సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ఆపరేటర్లు, స్పందించని యంత్రాంగం
విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లడానికి ఫ్లైట్ ఛార్జ్ రూ. 3,500.ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి వసూలు చేస్తున్నది 4వేలు. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్నారు.
శంకర్ వడిశెట్టి
పుల్లట్ల రాజేశ్ గుంటూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేశ్ స్వగ్రామం పలాస దగ్గరలో ఉంది. ఈసారి సంక్రాంతికి సొంతూరు వెళ్లాలని ఆశించాడు. అయితే తీరా బస్సులు, రైళ్లు ఖాళీ లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయించగా ఏకంగా తలకి రూ. 6వేలు చొప్పున టికెట్ అనడంతో ఖంగుతినాల్సి వచ్చింది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి పండుగ కోసం వెళ్లాలంటే గుంటూరు నుంచి సుమారు 600 కిలోమీటర్ల ప్రయాణానికే రూ. 24వేలు అడగడంతో నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఇది కేవలం రాజేశ్ ఒక్కరి అనుభవమే కాదు. ఇలాంటి వేలాది మంది ఈసారి సంక్రాంతికి సొంతూరులో బంధువులతో గడపాలని ఆశించినా తమ ఆశ నెరవేరడం లేదని వాపోతున్నారు. ప్రయాణాల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు, రైలు సదుపాయం లేకపోవడం, ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తే ఏకంగా విమాన ఛార్జీలతో సమానంగా వసూలు చేస్తుండడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
"నవంబర్ లోనే రైలు టికెట్ కోసం ప్రయత్నించాను. కానీ రిజర్వేషన్ దొరకలేదు. బస్సులయితే మూడు మారాల్సి ఉంటుంది. అయినా సర్ధుకుపోదామని చూస్తే ఖాళీలు లేవు. అందుకని ప్రైవేటు ట్రావెల్స్ కోసం ఆలోచిస్తే వాళ్లు చెప్పిన రేటుకి భయపడాల్సి వచ్చింది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లడానికే రూ. 4వేలు అడిగారు. ఇక అక్కడి నుంచి ఇంకెంత అవుతుందోనని భయపడి ప్రయాణమే మానుకున్నామంటూ" రాజేశ్ వివరించారు.
నియంత్రణ కరువు
సంక్రాంతికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. రెండు రోజులుగా విజయవాడ- హైదరాబాద్ హైవే వాహనాల రద్దీతో నిండిపోయింది. వేలాదిగా ప్రైవేటు వాహనాలు, ఇతర మార్గాల్లో జనం సొంతూళ్లకు తరలివస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లయితే కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి.
ఏటా సంక్రాంతికి ఇలాంటి రద్దీ ఉంటుందన్న అంచనా ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా తగినన్ని ఆర్టీసీ, రైలు సర్వీసులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు వాహనాలను కట్టడి చేయడానికి కూడా సిద్ధం కాకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులను నియంత్రించాల్సిన రవాణా శాఖ అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు.
ఇది ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లకు అవకాశంగా మారింది. ఇష్టారాజ్యంగా సాగుతోంది. సాధారణ రోజుల్లో నాన్ ఏసీ సిట్టింగ్ బస్ లో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లడానికి రూ. 700-900 మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడది ఏకంగా రూ. 3 నుంచి 4వేలు వసూలు చేస్తున్నారు. అయినా అడ్డుకునే యంత్రాంగమే కనిపించడం లేదు. ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని పలువురు ప్రయాణీకులు వాపోతున్నారు. అనివార్యంగా వెళ్లక తప్పని వాళ్లు జేబులు గుల్ల చేసుకుని సొంతూళ్లకి చేరుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రత్యామ్నాయంగా స్కూల్ బస్సులు
ఈసారి సంక్రాంతి కోసం 3,900 అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ వాసుల కోసం చర్లపల్లి స్టేషన్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 43 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వాటిలో 16 జనసాధారణ్ రైళ్లని తెలిపింది. వాటిలో మొత్తం బోగీలన్నీ జనరల్ బోగీలే ఉంటాయని తెలిపింది. వాటికి తోడుగా 15 ఎక్స్ ప్రెస్ రైలుకి అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వందే భారత్ వంటి రైళ్లకి కూడా అదనంగా 4 చైర్ కార్ బోగీలను ఏర్పాటు చేసింది.
ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రయాణీకుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో స్కూల్ బస్సులను కూడా రంగంలో దింపుతున్నారు. ఫిట్ గా ఉన్న బస్సులన్నింటినీ ఆర్టీసీ తీసుకుని ప్రయాణీకులను సొంతూళ్లకు చేరవేసేందుకు ఉపయోగించాలని ఆర్టీసీ ఎండీగా కూడా ఉన్న డీజీపీ ద్వారకా తిరుమల రావు అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ ను కట్టడి చేయకుండా దూర ప్రాంత ప్రయాణాలకు స్కూల్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడే అవకాశం లేదని విశాఖకు చెందిన ప్రయాణీకుడు లక్కోజు రాంబాబు అన్నారు.
"హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవాలి. విజయవాడ వరకూ ప్రైవేటు కారులో వచ్చాం. ఒక్కొక్కరికి రూ. 1500 తీసుకున్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్లడానికి బస్సులు లేవు. స్కూల్ బస్సుల్లో అంత దూరం ప్రయాణించడం చాలా కష్టం. అందుకే ఇతర మార్గాలు చూస్తున్నాం. ఓ గంట ఆలశ్యమయినా శ్రేయస్కరంగా చేరాలి కాబట్టి ప్రైవేటు వాహనాలేమయినా దొరుకుతాయని చూస్తున్నామంటూ"ఆయన వివరించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లను కట్టడి చేసి ఉంటే ఇంత సమస్య ఉండకపోయేదని, ప్రభుత్వం అటువైపు దృష్టి పెట్టలేదని రాంబాబు అభిప్రాయపడ్డారు.