ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అని ఆలోచించినట్లయితే బాలికలు లేదా స్త్రీలు అడుగడుగునా అన్ని విషయాల్లో అణచివేతను ఎదుర్కొంటున్నరు. ఏ దేశ జనాభాలోనైనా స్త్రీలు లేదా బాలికలు దాదాపు సగం మంది ఉంటున్నారు. వీరు సాంఘికంగా, ఆర్థికంగా, లైంగిక వివక్షతో అడుగడుగున అణచి వేతకు గురవుతున్నారు. ప్రపంచ దేశాలలో బాలికలు అణచి వేయబడే విషయంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. బాలికలు లేదా స్త్రీలు అణచివేతకు గురవడం అనేది పురాతన కాలము నుంచి ఇప్పటి వరకు రోజూ జరిగే ప్రక్రియలో భాగమే, దీనిలో పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆడపిల్ల దేశానికి గర్వకారణం అంటున్నాం. తల్లిదండ్రులను ప్రేమించడంలో ఆడపిల్లలను మించిన వారు ఇంకొకరు ఉండరంటే ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. తనకు వివాహం జరిగి అత్తారింటికి వెళ్లిపోయినా సరే.. తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పటికీ మరచిపోదు. అందుకే పెద్దలు ‘కొడుకు ప్రేమ కోడలు వచ్చే వరకూ.. కూతురి ప్రేమ జీవితాంతం..’ అని అంటుంటారు. అయితే వాస్తవ పరిస్థితులను దదృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే ఆడపిల్లల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
కోవిడ్ –19 మహమ్మారి తర్వాత మానవ సంబంధాల్లో ఏర్పడ్డ సంఘర్షణల నేపథ్యంలో బాలికలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు విద్య, శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నంటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను, వీడియోలను అందరితో పంచుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపు నిచ్చింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 19, 2011 న ఒక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ రోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వారి హక్కులను నెరవేర్చే దిశగా, వారిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. అణగారిన బాలికల హక్కుల కోసం గొంతు కావాలనేదే ఈ రోజు ప్రాముఖ్యత. బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు, విద్యలో సమాన అవకాశాలు, లింగ వివక్ష, బాలికలపై హింసలేని సమాజ నిర్మాణం కోసం ఈ దినోత్సవం సందర్భంగా ప్రతిన బూనాలని ఐక్యరాజ్య సమితి పిలుపు నిచ్చింది.
ఇక మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పిస్తూ.. ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాము. ‘బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను రక్షించాలి అనే వివిధ ప్రచారాలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ ఏడాది ‘గరల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్’ అనే ఇతి వృత్తంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారు. బాలుర నిష్పత్తితో పోల్చుకుంటే, బాలికల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నది. వారిపై లైంగిక వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సావిత్రి బాయి పూలే వంటి వారు బాలికా విద్యకై ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాలికల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే ఇవి క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. వీటిని మరింత పటిష్టంగా అమలు చేయాలి. అదే విధంగా బాల్య వివాహాలను నియంత్రించాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి. వారికి ఆత్మరక్షణ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. ‘గుడ్ టచ్, బాడ్ టచ్’ గురించి చెప్పాలి. యుక్త వయసులో వచ్చే మార్పులు తెలియజెప్పాలి. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు వస్తుంది.
ఉదాహరణకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ సుధా మూర్తి కూడా చదువు అయిపోయిన తర్వాత లింగ వివక్షకు గురైంది. చదువు అయిపోయిన తర్వాత టాటా గ్రూప్ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు నీవు స్త్రీవి ఈ ఉద్యోగం ఎలా చేయగలవు అని అవహేళనగా మాట్లాడటం జరిగింది. ఈ విషయంలో సుధా మూర్తి గట్టిగా వ్యతిరేకించి నాకు అవకాశం ఇవ్వండి నా సమర్థత ఏమిటో నిరూపిస్తా అని చెప్పారు. ఈ విధంగా వారికి నచ్చచెప్పిన తర్వాత ఉద్యోగం ఇచ్చారు. ఈమె ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి టాటా గ్రూపు నుంచి బయటకు వచ్చి నారాయణమూర్తిని వివాహము చేసుకొని ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్‌గా ఉంటూ కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతానికి ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉంటూ స్త్రీల హక్కుల కోసం నిరంతరం పార్లమెంటులో నాయకులను నిలదీస్తూనే ఉంది.
పాకిస్తాన్‌లోని ఓ చిన్న గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కూతురైన మలాల ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. చిన్నతనములో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగాన్ని కొంత ఆక్రమించి పాకిస్తాన్ సైన్యంతో కొంతకాలం యుద్ధం చేసి పాకిస్తాన్ సైన్యంపై ఆదిపత్యం సాధించారు. ఆ ప్రాంతంలోని ముస్లిం బాలికలు చదవటానికి వీలులేదని ఆదేశం జారీ చేశారు. అప్పటి వరకు మదర్సాలో చదువుతున్న ముస్లిం బాలికలు చదువు మానేసి ఇళ్లకే పరిమిత మయ్యారు. ఆ సమయంలో మలాల చదువు మానకుండా కొనసాగిస్తూ తీవ్రవాదుల దుశ్చర్యలను ఐక్యరాజ్య సమితికి, అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ కు స్త్రీ అణిచివేత మీద అనేక లేఖలు రాశారు. ఈ రకంగా మలాల రాసిన ఉత్తరాలకు తీవ్రవాదుల నుంచి అనేక బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులను తట్టుకొని చదువు కొనసాగించింది. ఒకసారి స్కూల్ బస్సులో వెళ్తున్న మలాలను చంపాలని బస్సుపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఆమె తృటిలో చావును తప్పించు కొన్నది. అప్పుడు ఈమె రాసిన ఉత్తరాలకు ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ప్రతిస్పందించి ఆమెను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించటానికి ఆహ్వానించింది. ప్రపంచ చరిత్రలో అతి చిన్న వయసులో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన బాలిక ఈ మలాల. ముస్లిం తీవ్రవాదుల బెదిరింపులకు లొంగకుండా చదువును కొనసాగించింది. దీనికి అతి చిన్న వయసులోనే నోబెల్ బహుమతి అందుకుంది. ప్రపంచ చరిత్రలో ఇది అరుదైన అంశం.
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు రాజ్యాలను, లేదా దేశాలను పరిపాలించారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారిలో శ్రీమతి ఇందిరా గాంధీ, సిరిమావో బండారి నాయకె, ఖలీదా జియా, బెనజీర్ భుట్టో మొదలైన వారు. ఇలాంటి సమర్థులైన స్త్రీ మూర్తులను లేదా బాలికలను అణచివేయటం జరుగుతుంది. ఇలాంటి అణచి వేతలే కాకుండా సాంఘిక దురాచారాలైన కన్యాశుల్కం, బాల్య వివాహం, వేశ్య వాటికలు, జోగిని వ్యవస్థ, మాతంగి కన్యలు, ఇలాంటివి స్త్రీని అదఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. ఈ సాంఘిక దురాచారాలకు స్త్రీ బాగా నష్టపోతోంది.
పోషకాహార విషయాల్లో లైంగిక విచక్షణతో పోషకాహారాలు స్త్రీలకు లేదా బాలికలకు సరిగా అందక ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది చనిపోతున్నారని నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ చెప్పారు. ప్రపంచ జనాభాలో 50 శాతం వరకు బాలికలు లేదా స్త్రీలు ఉన్నారు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా స్త్రీని అణిచివేస్తున్నాం. స్త్రీలకు సమాన హక్కులు కల్పించడమే కాకుండా ఆచరించి స్త్రీ విద్యను ప్రోత్సహించి వారిని అభివృద్ధిలో భాగ స్వాములను చేద్దాం.
మనకు ప్రేమను పంచే తల్లి, చెల్లి, నాయనమ్మ, అమ్మమ్మ, పిన్ని, అత్త వారందరి చిన్ననాటి రూపమే బాలికలు. ఇలాంటి బాలికలను మనము ప్రేమగా చూసుకుందాం, ప్రేమగా పెంచుకుందాం, రక్షణ కలిపిద్దాం, బాగా చదివిద్దాం, ధైర్య సాహసాలు నేర్పుదాం, ఎలాంటి వైపరీత్యాల నైనా తట్టుకొని జీవించే విధంగా సామాజిక బాధ్యత వారికి కూడా కల్పించి ముందుకు నడిపిద్దాం. స్త్రీలు లేనట్లయితే మానవ సమాజమే ఉండదు. స్త్రీల అభ్యున్నతికి మనం కంకణబద్దులవుదాం.