschar) ఉందో లేదో గమనించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వైద్య నిపుణుల హెచ్చరిక: స్క్రబ్ టైఫస్ విషయంలో జాప్యం వద్దు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే రక్తం పరీక్ష చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read More
Next Story