దుమారం రేపుతోన్న సజ్జల వ్యాఖ్యలు
x

దుమారం రేపుతోన్న సజ్జల వ్యాఖ్యలు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు దుమారం రుపుతున్నాయి. ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు సంబంధించిన అవగాహన సదస్సు బుధవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన సదస్సులో పాల్గొని ఏజెంట్లకు దిశా నిర్థేశం చేశారు. అయితే అది రూల్స్‌ పాటించమని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోమని కాదు. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రత్యర్థులను అడ్డగించడమే ప్రధాన లక్ష్యంగా నూరి పోశారు. కౌంటింగ్‌ సమయంలో మన టార్గెట్‌ ప్రత్యర్థులను నిలువరించడమే ప్రధానమని, దాని గురించిన అవగాహన ఉండాలని, దానికి అవసరమైన అంశాలను తెలుసుకోవాలని సూచించారు.

కౌంటింగ్‌లో ప్రత్యర్థుల పార్టీలకు చెందిన వారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వాటిపైన అవగాహన చేసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ చెందిన ఓట్లను చెల్లనివిగా ప్రత్యర్థుల పార్టీలు కుట్రలు చేస్తాయని, అలా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏమి చేయాలో, ఏ విధానాలు అనుసరించాలో అలాంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించాలని, అంతేకానీ రూల్స్‌ అలా ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్‌ ప్రకారం పోదామని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చో కూడదని దిశా నిర్థేశం చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. అంతేకాకండా కౌంటింగ్‌ సమయంలో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా రూల్స్‌ను ఎంచుకోవాలి, అలా ప్రత్యర్థుల ఆటలు సాగకుండా రూల్స్‌ను ఎలా చూసుకోవాలనే దానిపైన ఆలోచనలు చేయాలి. అవసరమైతే దానికోసం ఎంత వరకు పోరాటం చేయాలనేది అలవర్చుకోవాలని, ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తన వంతు పాత్ర పోషించేలా అనుకూలంగా ఉంటూ వారి మెదళ్లల్లోకి బాగా ఎక్కించాలని చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు డైరెక్షన్‌లు ఇచ్చారు. ఈ సందర్భంలో ఆ యా అంశాలకు సంబంధించి మన ఏజెంట్లు వాదనలు చేసినా పర్వాలేదని కాస్త గట్టిగానే నూరి పోశారు. అయితే రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గే వాడైతే ఏజెంట్‌గా వద్దని సజ్జల వ్యాఖ్యలు చేయడంతో దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు తాడేపల్లి పోలీసులు 153, 505, 125 ఐపీసీ సెక్షన్‌ల కింద సజ్జలపై కేసు నమోదు చేశారు.

ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పలువురి నేతలపై కేసులు నమోద అయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, కౌంటింగ్‌ కేంద్రాల్లో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతర కరంగా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
ఎన్నికల అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ నేతల వ్యవహార శైలి, చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగానే మారుతున్నాయి. సజ్జల లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లోను వినిపిస్తోంది. బాధ్యాయుతమైన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, అంతేకాకుండా తాము ఓడి పోతున్నారనే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్‌ కూడా ఉంది. గెలుస్తామనే ధీమా ఉండొచ్చు. కానీ ఓవర్‌ కాన్‌ఫెడెన్స్‌ మంచిది కాదనే అభిప్రాయం కూడా అదే పార్టీ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఇవి తమ కేడర్‌ను కాపాడుకునేందుకే ఇలాంటి వ్యవహార శైలికి తెర తీసారనే టాక్‌ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
Read More
Next Story