సీఎంకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఇసుక, మద్యం!
x

సీఎంకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఇసుక, మద్యం!

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇసుక సరఫరా, మద్యం వ్యాపారం నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరు కారకులు?


ఇసుక సరఫరా, మద్యం వ్యాపారం గత ప్రభుత్వంలో ప్రభుత్వమే నిర్వహించింది. ప్రస్తుతం ఈ రెండింటినీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌ వారికి అప్పగించింది. సకాలంలో ఇసుక వినియోగదారులకు చేరటం లేదు. పైగా ఉచితంగా ప్రభుత్వం తీసుకుపోవాలని చెబుతున్నా బోలెడంత డబ్బు ఇసుక కోసం చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఇసుక నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ వారికి అప్పగించడంతో క్వారీల వద్ద ఇష్టారాజ్యంగా ఉంటోందని ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లే వారు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుని వెళ్లినా ఒక్కోసారి రోజంతా అక్కడ నిలబడాల్సి వస్తోందంటున్నారు. తవ్వేవారు ఆలస్యం చేసినా, లారీలకు ఎత్తేవారు ఆలస్యం చేసినా తామే ఇబ్బంది పడాల్సి వస్తోందని, పైగా లారీలు క్యూకట్టి ఉండాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.

రాత్రులకు రాత్రులు హైదరాబాద్, బెంగళూరులకు వందల్లో లారీలు ఇసుక లోడ్‌లతో వెళుతున్నా పట్టించుకునే వారు లేరని, ఎవరైనా వారిని ఆపితే పలానా తాలూకూ వారని చెప్పగానే పంపించేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయినా దందా ఆగటం లేదని పలువురు బిల్డర్‌లు చెబుతున్నారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని బిల్డర్లు ఎవరు తీసుకెళుతున్నారనే విషయం అధికారులకు స్పష్టంగా తెలుసునని అంటున్నారు.

క్వారీల వద్ద ఏమి జరుగుతోంది. ఎలా తవ్వకాలు చేస్తున్నారు. లోడింగ్‌ ఎలా చేస్తున్నారు. నిర్వహణ ఎలా ఉంటోంది. వాహనాలు సక్రమంగా వస్తున్నాయా? లేదా? అనే అంశాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నేరుగా క్వారీల వద్దకు త్వరలోనే వెళ్లనున్నారు. ఎప్పుడు వెళతారనేది మాత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదు.
ఇక మద్యం వ్యాపారుల్లో ఎక్కువ మంది అధికార పార్టీ అండదండలతో షాపులు దక్కించుకున్న వారే ఉన్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. షాపుల కోసం దరఖాస్తులు చేసుకునే సమయంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించారని, అందుకే వారు అనుకున్న వారే ఎక్కువ మంది దరఖాస్తులు చేయడంతో వారికే షాపులు వచ్చాయనే విమర్శలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుతం బ్రాండ్స్‌ రేట్లు కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే అవన్నీ సర్థుకుంటాయని, మద్యం ధరలను అదుపు చేస్తామని, అందుబాటులోనే ధరలు ఉంటాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయినా ఆవైపుగా ఆలోచించిన దాఖలాలు లేవు. ఒకానొక దశలో స్థానిక నేతలను మద్యం వ్యాపారంలో తల దూర్చకుండా ఉండేందుకు సీఎం తీసుకున్న చర్యలు విఫలం కావడంతో మద్యం షాపులు తమ వారికి దక్కెలా చేసిన నేతల నుంచి పార్టీ ఫండ్‌ వసూలు చేయాలని పార్టీలోని ముఖ్య నాయకులకు సీఎం సూచించారనే ప్రచారం కూడా సాగింది.
అందులో నిజం ఎంత ఉందో కాని, మద్యం వ్యాపారంలో అధికార పార్టీ పెత్తనం ఉందనేది మాత్రం బహిరంగ చర్చకు దారి తీసింది. మద్యం దుకాణాల్లో విక్రయాలపై, మద్యం నాణ్యతపై రాజీలేకుండా సీఎం అధికారులతో సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం ప్రత్యేకంగా మద్యం, ఇసుకపై సమీక్ష నిర్వహించారు. బెల్ట్‌షాపులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని చంద్రబాబునాయుడు చెప్పినప్పటికీ వేలం పాటలు నిర్వహించి బెల్ట్‌షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే బెల్ట్‌షాపుల్లో ఎమ్మార్పీని పక్కన బెట్టి అధిక ధరలకు అమ్మడం మందు బాబులకు మింగుడు పడటం లేదు. ఇసుకలో దోపిడీ కొనసాగుతూనే ఉందనే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో క్వారీల పర్యటనకు సీఎం బయలు దేరనున్నారు.
Read More
Next Story