పీ4లో మార్గదర్శిగా పారిశుధ్య కార్మికురాలు
x

పీ4లో మార్గదర్శిగా పారిశుధ్య కార్మికురాలు

పేదరికం నిర్మూలనలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు కోరారు.


కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కూడా పీ4 కార్యక్రమంలో భాగస్వామిగా మారి మార్గదర్శిగా ఉండేందుకు ముందుకు వచ్చి.. ఓ పేద వృద్ధురాలిని ఆదుకునేందుకు సిద్దమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పీ4లో తాను ఎవర్ని బలవంతం పెట్టడం లేదని, బాధ్యతగా చూడాలనే చెబుతున్నానని చెప్పారు. విజయవాడ నోవాటెల్‌ హోటల్లో గురువారం పీ4 కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండాలని వారిని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపించాం. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన ఆంధ్రప్రదేశ్‌ లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా పని చేశాం. ఎన్నో సంస్కరణలు తెచ్చాను. కానీ ఎప్పుడూ కలగని తృప్తి.. పీ4 కార్యక్రమం ద్వారా కలుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.

అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్‌ కలాం, మోదీ వంటి వారు సామాన్య కుటుంబాల్లోనే పుట్టారు. నాతో సహా ఈ సమావేశంలో ఉన్న చాలా మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చారు. నాడు సమాజం నుంచి ఎంతో సహకారాన్ని అందుకున్నాం.. ఉన్నతస్థితికి చేరాం. ఇప్పుడు అసమానతలు లేని సమాజం కోసం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు చేసేది చిన్న సాయమే కావచ్చు.. పేదరికంలో ఉన్నవారికి ఆ సాయమే అతి పెద్ద ఆలంబనగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో నేను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. మార్గదర్శిగా నిలిచాను. బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు నా సహచర మార్గదర్శకులతో పోటీ పడతా. ఇప్పటి వరకు 10,81,281 మంది కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వెల్లడించారు.

ఎంత సంపాదించినా మనమేమీ తీసుకెళ్లేది లేదు..అంతా ఇక్కడే వదిలి పెట్టి వెళ్లాలి.. అందుకే గివ్‌ బ్యాక్‌ పాలసీని అమలు చేయగలిగితే...సమాజానికి మరింత మంచి చేసిన వాళ్లు అవుతారు. పేదరికంలో ఉన్నవాళ్లకి చేయూతనివ్వాలి.. వాళ్లకు కెరీర్‌ గైడెన్స్‌ ఇవ్వాలి. సరైన సమయంలో గైడ్‌ చేయగలిగితే.. పేదరికంలో ఉన్న వాళ్లు కూడా మంచి స్థాయికి వెళ్లడానికి అవకాశం కల్పించినవారవుతారు. ప్రాధాన్యత క్రమంలో బంగారు కుటుంబాలకున్న అవసరాలపై సర్వే చేయించాం. ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా బాధ్యత తీసుకుంటే దత్తత కుటుంబాల్లో స్కిల్స్‌ పెంపొందించడం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. బంగారు కుటుంబాలను కూడా మీ కుటుంబాలుగా భావించి సాయం చేయండి అని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు.
సమాజంలో మనతో ఉన్నవాళ్లు.. పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఉండడం మంచిది కాదు. సాయం చేయడంలో రకరకాలు ఉంటాయి.. ఇటీవల కాలంలో కొందరు టీచర్లు ముందుకు వచ్చారు. చదువు చెప్పడం ద్వారా పేదల ఎదుగుదలకు తోడ్పడతామని చెబుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కో–స్పాన్సర్స్‌ విధానాన్ని తెస్తున్నాం. ఆర్థిక సాయం చేసే వారు చేస్తారు.. అలాగే విజ్ఞానాన్ని అందించే వారు కూడా ఆ దిశగా కృషి చేస్తారని చంద్రబాబు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పారిశ్రామికవేత్తలు.. అలాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీఎం చంద్రబాబు పిలుపుతో పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారు. ఆన్‌ లైన్‌ సమావేశంలో పాల్గొన్న మరి కొందరు ఎన్నారైలు కూడా మార్గదర్శకరులుగా ఉంటామని సీఎంకు హామీనిచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్‌ రెడ్డి అనే పారిశ్రామిక వేత్త ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. సౌదీ నుంచి వచ్చిన రాధాకృష్ణ, మహ్మాద్‌ అరిఫ్, సుచరిత వంటి వారు 10 కుటుంబాలను దత్తత తీసుకుంటామని చెప్పారు.
అలాగే వరప్రసాద్‌ అనే పారిశ్రామిక వేత్త కూడా తనతో పాటు.. ఇంకొందరు గ్రూపుగా ఏర్పడి.. బొమ్మనహాళ్‌ మండలాన్ని దత్తత తీసుకున్నామని.. దీనికి సంబంధించిన ఓ రిపోర్ట్‌ తయారు చేసి ఇస్తామని చెప్పారు. కూరపాటి అనే ఎన్నారై 160 స్కూళ్లను దత్తత తీసుకుంటామని.. గొర్రెపాటి చందు అనే వ్యక్తి 10 కుటుంబాలు తీసుకోవడంతో పాటు.. తమ మిత్రులతో కలిసి.. మరో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళూరి భాను అనే ఎన్నారై 20 కుటుంబాల్లోని పిల్లలకు చదవు చెప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. యూఎస్‌ఏకి చెందిన విశ్వప్రసాద్‌ 10 కుటుంబాలు.. సింగపూర్‌ కు చెందిన రాంబాబు అనే వ్యక్తి 2 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ విజయానంద్, పీ4 ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ కుటుంబరావు, ఎన్నార్టీ ఛైర్మన్‌ వేమూరి రవి, ప్రణాళిక శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story