లిక్కర్ స్కామ్‌లో ఏ6 నిందితుడిగా ఆరోపణల ఎదుర్కొంటూ విజయవాడ జైల్లో ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సంచలన విషయాలు వెలుగు చూడటంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం సరఫరాలో సజ్జల శ్రీధర్‌రెడ్డి కీ రోల్ పోషించాడు. జనాదరణ పొందిన బ్రాండ్‌లను నిలపివేసి, నాసిరకం బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం మార్కెట్‌లోకి తీసుకొని రావడంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి కీలక పాత్ర పోషించాడు. నాడు ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో దీనిపై సమావేశం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిలతో పాటు ఈ సజ్జల శ్రీధర్‌రెడ్డి కూడా పాల్గొనట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ సమావేశంలో నెలకు దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు వివిధ రూపాల్లో మద్యం ద్వారా సాంపాదించొచ్చని ఒక అంచనాకు వచ్చారు. తర్వాత కార్యాచరణకు తెరతీశారు. అంతేకాకుండా సజ్జల శ్రీధర్‌రెడ్డి మద్యం పాలసీ రూపకల్పనలోను, ఆ తర్వాత దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తీసుకునే మీటింగుల్లో కూడా పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
బ్రాండెడ్ కంపెనీలను వెనక్కి పంపివేసి, సొంత తయారీదారులను తెరపైకి తెచ్చి వారి ద్వారా మద్యం తయారీ చేయడంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. వాది ద్వారా నగదను వెనుకేసుకోవడంలో కీ రోల్ పోషించాడు. ఎస్పీవై రెడ్డి డిస్టలరీల వ్యాపారాన్ని తిరిగి బలోపేతం చేసుకునేందుకు రూ. 45 కోట్ల రుణాన్ని అందించాలని సజ్జల శ్రీధర్‌రెడ్డి కోరాడు. ఆ మేరకు అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి ఆ రూ. 45 కోట్ల రుణాన్ని శ్రీధర్‌రెడ్డికి అందించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, జగన్ ఐటీ సలహదారు రాజ్ కసిరెడ్డి, నాటి ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ హయాంలో సీఎంలో చక్రం తిప్పిన ధనుంజయ్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డిలతో కూడిన మద్యం సిండికేట్‌కు 12 శాతం వడ్డీతో రుణాన్ని తిరిగి చెల్లించినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. అరబిందో కంపెనీ ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా లిక్కర్ బ్రాండ్లను ఉద్దేశిపూర్వకంగా అణిచివేసేందుకు, చట్టవిరుద్ధంగా ఆర్డర్ ఫర్ సప్లై జారీ చేయడంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి కీలక పాత్ర పోషించాడు.
అటు డిస్టలరీలు, ఇటు లిక్కర్ సిండికేట్లను సమన్వయం చేసుకుంటూ సకాలంలో కిక్‌బ్యాక్‌లు వచ్చే విధంగా శ్రీధర్‌రెడ్డి వ్యవహరించాడు. మొత్తమ్మీద లిక్కర్ స్కామ్‌లో సజ్జల శ్రీధర్‌రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి మీద 409, 420, 120,(బి),ఆర్/డబ్ల్యూ సెక్షన్ 34, 37 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 7, 7ఏ, 8, 13(1)(బి), 13(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.